22న ప్రపంచ జానపద వేడుకలు

డాబాగార్డెన్స్‌ : వుడా చిల్డ్రన్‌ క్లబ్‌, విజయం టెక్నో స్కూల్‌ సంయుక్తాధ్వర్యాన వెయ్యిమంది చిన్నారులతో ఈ నెల 22న ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వుడా మీడియా ఆఫీసర్‌ బి ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్నారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు వెయ్యిమంది చిన్నారులు పాల్గొనున్న ఈ జానపద దినోత్సవ వేడుకల్లో 333 మంది చిన్నారులు 18 రకాల గ్రామీణ జానపద కళల్ని ప్రదర్శిస్తారని తెలిపారు. అంతకుముందు సాయంత్రం 5 గంటలకు సర్క్యూట్‌ హౌస్‌ నుంచి హెచ్‌ఎస్‌బిసి, సిరిపురం మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకూ ప్రదర్శనతో భారీ ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. జానపద కళలకు చెందిన వేషధారణలతో, కళా ప్రదర్శనలతో వెయ్యి మంది చిన్నారులు ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం విజయం టెక్కోస్కూలు వ్యవస్థాపకులు డాక్టర్‌ కె విజయలక్ష్మి ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాట్య కళాప్రపూర్ణ డాక్టర్‌ ఎస్‌ మురళీబాబు సారధ్యంలో జానపద కళల్లో నిష్ణాతులైన కళాకారులచే చిన్నారులకు సవర, థింసా, చెక్కభజన, హరికథ, బుర్రకథ, కర్రసాము, మోళీ మొదలైన జానపద కళల్లో శిక్షణా ఇస్తున్నట్లు తెలిపారు. కనుమరుగువుతున్న గ్రామీణ జానపద కళల పట్ల ప్రజల్లో ఆదరణ పెంపొందించే ఉద్దేశంతో పాటు పట్టణ ప్రాంతాల్లో వాటిని ప్రచారం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన దలిచిన బృందాలు 9848434066 నెంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.