ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధికారులంతా పని చేయాలని జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ ఆదేశించారు. మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో గల నక్కపల్లి మండల కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా అధికారులందరూ పని చేయాలన్నారు. మే నెల 8వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాలన్నింటికీ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. జాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాలన్నారు. డబ్బు, లిక్కర్ తదితరాలు పంపిణీ చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పార్టీలకు చెందిన పోస్టర్లు, బేనర్లు తొలగించాలన్నారు. పార్టీల నాయకుల పర్యటనలో వినియోగించే వాహనాల నెంబర్లను నమోదు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, రిటర్నింగ్ అధికారి దయానిధి, ట్రైనీ కలెక్టర్ హరి చందన, ఆర్‌డిఓ కూర్మనాధ్, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండల ప్రత్యేకాధికార్లు, తహశీల్దార్లు, ఎమ్‌డిఓలు పాల్గొన్నారు.