త్రిపురలో 'రూ. 2కు కిలో బియ్యం' ప్రారంభం

  • ఆహార భద్రత కోసం 3వ రోజుకు చేరిన వామపక్షాల ధర్నా
  • కుంభవృష్టినీ లెక్కచేయకుండా భారీ ర్యాలీ, బహిరంగ సభ

ఆహార భద్రత కోరుతూ నాలుగు వామపక్ష పార్టీలు చేస్తున్న ధర్నా గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేయాలని, అందరికీ ఆహార భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కజేయకుండా వేలాదిమంది ప్రజలు వామపక్షాల పిలుపు మేరకు అగర్తల వీధుల్లోకొచ్చారు. ఇక్కడి వివేకానంద స్టేడియం నుంచి ప్రారంభమైన భారీ ప్రదర్శనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్‌ ధర్‌, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని లెక్కజేయకుండా తడుస్తూనే పెద్ద సంఖ్యలో ప్రజలు సభలో తమ ప్రియతమ నేతల ప్రసంగాలను ఆలకించారు.

లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ ఖగన్‌ దాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ మాట్లాడుతూ ఈరోజు(గురువారం) నుంచి రాష్ట్రంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం చొప్పున 35 కిలోల బియ్యాన్ని 2.95 లక్షల బిపిఎల్‌ కార్డుదారులకు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్రిపుర ప్రభుత్వం తనకున్న పరిమిత వనరులతోనే ఈ పని చేపడుతుండగా యుపిఎ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేకపోతోందని ఆమె ప్రశ్నించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలలో ఎన్ని అమలు చేస్తున్నాయని అడిగారు. యుపిఎ ప్రభుత్వంపై ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. కార్పొరేట్‌ సంస్థలకు వరాలు కురిపించడానికి, రూ. ఐదు లక్షల కోట్లకు పైగా పన్నుల హాలిడే ప్రకటించడానికి యుపిఎ ప్రభుత్వానికి వనరులుం టాయి గానీ, నిరుపేదలకు తిండిగింజలివ్వడానికి మాత్రం నిధులుండవా అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. దేశంలో కొనసాగుతున్న రైతాంగం ఆత్మహత్యలకు కాంగ్రెస్సే పూర్తి బాధ్యురాలని ఆమె పేర్కొన్నారు. లండన్‌ ఒలింపిక్స్‌ లో భారత్‌ స్వర్ణ పతకాన్ని సాధించకపోవచ్చుగానీ... ఇక్కడ యుపిఎ ప్రభుత్వం మాత్రం అవినీతిలో బంగారు పతకాన్ని సాధించిందని వ్యాఖ్యానించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్‌ ధర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ పార్టీకి ఒక దృక్పథం ఉందని, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం సంకుచిత దృక్పథం ఉందని పేర్కొన్నారు. పేదల, యువత వ్యతిరేక, తీవ్రవాద అనుకూల విధానాలు ఆ పార్టీకి ఉన్నాయని విమర్శించారు.