మండలంలోని పుల్లేరువలస రెవెన్యూ పరిధిలో కలప రాత్రికిరాత్రే మాయమైంది. బుధవారం 'వివాదస్థలంలో టేకుచెట్ల గల్లంతు' శీర్షికన 'ప్రజాశక్తి'లో ప్రచురితమైన విషయం తెలిసిందే. నిందితుల కోసం అటవీ శాఖాధికారులు రెండు రోజులుగా వెతుకులాట ప్రారంభించినా వారికి కలప ఆచూకీ తెలియక పోవడం పట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముద్దాయిలను విచారించ కుండా కలప కోసం అటవీశాఖాధికా రులు పరుగులు తీయడం హైడ్రామాగా ఉంది. గురు వారం సింహాలతోటలో అటవీశాఖాధి కారులు గాలించగా 10దుంగలు మాత్రమే వారికంట పడ్డాయి. కలపమాయం కావడం వెనుక అటవీశాఖ, రెవెన్యూ శాఖల హస్తం ఉందని పలువురు బహిరంగంగానే అంటున్నారు. ఈ దుంగలు తరలింపులో సంబంధిత ఉద్యోగుల హస్తం ఉందని, వారి సూచనల మేరకే ఆ దుంగలను అక్కడ వదిలి వేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. రెవెన్యూ స్థలాల్లో లక్షలాది రూపాయల విలువచేసే కలప మాయమవు తున్నా అటు రెవెన్యూశాఖ గాని, ఇటు అటవీశాఖగాని చూసీ చూడనట్లు వ్యవహరి న్నాయి. మూడునెలల క్రితం డొంగురువలస రెవెన్యూ పరిధిలో లక్షలాది రూపాయల టేకు చెట్లును దొంగలు నరికివేసిన విషయమై దర్యాప్తుకు జిల్లా అటవీశాఖ అధికారి వచ్చి చూసి వెళ్లారేతప్ప బాధ్యులపై చర్యలు తీసుకోలేదు.
బొబ్బిలి పట్టణం, చుట్టు పక్కల గ్రామాల్లో కూడా అనుమతులు లేకుండా కలపను నరికి, చుట్టు పక్కల గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న కొన్ని అనాధికార సామిల్లుల్లో కోయిస్తున్నట్లు తెలుస్తోంది. పుల్లేరువలస వ్యవహారంపై బుధవారం రాత్రి ఇన్‌ఛార్జి తహశీల్దార్ కె ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేస్తేగాని అసలు దొంగలు బయట పడరని గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలు కలప మాయమైన ప్పటికీ అటవీశాఖ ఉన్నతాధి కారులు సంఘటనా స్థలాన్ని సందర్శించక పోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికా రులకు అక్రమ కలప వ్యాపారుల నుండి అధిక మొత్తంలో ముడుపులు అందడంతో కింది స్థాయి సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి అక్రమంగా చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.