గాంధీకి బ్రిక్స్‌ దేశాల ప్రతినిధుల నివాళి

గీతం విశ్వ విద్యాలయం వేదికగా శనివారం ప్రారంభమైన బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఆయా దేశాల ప్రతినిధులు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశ్వవిద్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాలులర్పించారు. రష్యా కన్సులేట్‌ అధికారి డాక్టర్‌ నికోలే ఎ లిస్టోపదేవ్‌ మాట్లాడుతూ మహాత్మాగాంధీ లియోటాలిస్టారుల మధ్య స్నేహాన్ని గుర్తు చేసుకోగా, దక్షిణాఫ్రికా ప్రతినిధి పీకోవీట్‌ మహాత్ముని అహింసామార్గం తమకు స్వేచ్ఛను ప్రసాదించడానికి కారణమైందని గాంధీ భారతీయులు తమకు అందించిన బహుమతి అని అభివర్ణించారు. ఈ ఇద్దరు అధికారులతో పాటు చైనా దౌత్య కార్యాలయ అధికారి డెంగ్‌క్సిన్‌, బీజింగ్‌ నార్మల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు డాక్టర్‌ గియోజి, చైనా విద్యాశాఖ కార్యదర్శి హాంగ్‌జిగాంగ్‌, గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్‌ ఎంవివిఎస్‌ మూర్తి, వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి సుబ్రహ్మణ్యం తదితరులు గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మదర్‌థెరిస్సా విగ్రహానికి నివాళులర్పించారు. ప్రపంచ దేశాల మధ్య సుస్థిర అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి అవసరమని పిలుపునిస్తూ బ్రిక్స్‌ దేశాల ప్రతినిధులు విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. గీతం విశ్వవిద్యాలయం పర్యావరణానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు. సమావేశాలకు హాజరైన బ్రిక్స్‌ దేశాల ప్రతినిధులను గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్‌ ఎంవివిఎస్‌ మూర్తి సాంప్రదాయ బద్ధంగా సత్కరించారు.