మహాభినిష్క్రమణ విప్లవ పరిరక్షణ

కష్టతరమైనదీ, సుదీర్ఘమైనదీ, సందేహాలతో నిండినదీ, కోపతాపాలకు నిలయమైనదైనప్పటికీ ఇదే మార్గం. ఈ మార్గం : సోషలిజం - హ్యూగో చావేజ్‌

మనం ఒక విప్లవకారుణ్ణి కోల్పోయాం. అయితే కోట్లాది మందిమి ఆయనతో ఉత్తేజాన్ని పొందాం - రాఫెల్‌ కొరియా, ఈక్వెడార్‌ అధ్యక్షులు.

చావేజ్‌ లేకుండా 'బోలివేరియన్‌' సోషలిస్టు విప్లవం మనగలగుతుందా?

2002లో చావేజ్‌కు వ్యతిరేకంగా అమెరికా ప్రోద్బలంతో జరిగిన సైనిక తిరుగుబాటు లాటిన్‌ అమెరికాలో విప్లవానికి సంబంధించిన కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది. నిజానికి దక్షిణ అమెరికాలో ఈ ప్రశ్న పదే పదే పునరావృతమవుతూనే ఉంది. జాకోబ్‌ అర్‌ బెంజ్‌, చెడ్డీ జగన్‌, ఫైడల్‌ కాస్ట్రో, జో గౌలార్ట్‌, జు అన్‌, బోష్‌, సాల్విడార్‌ అలెండి, మైఖేల్‌ మాన్లే, మారిష్‌ బిషప్‌, డేనియల్‌ ఓర్టేగా, జాన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, హ్యూగో చావేజ్‌ (చే గువేరాది మరో కథ) మొదలగు ప్రగతి కాముక లాటిన్‌ అమెరికా నాయకులంతా గత 50 సంవత్సరాల కాలంలో అమెరికా దాష్టీకానికి బలైన వారే. విప్లవాన్ని లేక కనీస ప్రజా ప్రయోజనాలను నెరవేర్చే ప్రజాస్వామిక ప్రభుత్వాలను రక్షించుకోవడానికి అమెరికా ప్రేరేపిత ధనిక స్వామ్యాన్ని, దానికి కాపలాదారులైన పెంటగాన్‌, సిఐఎల నేతృత్వంలో నడిచే సాయుధ దళాలను ఎదుర్కోవడానికి విశాల ప్రజానీకం - కార్మికులను, కర్షకులను, విద్యార్థులను, సైనికులను, ప్రగతి కాముక క్యాథలిక్‌ మతాచార్యులను సమీకరించడం ఎలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరాన్ని ప్రతి చారిత్రిక సందర్భం గుర్తు చేస్తూనే ఉంది.

2012 అక్టోబర్‌ నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకు 'విప్లవం కేవలం ఒకే ఒక మనిషి మీద ఆధారపడి లేదు' అని చావేజ్‌ ప్రకటించాడు. హ్యూగో చావేజ్‌ నిష్క్రమణతో ఈ ప్రకటన పరీక్షకు పెట్టబడింది. వెనిజులా విప్లవం యొక్క ఎర్రబావుటా 50 సంవత్సరాల మాజీ బస్సు డ్రైవర్‌ ప్రస్తుత ఉపాధ్యక్షుడు నికొలస్‌ మదురో చేతికి అందివ్వబడుతోంది. చావెజ్‌ వ్యక్తిగత ముద్ర ఎంత ఉన్నా వెనిజులా విప్లవం సంస్థాగతంగా అత్యంత లోతుగా పాతుకుపోయిందని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికాస్‌'లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విక్టర్‌ బల్మర్‌ థామస్‌ చెప్పారు. సైన్యం, జాతీయ చమురు సంస్థ, న్యాయ వ్యవస్థ, కాంగ్రెస్‌ (పార్లమెంటు), విశాల ప్రజానీకంలో విప్లవ సంప్రదాయాలుగా బలంగా నాటుకు పోయాయని ఆయన చెప్పారు. వెనిజులాకున్న అపార చమురు నిల్వలు విప్లవం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. బ్రిటీష్‌ పెట్రోలియం యొక్క 'వరల్డ్‌ ఎనర్జీ రివ్యూ' ప్రకారం ప్రపంచంలోనే నిరూపితమైన చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం వెనిజులా. 296 బిలియన్‌ బారెల్స్‌ వెనిజులాలో ఉంటే సౌదీ అరేబియాలో 265 బిలియన్‌ బారెల్స్‌ చమురు నిక్షేపాలున్నాయి. చావేజ్‌ అధ్యక్షుడైన తర్వాత చమురు ధరలు పది రెట్లు పెరిగాయి.

అశేష వెనిజులా ప్రజానీకం విప్లవ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు పోరాటం చేయడానికి తమ సంసిద్ధతను తెలియజేస్తూనే ఉన్నారు. అయితే అసలు ప్రశ్నేమిటంటే విప్లవ కర్తవ్యాలను నెరవేర్చడానికి ప్రగతి కాముక శక్తులను ఏ స్థాయిలో సమీకరిస్తారనే విషయంలో వెనిజులా విప్లవం యొక్క భవిష్యత్తు ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే విప్లవ వర్గ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రజా ప్రాబల్యం, అంగ నిర్మాణం యొక్క తీరుతెన్నులను బట్టి వెనిజులా విప్లవ భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.