కేంద్రం ప్రతిపాదిస్తున్న జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సిటిసి)ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందుకు మద్దతు కూడగట్టేందుకుగాను సోమవారం ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం తమిళనాడు హౌస్‌లో జరిగిన భేటీలో తొలుత ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో దాదాపు 25 నిముషాలు జయ చర్చలు జరిపారు. చర్చల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు పట్నాయక్ నిరాకరించారు. పట్నాయక్‌తో భేటీ అనంతరం మోడీని కలిసిన జయ దాదాపు 40 నిముషాలు చర్చించారు. అయితే ఈ వివరాలను కూడా మీడియాకు వెల్లడించలేదు. మీడియాతో మాట్లాడేందుకు జయ విముఖత వ్యక్తంచేశారు. ఎన్‌సిటిసి ఏర్పాటును ఈ ముగ్గురు ముఖ్యమంత్రులూ మొదటి నుండి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ముఖ్యమంత్రుల సమావేశంలో జయ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన నిర్ణయాలపై రాష్ట్రాలతో సంప్రదించకుండా కేంద్రం 'రాష్ట్రాలలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోంది' అని విమర్శించారు. రైల్వే రక్షక దళం, సరిహద్దు భద్రతా దళం చట్టాల సవరణను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఎన్‌సిటిసి ఏర్పాటు వంటి ప్రధాన నిర్ణయాలపై కేంద్రం ముందుగా రాష్ట్రాలను సంప్రదించాలని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు.
ఇందులో ఏ మాత్రం జాప్యం జరిగినా అది శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.