2012-13 బడ్జెట్‌లో పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి, వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షులు పాటూరు రామయ్య, ప్రధాన కార్యదర్శి ఎ.విజయ రాఘవన్, సంయుక్త కార్యదర్శులు సునీత్ చోప్రా, హన్నన్ మొల్ల ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. 50 లక్షలకుపైగా సభ్యత్వంతో బలమైన సంఘంగా ఉన్న తమను ఈ ఏడాది కూడా బడ్జెట్ తయారీ ప్రక్రియలో సంప్రదించలేదని, అందుకే ఈ లేఖ రాస్తున్నామని వారు పేర్కొన్నారు. గ్రామీణ కార్మిక శక్తిలో దాదాపుగా సగంగా ఉన్న వ్యవసాయ కార్మికులు ప్రధానంగా ఉపాధి సమస్యను ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీరిలో మెజార్టీ మందికి భూములు లేవని, పైగా ఈ రంగంలో 1990ల్లో ఏడాదికి వంద రోజులుగా ఉన్న పని దినాలు నేడు 52కు పడిపోయాయని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులు బతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించి, రోజుకు రూ.250 కూలి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో ఉన్న ఈ రంగం కార్మికులకు మరింత ఉపాధి కల్పించలేకపోవడానికి, జిడిపిని పెంచేలా చర్యలు తీసుకోకపోవడానికి ప్రణబ్ ముఖర్జీ బాధ్యత వహించాలని ఎఐఎడబ్ల్యుయు డిమాండ్ చేసింది. 2011-12 బడ్జెట్‌లో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వంద కోట్ల నిధులు కోత విధించడాన్ని సంఘం నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపుల్లో కూడా కోతలు పడిన విషయాన్ని వారు ప్రస్తావించారు. సబ్సిడీని ఫెర్టిలైజర్స్‌పై 9 శాతం, ఆహారంపై 9.4 శాతం, ఆయిల్‌పై 38.5 శాతం తగ్గించారని, అదే సమయంలో గ్రామీణ తాగునీటి పథకానికి అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే రూ.400 కోట్ల కేటాయింపులు తగ్గించారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, ప్రజారోగ్య పథకాలు, టీకాలకు, సామాన్యులకు సంబంధించిన ఇతర పథకాలకు కేటాయింపులు తగినంతగా లేవన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ధరల పెరుగుదల, అక్రమ నిల్వలను నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. ఈ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, ఆహార భద్రతా చట్టానికి కూడా తగిన నిధులు కేటాయించాలని ఎఐఎడబ్ల్యుయు నేతలు డిమాండ్ చేశారు. తూర్పు ప్రాంతంలో మూతబడిన ప్రభుత్వరంగంలోని ఏడు ఎరువుల కర్మాగారాలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. తద్వారా ఎరువులు చౌకగా దొరకడంతోపాటు ఆ ప్రాంతాల నుంచి వలసలు వెళ్తున్న వారికి తగిన ఉపాధి కూడా లభిస్తుందని వారు పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ అవరాలను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
జయకు బాదల్ ఆహ్వానం
చెన్నయ్ : పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆహ్వానించారు. ఈనెల 14న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంజాబ్‌కు బాదల్ వరుసగా రెండవ దఫా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న విషయం విదితమే. ఈనెల 18న జరిగే శనకరన్ కోయిల్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తాను బాదల్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేనని జయలలిత నిస్సహాయత వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.