అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో అధికారం నుండి తప్పుకున్న బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఇప్పుడు అఖిలేష్ నేతృత్వంలో అధికారం చేపట్టనున్న సమాజ్‌వాది పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. గత కాలపు 'గూండారాజ్' తిరిగి వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసిన బిఎస్పీ నాయకత్వం, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని తేల్చి చెప్పింది. పాలక సమాజ్‌వాది పార్టీ తమ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటుందన్న భయమే ఈ నిర్ణయానికి కారణమని బిఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. సమాజ్‌వాది పార్టీకి గూండా పార్టీగా గతంలో ఉన్న పేరే తమ భయాందోళనలకు కారణమని, ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతాయన్న విశ్వాసం తమకు లేదన్నారు. అదే విధంగా రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెద్దఎత్తున దాడులు జరిగే ప్రమాదముందని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బిఎస్పీ కఠిన నిర్ణయాలు తీసుకోనున్నదని ఆమె ఆదివారం ఇక్కడ జరిగిన పారీ ్ట కార్యకర్తల సదస్సులో ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా కేంద్ర దళాల పర్యవేక్షణలో జరగని ఎటువంటి ఎన్నికల్లోనూ తమ పార్టీ పాల్గొనబోదని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ నేత లేదా కార్యకర్త ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఎన్నికల్లో పాల్గొంటే వారిపై తక్షణమే సస్పెన్షన్ వేటు పడుతుందన్నారు. పార్టీ కార్యకర్తల ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునేందుకే తామీ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు.