ఉపాధి హామీ పనులు కల్పించాలని మండలంలోని రాంపురం కూలీలు ఎంపిడిఓ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. 100 రోజులు పనులు కల్పిస్తామని గొప్పలు చెప్పిన అధికారులు 100 గంటలు కూడా పనులు కల్పించలేదని ఉపాధి హామీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు లేకపోవడంతో పిల్లాపాపలతో పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 22 శ్రమశక్తి సంఘాలలో 560 మంది కూలీలు ఉండగా సుమారు 100 మంది కూలీలకు 12రోజుల పని దినాలు మాత్రమే పనులు కల్పించారని తెలిపారు. పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పనులు కల్పించే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని కూలీలు బైఠాయించారు. ఒక్కే సారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపిడిఓ మూర్తిరెడ్డి, ఎపిఓ వెంకట నారాయణ ఉపాధి కూలీలతో చర్చించారు. ఐదు నెలల క్రితం పీల్డ్ అసిస్టెంట్ రాజ్‌కుమార్ రాజీనామా చేయడంతో కూలీలకు పనులు కల్పించడం ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారికి తెలిపారు. పనులు అడిగిన కూలీలందరికి సోమవారాం నుండి పనులు కల్పిస్తామని హామీనిచ్చారు. దీంతో వారు ముట్టడి కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మోతెలాల్, పవరసింగ్, బాలకృష్ణ, బాలు, సారయ్య, నారాయణ, రాజేందర్, వీరస్వామిలతో పాటు కూలీలు పాల్గొన్నారు.