2008లో యుపిఎ పాలకులు ఘనంగా ప్రకటించిన రుణ మాఫీ పథకం క్షేత్రస్థాయిలో ఎంత అవినీతిమయమై సాగిందో కాగ్ లెక్కలు తేల్చి చెప్పారు. పేద రైతులు అప్పుల ఊబిలో కూరుకొని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం రుణమాఫీ హామీకే పరిమితమైంది. ప్రచారం పిండుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం, వాస్తవంగా సాయం అర్హులకు అందే చర్యలు గైకొనడంలో చిత్తశుద్ధి చూపింది లేదు. పైగా అవకతవకల వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్నది నిస్సందేహం. వ్యవసాయం తెలియని వారిని ఆదర్శ రైతులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తున్న తీరు చూసిన వారికి రుణ మాఫీలో జరిగిన అవినీతి తెలియదంటే నమ్మశక్యం కాదు. కాగ్ పరిశీలించిన పరిమిత స్థాయిలోనే అర్హులకు రుణాలందకపోవడం, అనర్హులు లాభం పొందడం, రుణాలను సూక్ష్మ రుణ సంస్థలకు దారి మళ్లించడం లాంటి నేరాలు విస్తృతంగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేస్తే ఇంకెన్ని మాఫియా కార్యక్రమాలు బయట పడతాయో! అన్నదాత కడుపుకొట్టి, ప్రజాధనం కొల్లగొట్టిన గ్రద్దలేవో బయట పడాలి. శిక్ష పడాలి. అవకతవకలకు ఊతమిచ్చిన బ్యాంకులపై చర్యలుండాలి.