ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు ఒబిసి కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. విద్య, ఆర్థిక, సామాజిక రంగాలలో వెనుకబడిన ముస్లింలకు సంపన్న శ్రేణి (క్రీమీలేయర్)ను మినహాయించి ఈ రిజర్వేషన్లను వర్తింప చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రంగనాధ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను అధ్యయనం చేసే కృషిలో కేంద్రం తలమునకలుగా ఉన్న సమయంలోనే వీటిని తాము ఆమోదించి, అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం సచివాలయంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తమ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఒబిసి వర్గాలకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విద్య, సామాజిక, ఆర్థిక రంగాలలో వెనుకబడిన ముస్లింలను గుర్తించే ప్రక్రియను తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని ఆయన వివరించారు. ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత వారికి ఒబిసి కేటగిరీలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒబిసిలకు ఏడు శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, ముస్లింల పది శాతం రిజర్వేషన్లతో ఇది మొత్తం 17 శాతానికి పెరగనున్నదని ఆయన వివరించారు. రు.4.5 లక్షలలోపు వార్షికాదాయం కుటుంబాలకు ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ నిర్ణయానికి తాము మతాన్ని ప్రాతిపదికగా తీసుకున్నామన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. విద్య, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్నే ప్రాతిపదికగా తీసుకుని ఈ రిజర్వేషన్లు వర్తింప చేస్తామన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి వున్న ముస్లింలను గుర్తించటం సాధ్యమేనని, తాము దానిని నిర్వర్తిస్తామని చెప్పారు.. కేంద్రం రంగనాధ్ మిశ్రా కమిషన్ నివేదికను వెలువరించిన తరువాత దీని అమలుకు తొలి అడుగు వేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ మాత్రమేనన్నారు.