మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పిన ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతనలేకుండా పోయింది. లక్షాధికారులను చేయొద్దు బిక్షగాళ్లగా మార్చకుండా ఉంటేచాలు అంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు. పొదుపు సంఘంగా ఏర్పడి ఏడాది పూర్తయిన వెంటనే లింకేజి రుణాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ చాలా గ్రూపులకు అందకపోవడంతో వారు అయోమయ స్థితిలో పడుతున్నారు. పొదుపు మహిళలందరికీ పావలావడ్డీకే రుణాలిస్తున్నామని ప్రచారార్భాటాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. 60 సంవత్సరాలు దాటిన సభ్యులకు నెలకు రూ.500 చొప్పున అభయహస్తం పింఛను ఇస్తామన్నప్పటికీ చాలా మందికి నేటికీ అందడంలేదు. అభయహస్తం పథకంలో చేరితే 60ఏళ్ల తరువాత రూ.500నుండి 2,200వరకు పింఛను వస్తుందని నమ్మబలికి సభ్యుల నుండి బలవంతంగా డబ్బులు గుంజారు. చాలా గ్రూపు సభ్యులకు తెలియకుండానే వారి అకౌంట్ నుండి నగదు బదిలీ చేశారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 683 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 620 గ్రూపులకు మాత్రమే లింకేజి రుణాలిచ్చారు. వీటిలో 217 గ్రూపులకు మాత్రమే పావలావడ్డీ వర్తిస్తుంది. అయినా వాటిలో సగానికి గ్రూపులకు అసలు పావలావడ్డీ వర్తించలేదు. మిగతా గ్రూపులకు కూడా ఇది వర్తించక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలం పరిధిలో 926 గ్రూపులుండగా 812 గ్రూపులకు మాత్రమే లింకేజి రుణాలందాయి. వీటిలో కూడా చాలా గ్రూపులకు పావలావడ్డీ అందలేదు. అభయహస్తం పథకానికి 680 మందికి అర్హత ఉండగా 567 మందికి మాత్రమే మంజూరు చేశారు. మున్సిపాలిటీలో 77మందికి అర్హత ఉండగా 66మందికి పింఛను అందుతోంది. రుణాలు సక్రమంగా అందక పోవడంతో డ్వాక్రా మహిళలు అధికారులపైనా, పాలకులపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వారందరికీ అభయహస్తం పింఛన్లు ఇవ్వాలని, డ్వాక్రా గ్రూపులన్నింటికి లింకేజి రుణాలిచ్చి పావలా వడ్డీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో సిసి చేతివాటం
పొదుపు మహిళలకు వారి భర్త మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమ్‌ఆద్మీ, జనశ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి రూ. 75వేలు, సాధారణంగా మరణిస్తే రూ. 30వేలు ఇన్సురెన్స్ కింద నామినీకి చెల్లించాల్సి ఉన్నప్పటికీ మండలంలో గతంలో పనిచేసిన సిసి సత్యనారాయణ చేతివాటం ప్రదర్శించారు. ఎం.బూర్జవలసకు చెందిన ముఖీ సింహాచలం గత ఏడాది సాధారణంగా మరణించారు. ఆమె జనశ్రీ ఇన్సురెన్స్‌లో చేరగా రూ. 30వేలు నామినీ అయిన భర్తకు రావలసి ఉంది. రూ. 25వేలు చెల్లించి మిగతా 5వేలు సిసి జేబులో వేసుకున్నట్లు ఆమె భర్త ముఖీ సోములు ఆరోపిస్తున్నాడు. గత ఏడాది గ్రోత్‌సెంటర్‌లో ప్రహరీగోడ కూలిన ప్రమాదంలో మెట్టవలసకు చెందిన గొర్రెల కాపరి రాగాన తిరుపతి మరణించిన విషయం తెలిసిందే. అతని భార్య సింహాచలంకు రూ. 75వేలు చెల్లించాల్సి ఉండగా రూ. 50వేలు చెల్లించి మిగతా రూ. 25వేలు సిసి జేబులో వేసుకున్నట్లు తెలిసింది.
సభ్యులకు తెలియకుండానే నగదు బదిలీ
డ్వాక్రా మహిళలకు అభయహస్తం వర్తించేందుకు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి 366 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీని పై డ్వాక్రా సభ్యులకు అవగాహన కల్పించి ఇష్టపూర్వకంగా డబ్బులు వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ సిసి సత్యనారాయణ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో సభ్యులకు తెలియకుండానే వారి ఖాతాల నుండి డబ్బులు బదిలీ చేశారు. గతంలో పక్కిలో ఇలా జరగడంతో సభ్యులంతా డ్వాక్రా కార్యాలయానికి చేరుకుని సిసిని నిలదీసి ఆందోళన చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు పక్కి గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు.