లగడపాటి ఆస్తులపై సిబిఐతో దర్యాప్తు చేయించాలి

విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ ఆస్తులపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌ సిపి నగర కన్వీనర్‌ జలీల్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం తారాపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అక్రమాలకు పాల్పడి లగడపాటి వేల కోట్లు సంపాదించారన్నారు. హైదరాబాద్‌ నగరంలో 650 ఎకరాల వక్ఫ్‌ భూములను రాష్ట్ర మంత్రిగా పనిచేసిన షబ్బీర్‌ ఆలీ సహాయంతో ఆక్రమించి ల్యాంకో హిల్స్‌గా మార్చారన్నారు. అన్యాయంగా పేద ముస్లిముల స్థలాలను కబ్జా చేయాలని చూసిన లగడపాటికి కోర్టు తీర్పు చెంపపెట్టన్నారు. ప్రభుత్వం జగన్‌పై విచారణ ఎంక్వైరీ చేయించడం కాదని నిజాయితీ ఉంటే కాంగ్రెస్‌ ఎంపి లగడపాటిపై విచారణకు ఆదేశించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం నాయకులు అమీర్‌ జానీ, మహ్మద్‌ ఇర్ఫాన్‌, సిరాజుద్దీన్‌, రాంపిళ్ళ శ్రీనివాసరావు, కెనడీ, కె.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.