సమస్యలపై సమరభేరి

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరభేరి మోగించేందుకు గిరిజన సంఘం నేతృత్వంలో పాదయాత్రలు జరుగుతున్నాయి. బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక పోరాటం, పోడు భూములకు పట్టాల సాధన, సాగునీటి సౌకర్యం మెరుగుదలకు జలాశయాల నిర్మాణం, మరమ్మతులు, బీడీ ఆకు సేకరణ ధర పెంపు, జీడిమామిడి పిక్కలను కేజీ రూ.80కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న తదితర డిమాండ్ల సాధనకు గిరిజనులను గిరిజన సంఘం సన్నద్ధం చేస్తోంది. కొయ్యూరు మండలంలో ఈనెల మూడు నుంచి 11 వరకు గిరిజన సంఘం నాయకులు ఎం.సూర్యనారాయణ నాయకత్వాన ప్రారంభమైన పాదయాత్ర, చింతపల్లి, కొయ్యూరు మండలాలకు విస్తరించింది. ఆదివారం కొయ్యూరు సంత వద్ద జరగనున్న బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు పి.మధు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మిడియం బాబూరావు ప్రసంగించనున్నారు. జికె.వీధి మండల పాదయాత్ర ముగింపుసభ ధారకొండలో సోమవారం జరగనుంది. చింతపల్లి మండల పాదయాత్ర ముగింపుసభ లోతుగెడ్డలో నిర్వహించనున్నారు. జికె.వీధి మండల పాదయాత్రకు గిరిజన సంఘం నాయకులు ఎ.బుజ్జిబాబు, బి.సత్యనారాయణ, ఆర్‌.శంకరరావు, చింతపల్లి మండల పాదయాత్రకు బొన్నంగి చిన్నయ్యపడాల్‌ నాయకత్వం వహిస్తున్నారు.

పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకొచ్చాయి. పాలకుల నిర్లక్ష్యానికి గురై గిరిజనులను వెంటాడుతున్న అనేక సమస్యలు నాయకుల దృష్టికొచ్చాయి. కొయ్యూరు మండలంలో 14 వేల ఎకరాల్లో పదివేల మంది, ముంచంగిపుట్‌ మండలం లో 1250 ఎకరాల్లో పదిహేను వందల కుటుంబాలు, అనంతగిరి మండలంలో మూడు వేల ఎకరాల్లో పదిహేను వందల కుటుంబాలు జీడిమామిడి తోటలను పెంచాయి. ఏజెన్సీలో జీడిమామిడి పిక్కలను జిసిసి, ఐటిడిఏ కొనుగోలు చేయకపోవ డంతో కేజీ జీడిపిక్కలను ప్రారంభంలో రూ.30కు, సీజన్‌ చివర్లో రూ.35కు ప్రయివేటు వ్యాపారులు కొంటారు. పంట పెట్టుబడులకు బ్యాంకు లుగానీ, ఐటిడిఏగానీ రుణాలివ్వకపోవడంతో ప్రయివేటు వడ్డీ వ్యాపారులను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు నూటికి అరవై నుంచి ఎనభై రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు. అధిక వడ్డీకితోడు తూనికలో మోసాలవల్ల గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొయ్యూరు మండ లంలో జీడిమామిడి తోటలు సాగవుతున్న ఆరు వేల ఎకరాలకు పట్టాల్లేకపోవడంతో అటవీ శాఖాధికారుల వేధింపులకు గిరిజనులు గురవుతున్నారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనేతర పెత్తందార్లు ఏజెన్సీలో జీడిమామిడితోటలు పెంచినప్పటికీ అధికారులు వారిజోలికిపోవడంలేదు.

బాక్సైట్‌ తవ్వకాలవల్ల గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, బతుకులు దెబ్బతిననున్నాయి. బాక్సైట్‌ ప్రభావిత గ్రామాల్లో గిరిజనులకు పట్టాలివ్వకూడదని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. భూమిలేని గిరిజనులకు పదెకరాలకు తక్కువలేకుండా భూమివ్వాలని గిరిజన సంఘం డిమాండ్‌ చేస్తోంది. జికె.వీధి, చింతపల్లి మండలాల్లో తునికాకు సేకరిస్తున్న కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కొయ్యూరు మండలంలో 12, జికె.వీధి మండలంలో ఎనిమిది, చింతపల్లి మండలంలో 12 కళ్లాల నుంచి తునికాకు కొనుగోలు జరుగుతోంది. తునికాకు సేకరణవల్ల ప్రతి ఏడాదీ అటవీ శాఖకు సుమారు రూ.20 లక్షలు, రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఆదాయం వస్తోంది. బీడి కార్మికులకు మాత్రం కనీస మద్దతు ధర చెల్లించడంలేదు. భద్రాచలంలో 50 ఆకుల కట్టకు 91 పైసలు చెల్లిస్తే, ఇక్కడ అరవై పైసలు చెల్లిస్తున్నారు. 50 కట్టలకు రూపాయి యాభై పైసలు చెల్లించాలని గిరిజన సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఆకు సేకరణ సమయంలో జంతువుల దాడిలో మృతిచెందిన, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా అటవీశాఖ చెల్లించాల్సివు న్నప్పటికీ చెల్లించడంలేదు. కొయ్యూరు మండలంలో సాగునీటి సౌకర్యం మెరుగు పర్చేందుకు జలాశయాలు, చెక్‌డ్యాంల మరమ్మతులు, నిర్మాణం చేపడితే పదివేల ఎకరాలకు సాగునీరందించే అవకాశము న్నప్పటికీ ప్రభుత్వం నిర్తక్ష్యం చేస్తోంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్