ద్రవ్య బిల్లు ఆమోదం తర్వాతే...

  • లోక్‌సభలో మహిళా బిల్లుపై ప్రణబ్‌ ముఖర్జీ
  • ఉప కోటాకు మూడు పార్టీల డిమాండ్‌
  • సభ రెండుసార్లు వాయిదా

లోక్‌సభలో ద్రవ్యబిల్లు ఆమోదం పొందిన తర్వాతే మహిళా బిల్లుపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో గురువారం నాలుగో రోజు కూడా గందరగోళం చెలరేగడంతో స్పీకర్‌ మీరా కుమార్‌ సభను రెండుసార్లు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే మహిళా బిల్లుపై సభ వేడెక్కిపోయింది. సమాజ్‌వాది, ఆర్‌జెడి, జెడి(యు) సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయి ఈ రిజర్వేషన్‌ బిల్లులో ఒబిసిలు, దళితులు, ముస్లింలకు కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ మీరా కుమార్‌ బిల్లుపై మాట్లాడాల్సిందిగా ఎస్‌పి అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, జెడి(యు) శరద్‌ యాదవ్‌, ఆర్‌జెడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కోరడంతో వీరు ఒబిసి, దళితులు, ముస్లింలకు ప్రత్యేక కోటా కావాలని డిమాండ్‌ చేశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందే ఈమేరకు దాన్ని సవరించాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సమాధానమిస్తూ 'బిల్లును సభలో ప్రవేశపెట్టేముందు మీతో సంప్రదిస్తాం' అని సమాధానమిచ్చారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఒక సభ ఆమోదిస్తే మరో సభ తిరస్కరించిన ఘటనలూ ఉన్నాయని ఆందోళన చేస్తున్న సభ్యులనుద్దేశించి అన్నారు.

చర్చలు, సంప్రదింపులు లేకుండా ఏకాభిప్రాయానికి రావడం సాధ్యంకాదని ప్రణబ్‌ అన్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలని, సగం రాష్ట్రాలు కూడా అంగీకారం తెలపాలని ఆర్థిక మంత్రి చెప్పారు. సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉందని, మహిళా బిల్లుపై చర్చలకు ఇంకా సమయముందని తెలిపారు. ఎస్‌పి అధినేత ములాయం మాట్లాడుతూ ప్రస్తుత రూపంలో ఉన్న మహిళా బిల్లు ఇప్పటికే ప్రగతి సాధించిన మహిళలకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తుందని, వెనకబడిన వారిని మర్చిపోతుందని అన్నారు. అందుకే తాము దళితులు, వెనకబడిన తరగతులు, ముస్లిం మహిళలకు కోటా అడుగుతున్నామన్నారు. బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో గందరగోళం నెలకొందని జెడి(యు) అధినేత శరద్‌ యాదవ్‌ అన్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అని, దీనిపై అన్ని పార్టీలతో చర్చలు జరిపితే కొంపలేం మునిగిపోవని అన్నారు. ఇప్పటి అనిశ్చిత పరిస్థితికి చర్చలు జరపడమే మార్గమని ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

రాజ్యసభలోనూ ఇదే సీన్‌

సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌

ఏడుగురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలంటూ రాజ్యసభలో బిజెపి, ఎఐఎడిఎంకె, లెఫ్ట్‌ పార్టీలు గురువారం డిమాండ్‌ చేశాయి. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అయితే సభలో వారి అనుచిత ప్రవర్తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించి రెండు వాయిదా తీర్మానాలకు అనుమతించాలంటూ ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే, ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ మహిళా బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో కొందరు సభ్యులు ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ పట్ల ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి సభ్యులను సస్పెండ్‌ చేయడంతో వారు సభా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, వారిని తిరిగి సభలోకి అనుమతించాలని కోరారు. దీనిపై శివసేన, ఎఐఎడిఎంకె సభ్యులు కూడా జైట్లీకి మద్దతు తెలిపారు. సభలో వారు ప్రవర్తించిన తీరును అన్ని పార్టీలూ ఖండించాయని సిపిఐ(ఎం) సభ్యులు సీతారాం ఏచూరి చెప్పారు. వారిని సస్పెండ్‌ చేయడం సంతోషకరమైన విషయం కాదన్నారు. సభా తీర్మానం ప్రాతిపదికన సస్పెండ్‌ చేసిన వారిని మళ్లీ సభలోకి అనుమతించేందుకు అదే విధమైన ప్రక్రియ అవలంభించాలని ఏచూరి సూచించారు. 'మా సహచరులను వెనక్కు పిలవాలని మేము కోరుకుంటున్నాం' అని డి రాజా (సిపిఐ) అన్నారు. సస్పెన్షన్‌ ఎత్తివేతకు సంబంధించి ప్రతిపక్ష నేత తగిన సూచనలివ్వాలని, 'ఆ ప్రక్రియ జరగనివ్వండి' అని అన్సారీ సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని కోరారు. ఇందుకు సంతృప్తి చెందని సభ్యులు పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో అన్సారీ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రకాష్‌ జవదేకర్‌, ప్రభాత్‌ ఝా (బిజెపి) సహా ప్రతిపక్ష సభ్యులందరూ ఇదే అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభ్యులు కోరుకోవడంలేదని చెబుతూ సమావేశమైన కొద్ది నిమిషాల అనంతరం 12 గంటల వరకూ సభను వాయిదా వేశారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్