2011-12 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ పై తీవ్ర జాప్యం జరుగుతోంది. బ్యాంకు ఖాతాలు తెరిస్తే వారికి డబ్బులు వస్తాయి. లేకుంటే వాపస్ వెళ్లనున్నాయి. వ్యవసాయ, బ్యాంకు అధికారులు రైతులకు తక్షణమే బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా నత్తనడకన కొనసాగుతోంది. ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ ధరకంటే అధికంగానే విక్రయించడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రాలేవు. అయినా జిల్లా యంత్రాంగం కొరత లేదని చెబుతోంది. దేశంలోనే తొలిసారిగా సంపూర్ణ పారిశు ధ్యం కింద వంద శాతం వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిన గ్రామాలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దంటూ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల హెక్టార్లలో 4.24 లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారు. జిల్లాను ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2011 సంవత్సరంలో పంటలు నష్టపోతే ఏప్రిల్‌లో రూ.106 కోట్లు మంజూరయ్యాయి. బ్యాంకు ఖాతాలు తెరిస్తేనే రైతులకు డబ్బులు వస్తాయి. లేకుంటే అంతేసంగతులు. ఈ వారంలోగా రైతులందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి, తప్పులు లేకుండా చూడాలని, లేని పక్షంలో డబ్బులు వాపస్‌పోతాయని జిల్లా కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. ఇంకా నెల రోజులవుతున్నా ఇన్‌పుట్ సబ్సిడీ పూర్తయ్యే పరిస్థితి లేదు. త్వరగా బ్యాంకుఖాతాలు తెరిపించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. అప్పుడూ రైతులకు ఏమైనా ఉపయోగం కలుగుతుంది. జిల్లాకు 1.50 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా ఇప్పటి వరకూ 25,675 మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంకా 43 వేల మెట్రిక్ టన్నులు ఈ నెలాఖరులోగా రావాల్సి ఉంది. ఇంకా సాగు ప్రారంభంలోనే ఎరువుల సమస్య ఉత్పన్నమవుతుంటే..ఇక ఖరీఫ్ సాగు జోరందుకున్నప్పుడు ఏలాంటి సమస్యలేదుర్కొవాల్సి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు 5.28 లోల ప్యాకెట్ల విత్తనాలు అవసరం. ఇప్పటి వరకూ వచ్చినవి 2.54 లక్షల ప్యాకేట్లు మాత్రమే. ఇందులో12 వేల ప్యాకెట్ల మహికో విత్తనాలు వచ్చాయి. అంటే జిల్లాకే కేటాయించిన వాటిలో 5 శాతం మాత్రమే మహికో పత్తి విత్తనాలు. మహికో పత్తి విత్తనాలకు డిమాండ్ ఉన్నా రాష్ట్రంలో ఆ కంపెనీలు లేవు. దీంతో సమస్య ఉత్పన్నమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని ఫర్టిలైజర్ దుకాణాదారులు ఎమ్మార్పీ ధరకంటే అధికంగా రూ.400-500 వరకూ విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్‌దుకాణాలపై విజిలెన్స్ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. గజ్వేల్‌లో ఓ ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేశారు. ఎమ్మార్పీ ధరలకంటే అధికంగా విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఓ సెల్‌ను ప్రారంభించారు. జనుము, పత్తి విత్తనాల కోసం దుకాణాల ముందు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా జిల్లాలో విత్తనాల, ఎరువుల కొరత లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు విత్తనాల, ఎరువుల కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
సంపూర్ణ పారిశుధ్యం గ్రామాల్లో మంచినీటికి రూ.28.51 కోట్లు
దేశంలో తొలిసారిగా మెదక్ జిల్లాలోలో చేపట్టిన సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమం కింద 100 రోజుల్లో 38,500 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం 192 గ్రామాలకు రూ.28.51 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇలా నేరుగా జిల్లాకే నిధులు పంపించడంలో దేశంలోనే తొలిసారి. ఆ నిధులను సంపూర్ణ పారిశు ధ్యం కింద 38,500 మరుగుదొడ్లు నిర్మించుకున్న 192 గ్రామాల్లో మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కానుందని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. సంపూర్ణ పారిశు ధ్యం కింద జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీన్ని దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోనూ ప్రవేశ పెట్టేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే దేశ వ్యాప్తంగా అమలైతే జిల్లా అదర్శంగా నిలవనుంది.
మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థకు అప్పగించొద్దని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. 10 సంవత్సరాల నుండి నెల నెలా బిల్లులురాకున్నా అప్పులు తెచ్చిన పథకాన్ని నిర్వహించామని వారంటున్నారు. పదేళ్ల నుండి తాము పని చేస్తుంటే స్వచ్ఛంద సంస్థకు అప్పగించడం సరైందికాదని అంటున్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ చూస్తూ ఊరుకోబోమని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. అదనపు జెసికి వినతిపత్రం సమర్పించారు. స్వచ్ఛంద సంస్థకు అప్పగించే ఆలోచనను విమర్శించుకోవాలని లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.