అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రులతో ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించిన సమావేశంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఏడు డిమాండ్లు లేవనెత్తారు. బంగ్లాదేశ్ తన భూభాగంలోని ఉగ్రవాద రహస్య స్థావరాలను నాశనం చేసేలా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని మాణిక్ సర్కారు డిమాండ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్రిపురలో తిరుగుబాట్లు గణనీయంగా తగ్గినప్పటికీ బంగ్లాదేశ్ సమీపంలోనే ఉండడంతో తమ రాష్ట్రానికి మరిన్ని కేంద్ర పారా మిలిటరీ దళాలు కావాలని, సరిహద్దు ఔట్‌పోస్టులు పటిష్టపరచాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి తెలిపారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టిఎస్‌ఆర్) బెటాలియన్‌ను పెంచాలని, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో రైళ్ల రక్షణ కోసం ఇండియన్ రిజర్వు బెటాలియన్‌ను నియమించాలని, స్పెషల్ బ్రాంచ్ అధికారుల శిక్షణకు, కాందిశీకులను వారి స్వస్థలాలకు తరలించేందుకు గాను రూ. 7.50 కోట్లు కేటాయించాలని కోరారు. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు నిధుల కేటాయింపు మరో ఐదేళ్లపాటు పొడిగించాలని, తిరుగుబాట్ల అణచివేతకు చేపట్టే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని మాణిక్ సర్కార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అణిచేసే విషయంలో దృష్టి పెట్టాలని, నిఘా వ్యవస్థ సామర్థ్యం పెంచాలని కోరారు. సరిహద్దులను పటిష్టం చేయాలని, రాష్ట్ర పోలీసు వ్యవస్థ సామర్థ్యం పెంచేందుకు, పోలీసు సంస్కరణల అమలుకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు.
సరిహద్దు కంచెపై 60 రోజుల్లో పరిష్కారం : చిదంబరం హామీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు కంచె నిర్మాణ సమస్యను 60 రోజుల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి పి చిదంబరం హామీ ఇచ్చారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచె నిర్మాణంపై ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేయాలని మేఘాలయ ముఖ్యమంత్రి డిడి లపాంగ్ చేసిన సూచనపై చిదంబరం పై హామీ ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల భేటీలో లపాంగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి స్థిరంగానే ఉందని, ఉగ్రవాద కార్యకలాపాలను తమ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన చెప్పారు.