ప్రజాశక్తి - ఏలూరు సిటీ
భూ యాజమాన్య హక్కులు ఉన్న ప్రతి ఒక్కరూ పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందడం ద్వారా విశేష సేవలు పొందొచ్చని జిల్లా కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17 నుండి 26 వరకూ నిర్వహించే ఆధీనపు మార్పు వారోత్సవాలను చింతలపూడి మండలం ప్రగఢవరంలో కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి రికార్డు స్పష్టంగా ఉంటే ఆ భూమిపై ఎవరు హక్కు వారికి తెలుస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో భూమికి సబంధించిన సేవలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఎప్పటికప్పుడు తమకు చెందిన భూ హక్కులను స్పష్టంగా ఉంచుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుందనే భావనతో తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు రాసుకోవడం సరైన పద్దతి కాదని సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని రెవెన్యూ రికార్డుల్లో పొందుపర్చుకోవాలన్నారు. తద్వారా పట్టాదార్ పాస్‌పుస్తకం పొంది ఆ భూమిపై రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పొందడం వంటి అనేక విశేష సేవలు పొందొచ్చన్నారు. భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిగితే వెంటనే గ్రామ రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ, అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, ఆ సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండకపోవచ్చని, ఈ దృష్ట్యా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రజలకు ముందే చెప్పి గ్రామ సభల ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేందుకు ఆధీనపు మార్పుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. వివాదాస్పద భూములు, సాగులో లేని భూములు, కోర్టు కేసుల్లో ఉన్న వాటికి విచారించి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేస్తామన్నారు. గ్రామాల్లో రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భూమిపై హక్కు ఉన్న ప్రతి ఒక్కరి వద్దా పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉండాలనే ఉద్ధేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ భూ రికార్డు నిర్వహణ రెవెన్యూ శాఖ ప్రధాన బాధ్యతన్నారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచితే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమైన సమస్యలూ తలెత్తవని, శాంతి భద్రతలకు భంగం కలగవన్నారు. జిల్లాలో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ యాజమాన్య హక్కుపత్రం పొందగోరే వారు నాలుగు ఫొటోలు, క్లయిమ్ దరఖాస్తు గ్రామాధికారులకు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా 51 మంది రైతులకు భూమి యాజమాన్య హక్కు పత్రాలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.
మూడు నెలలకోసారి రేషన్ ఆచరణ సాధ్యమేనా..?
జలదిగ్బంధనంలో ఏజెన్సీ గ్రామాలు
ఎర్రకాలువలోకి భారీగా చేరిన నీరు
అంకిత భావంతో పని చేయాలి : ఎస్పి రవివర్మ
కొవ్వూరులో భారీ వర్షం : లోతట్టు ప్రాంతాలు
సమస్యల నిలయం.. జంగారెడ్డిగూడెం బిసి హాస్టల్
క్రీడల్లో నైపుణ్యం వెలికితీసేందుకు యువక్రీడా ఖేల్
తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు చర్యలు
30 నుండి సిపిఎం ప్రచార యాత్రలు