ఉన్నట్టా... లేన్నట్టా...?

  • నాలుగేళ్లుగా భర్తీకాని తహశీల్దార్‌ పోస్టు - ఆర్‌ఐసహా సిబ్బంది తరలింపు

పరిపాలనా సౌలభ్యం పేరిట గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ క్లష్టర్లు, కార్యదర్శుల వ్యవవస్థలతో పాటు అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం పట్టణ, నగర ప్రాంతాల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఉన్న కార్యాలయాల్లో సైతం అధికారులు, సిబ్బంది పోస్టులు సహా భర్తీ చేయడం లేదు. దీంతో, ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. పౌర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఫలితంగా ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దళారుల బారిన పడుతున్నారు. మల్కాపురంలో ఏర్పాటు చేసిన తహశీల్దార్‌ కార్యాలయంలో ఆరునెలలకే తహశీల్దార్‌ పోస్టు ఖాళీ కావడం, నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ భర్తీ చేయకపోవడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి తార్కాణం

మల్కాపురం పరిధిలోని ప్రస్తుతం 45, 46, 47, 48, 49 వార్డులు ఉన్నాయి. ఈ ఐదు వార్డుల్లో సుమారు రెండు లక్షల మంది నివాసముంటున్నారు. వీరంతా సుమారు 18కిలో మీటర్ల దూరంలో ఉన్న సీతమ్మదారలోని అర్భన్‌ తహశీల్దార్‌ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. దీంతో, అధిక సమయంతో పాటు ఖర్చులు కూడా వెచ్చించాల్సి వచ్చేది. కుల, నివాస, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలకు సైతం అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్య నుంచి గట్టేక్కేందు ఈ ప్రాంత వాసులు చేసిన అనే పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు స్పందించిన అధికార యంత్రాంగం 2006 జూన్‌ నెలలో మల్కాపురంలోని ములగాడ కాలనీలో తహశీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేసింది. అప్పట్లో ఎంఆర్‌ఓ వ్యవస్థ ఉండేది. తొలి ఎంఆర్‌ఒగా ఎన్‌.అర్జున్‌ పని చేశారు. ఒక ఆర్‌ఐ, ఇద్దరు విఆర్‌ఓలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, మిగిలిన సిబ్బందిని నియమించారు. దీంతో, స్థానికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమైయ్యేవి. సరిగ్గా ఆరు నెలలు గడవక ముందే అంటే 2007 ప్రారంభంలోనే ఎంఆర్‌ఓగా పని చేసిన అర్జున్‌ ఉద్యోగ విరమణ చేశారు. తొలి, మలి అన్నీ ఆయనే అయ్యారు. నాటి నుంచి నేటి వరకూ ఈ పోస్టు భర్తీ చేయలేదు. కాల క్రమీన ఆర్‌ఐ, ఇతర సిబ్బందిని బదిలీ చేసేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క విఆర్‌ఒ ఇక్కడ పని చేస్తున్నారు. దీంతో, స్థానికంగా ఏర్పాడిన కార్యాలయం వల్ల తమ కష్టాలు తీరుతాయని భావించిన స్థానికుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కార్యాలయం ప్రారంభమై ఆరుమాసాలు గడకముందే (అంటే సుమారు నాలుగేళ్లగా) ఇబ్బందులు పున:ప్రారంభమైయ్యాయి. గతం మాదిరిగా చిన్నపాటి పని చేయించుకోవాలన్నా సుమారు 18కిలో మీటర్ల దూరంలోనున్న సీతమ్మదార అర్భన్‌ తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా కార్యాలయానికి వెళ్లాలంటే సుమారు రూ.30 ఛార్జీలు భర్తించాల్సి వస్తోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిపనులు మానుకోవాల్సి వస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా రెవెన్యూపరమైన పనులు చేసేందుకు కొంతమంది దళారులుగా అవతారమెత్తారు. ప్రతి పనికీ ఓరేటు విధించారు. ఇలా అనేక రూపాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఎం స్థానిక నాయకులు ఎం.జగ్గునాయుడు నాయకత్వాన స్థానికులు గతంలో అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అయినా అధికార యంత్రాంగానికి పట్టలేదు. ఇప్పటికైనా స్పందించి తహశీల్దార్‌ పోస్టు భరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.


సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్