పరకాల టిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థిత్వాలపై ఆయా పార్టీల అధిష్టానాలు చేస్తోన్న కసరత్తు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొనడం సహజం. ఉప ఎన్నిక జరుగబోతున్న పరకాల నియోజకవర్గంలో చూస్తే మాత్రం ఎన్నికల ఫలితాల మాట అటుంచి ప్రధాన పోటీ ఇస్తారని భావిస్తోన్న టిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థుల ఎంపికపైనే మొదటి నుంచీ ఉత్కంఠ నెలకొంటుంది. హైదరాబాద్‌లోని ఆయా పార్టీల కార్యాలయాల్లో రెండ్రోజులుగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే అభ్యర్థుల ఎంపికపై జరుగుతోన్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. నేడో, రేపో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పాలమూరులో వచ్చిన ఫలితం టిఆర్‌ఎస్‌ను ఖంగు తినిపించగా, బిజెపిలో ఉత్సాహం నింపిన నేపథ్యంలో జరుగబోతున్న పరకాల ఉప ఎన్నిక రెండు పార్టీల బలాబలాలను నిరూపించుకునేందుకు వేదికగా మారింది. పరకాలలో గత ఎన్నికల్లో గెలుపుపై ఎంతో ధీమాను ప్రదర్శించిన టిఆర్‌ఎస్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న పరకాలలో ఓడి పోయిన టిఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికల్లో గెలవాలన్న ధృడనిశ్చయంతో ఉంది. మరోవైపు పాలమూరు విజయోత్సాహంలో ఉన్న బిజెపి పరకాలలో సైతం పోటీకి ముందుకు రావడంతో టిఆర్‌ఎస్‌కు ఆశనిపాతంగా తయారైంది. కొంతకాలంగా ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పరకాలపై ఎవరూ పట్టువీడని స్థితిలో ఉన్నారు. బిసి వర్గానికి చెందిన సాంబారి సమ్మారావు కాంగ్రెస్ నుంచి, కొండా సురేఖ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి, రిజైన్డ్ డిఎస్పీ నళిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓసి వర్గానికి చెందిన చల్లా ధర్మారెడ్డి టిడిపి నుంచి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో బిసిల ఓట్లు అధికంగా ఉండడంతో టిఆర్‌ఎస్, బిజెపిలు అభ్యర్థిత్వాలపై ఆచీతూచీ అడుగేస్తున్నాయి. సామాజిక వర్గ సమీకరణలను బట్టి బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ఎవరికి వారు వ్యూహాలు పన్నుతుండడంతో నెల రోజులుగా అభ్యర్థిత్వాలు ఎటూ తేలని పరిస్థితి ఉంది.
తుదిదశకు చేరుకున్న కసరత్తు ..ఒకటి రెండ్రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో కొనసాగుతున్న
కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టిఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, పొలిట్ బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డాక్టర్ విజయరామారావు, జగదీశ్‌రెడ్డి, అజ్మీరాచందూలాల్‌లతో కూడిన టిఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమావేశమై ఆశావాహులను పిలిపించుకుని విజయావకాశాలపై చర్చించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల సామాజిక, ఆర్థిక బలం, పార్టీపరంగా ఉన్న వెంట ఉన్న క్యాడర్, బలం, బలహీనతలను లక్ష్యంగా చేసుకుని ఆశావాహులతో సమావేశమయ్యారు. టిక్కెట్‌ను ఆశిస్తున్న మొలుగూరి బిక్షపతి, ముద్దసాని సహౌదర్‌రెడ్డి, కన్నెబోయిన రాజయ్యయాదవ్, లింగంపెల్లి కిషన్‌రావు, నాగుర్ల వెంకటేశ్వరరావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను ఒక్కొక్కరిగా పిలిచి తెలుసుకున్నారు. ఆశావాహుల నుంచి సేకరించిన సమాచారాన్ని కమిటీ అధినేత కెసిఆర్ ముందుంచినట్లు తెలిసింది. ఆశావాహుల నుంచి తీసుకున్న అభిప్రాయాలు, సమాచారాన్ని, ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన పల్లెబాట సందర్భంగా చేపట్టిన సర్వే నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థిని నిర్ణయించే పనిలో కెసిఆర్, పొలిట్‌బ్యూరో సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ కూడా అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయమై లోతుగా సర్వే చేసినట్లు తెలిసింది. సీనియర్ నేత, మాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి, ప్రముఖ ఆర్థోపెడీషియన్ డాక్టర్ విజయచందర్‌రెడ్డి, మరో వైద్యుడు డాక్టర్ సంతోష్‌కుమార్‌లతో పాటు పలువురు ఆశిస్తున్నారు.
టిఆర్‌ఎస్ నుంచి మొలుగూరి, ముద్దసాని పేర్లు
బిజెపి నుంచి జంగారెడ్డి, సంతోష్‌లలో ఒకరు
తుదిదశ కసరత్తు నేపథ్యంలో పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు...టిఆర్‌ఎస్‌లో బిసి వర్గం నుంచి పోటీ పెట్టాలనుకుంటే నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న మొలుగూరి బిక్షపతికి టిక్కెట్ ఖాయంగా కనిపిస్తోంది. ఓసివర్గం నుంచి అయితే రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముద్దసాని సహౌదర్‌రెడ్డిని నిలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, లేదంటే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాల పట్ల మొదటి నుంచి కెసిఆర్ ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరు మాత్రం ఉప ఎన్నికలో నిలబడేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరి నిమిషంలో...తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ది అభ్యర్థిత్వం ఖరారైనా ఆశ్చర్యపోవాల్సింది లేదనే అభిప్రాయం సైతం వినిపిస్తోంది. ఇక బిజెపి నుంచి ఓసి అయితే మాజీ ఎంపి జంగారెడ్డి పేరును కోర్ కమిటీ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఆయన కాదంటే ఇటీవలే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ విజయచందర్‌రెడ్డిని నిలిపే అవకాశముంది. బిసిలో అయితే డాక్టర్ సంతోష్‌కుమార్ అభ్యర్థిత్వం ఖాయమని చెప్పవచ్చు. రెండు పార్టీల అధిష్టానాల కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిన నేపథ్యంలో అనూహ్య, అవాంఛనీయ పరిణామాలేవైనా సంభవించకుంటే ఒకటిరెండ్రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలువడడం ఖాయమని తెలుస్తోంది.