మహిళా సంఘాల హర్షం

పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును రాజ్యసభ భారీ మెజార్టీతో ఆమోదించటంపై ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, జడబ్ల్యుపి, తదితర మహిళా సంఘాలు బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. మహిళాబిల్లుకు ఆమోదముద్ర వేయటం ద్వారా రాజ్యసభ దేశంలో లింగ సమానత్వం కోసం జరుగుతున్న కృషిలో కొత్త శకానికి మార్గాన్ని సుగమం చేసిందని ఈ సంఘాల నేతలు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంట్‌ సభ్యులు, అంకిత భావం కలిగిన వ్యక్తులు ఈ చారిత్రాత్మక దినాన్ని మరపురానిదిగా చేశారన్నారు. అనేక మంది పురుషులు, మహిళల మద్దతుతో ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులరాజీలేని వైఖరితో మహిళా వుద్యమం దీర్ఘకాలిక పోరాటాలతో సాధించిన ఈ విజయం అనన్య సామాన్యమైనదని వారు పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా బిల్లును వెంటనే లోక్‌సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందాలని, యుపిఎ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతునివ్వాలని వారు అన్ని పార్టీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనపై ఐద్వా తరపున సుధాసుందరరామన్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు తరపున అన్నీ రాజా, జెడబ్ల్యుపి తరపున డా.జ్యోత్స్న ఛటర్జీ, ఎండబ్ల్యుఎఫ్‌ తరపున సుగ్రా మెహందీ, ఎఐడిఎంఎఎం తరపున విమల్‌ తోరాట్‌, వైడబ్ల్యుసిఎ తరపున బెలువా శేఖర్‌ సంతకాలు చేశారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్