పాక్‌ ఆరోపణలను కొట్టిపారేసిన భారత్‌

లాహోర్‌ పేలుళ్లలో భారత్‌ ప్రమేయం వుందంటూ పాక్‌ చేసిన ఆరోపణలను విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఖండించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పాక్‌ ఆరోపణలు అసలు ఆలోచనకు కూడా అందనివని, ఆధారరహితమైనవని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా భారత్‌ ప్రమేయం ఏ మాత్రం వుండబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పాక్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరితోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పేలుడుకు సంబంధించి పాక్‌ చేస్తున్న ఆరోపణలన్నీ ఉగ్రవాదంపై భారత వైఖరికి పూర్తి విరుద్ధమైనవన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ స్థిర నిశ్చయంతో ముందడుగు వేస్తోంది తప్ప ద్వంద్వ వైఖరిని అనుసరించటం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ సంతోషంగా వుంటేనే భారత్‌ శాంతియుతంగా వుంటుందని ఆయన అన్నారు.

పాక్‌ 'జలక్రీడ'లో సయీద్‌ ఒక భాగం

పాకిస్తాన్‌ ప్రభుత్వం నదీ జలాల పంపిణీ వివాదాన్ని తరచూ తెరపైకి తేవటంలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని భారత్‌ భావిస్తోంది. నదీ జలాల పంపిణీ వివాదానికి 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందమే కీలకమని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పాక్‌ సింధు నదీజలాల పంపిణీ ప్రస్తావించినపుడల్లా అక్కడ భారత వ్యతిరేక నినాదాలు జోరందుకుంటుండటంపై ఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సింధునదీ జలాల ఒప్పందం కోసం భారత్‌ తన పరిధి దాటి వచ్చిందని, సింధు నదీ జలాల కమిషన్‌ కూడా పలుమార్లు సమావేశమైందని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 1965, 1971 లలో రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినపుడు సైతం ఈ ఒప్పందం అమలులో వుందని గుర్తు చేస్తున్నాయి.అంతర్గతంగా సమస్యలు తలెత్తినపుడల్లా సింధునదీ జలాలను ప్రస్తావిస్తూ పాక్‌ ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని ఈ వర్గాలు తేల్చిచెబుతున్నాయి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్