మహిళా సాధికారత దిశగా గొప్ప ముందడుగు

మహిళా రిజర్వేషన్‌ బిల్లు మహిళల సాధికరత దిశలో గొప్ప ముందడుగని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సోమవారం రాజ్యసభలో చెప్పారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేేషన్లకు సంబంధించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చర్య మైనార్టీలకుగానీ, ఎస్సీ, ఎస్టీ గిరిజనలకుగానీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి సభాస్థానానికి జరిగిన అగౌరవం పట్ల ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీకి ప్రధాని క్షమాపణలు తెలిపారు. 'ప్రభుత్వం తరపున మీకు నేను క్షమాపణలు చెబుతున్నాను' అని ఆయన అన్నారు. ఇటువంటి అగౌరవ ఘటనలు పునరావృతం కాకుండా, సభ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. మహిళా బిల్లుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం రావడాన్ని 'భారత ప్రజాస్వామ్య హృదయం సరైన స్థానంలో, సరైన లయలో ఉందనడానికి సజీవ సాక్ష్యం' అని ఆయన అభివర్ణించారు. బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలు, ఓబిసిల పట్ల సభ్యులు వ్యక్తంచేస్తున్న ఆందోళనలపై ఆయన స్పందిస్తూ మైనార్టీలు అభివృద్ధి ఫలాలను తగినంతగా పొందలేకపోతున్నారని, అయితే తమ ప్రభుత్వం పలు కార్యక్రమాల ద్వారా వారి అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు.

దేశంలో మహిళలకు గుర్తింపునివ్వడంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధి పరంగా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈ చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం మహిళా సాధికరత, విముక్తి దిశగా గొప్ప ముందడుగు కాగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం తన సంపూర్ణ శక్తిని గుర్తించినప్పుడు విద్య, ఆరోగ్యరక్షణ, తదితర రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు అంతమవుతాయని ప్రధాని చెప్పారు. భారత నిర్మాణంలోనూ, జాతీయ స్వాతంత్య్రోద్యమంలోనూ మహిళల త్యాగనిరతిని ఆయన గుర్తు చేస్తూ ఈ బిల్లు 'మన మహిళామణుల త్యాగాలకు ఇస్తున్న చిన్న కానుక' అని ఆయన అన్నారు. ఇది మహిళాలోకం సంబరాలు చేసుకోదగిన పరిణామమని అన్నారు. ఎప్పుడు ప్రారంభించామన్న విషయాన్ని ఎవ్వరూ అడగరని, అంతిమంగా మంచి జరగాలన్నదే అందరూ ఆకాంక్షిస్తారంటూ ప్రధాని ఓ ఉర్దూ నానుడితో తన ప్రసంగాన్ని ముగించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్