మృత్యు కౌగిట్లో బర్నికవలస


  • వారం రోజుల్లో నలుగురు మృతి
  • అపారిశుధ్యం, అరకొర వైద్య సేవలే కారణం

ఏజన్సీలో అంటువ్యాధులు మరణ మృదంగం మోగిస్తున్నాయి. నిరుపేద గిరిజనులను మృత్యువాత పట్టిస్తున్నాయి. అపారిశుధ్యం, ఆర్థిక ఇబ్బందులు, మెరుగైన సేవలు అందకపోవం గిరిపుత్రుల పాలిట శాపంగా మారాయి. ధర్మాసుపత్రుల వైద్యసేవలు గిరిజనుల దరిచేరడం లేదు. ఫలితంగా మండలంలో మలేరియా, డయేరియా పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, తోణాం, మామిడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిట లాడుతున్నాయి. అరకొర వైద్యసేవలే అందుతుండడంతో గిరిజనుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. మండలంలోని నార్లవలస పంచాయతీ బర్నికవలసలో పలువురు గిరిజనులు మృత్యువుతో పోరాడుతున్నారు. గ్రామంలో ఈ ఏడాది జనవరి నుండి ఇంత వరకు ఆరుగురు గిరిజనులు మృతి చెందారు. ఈనెలలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ నెల 23న బోయిన సుందరమ్మ (50), 24న ఆమె భర్త బోయిన నూకయ్య డయేరియాతో మరణించారు. ఇద్దరూ ఒకరోజు తేడాతో మరణించడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఈనెల 28న ఇదే గ్రామానికి చెందిన కొట్టిశ పెంటయ్య (50), బోయిన చినరాయుడు (10) డయేరియాతో మృతి చెందారు. జనవరి నెలలో కొట్టిశమల్లేషు, ఏప్రిల్‌లో గబడార అప్పలస్వామి మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. తన కుమారుడు చినరాయుడును సామాజిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజులు నుంచి వైద్యం చేయించానని తండ్రి బోయిన జోనేషు చెప్పాడు. ఎప్పటికీ తగ్గక పోవడంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారన్నాడు.

అంబులెన్స్‌లో తీసుకెళ్లడానికి, అక్కడ వైద్య ఖర్చులను భరించే ఆర్థికస్తోమత లేనందున ఇంటికి తీసుకొచ్చానని, డయేరియాతో బాధపడుతూ కొడుకు మరణించాడని తండ్రి జోనేషు తీవ్ర ఆవేదన చెందాడు. కొట్టిశ పెంటయ్య కూడా సిహెచ్‌సిలో చికిత్స పొందాడు. కొంచెం డయేరియా తగ్గిందని ఇంటికి వెళ్లడంతో బుధవారం వాంతులు, విరోచనాలతో మృతిచెందాడు. బర్నికవలస, బొడ్డపాడు గ్రామాల్లో సుమారు 40కుటుంబాలకు చెందిన గిరిజనులు మలేరియా, డయేరియాతో బాధపడుతున్నారు. బొడ్డపాడు గ్రామానికి చెందిన బోయిన లక్ష్మి, సంధ్యారాణి, పోసమ్మ, నంధ్యాల కోమలమ్మ, లకీë, రాములమ్మ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. బర్నికవలసకు చెందిన బోయిన సింహాచలం, పొట్టంగి ఎర్రయ్య, జన్ని మరియమ్మ, బోయిన అనిత, సింహాచలం జ్వరాలతో బాధపడుతున్నారు. నంద్యాల కొండయ్య డయేరియాతో బాధపడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాడు. తగ్గుముఖం పట్టకపోవడంతో విజయనగరం పంపించారు. తీసుకెళ్లడానికి డబ్బుల్లేక కుమారుడిని ఇంటికి తీసుకొచ్చామని తండ్రి సంజీవి చెప్పాడు. బర్నికవలస సమీపాన ఉన్న పెద్దవలస, మూలవలస, గ్రామాల్లో కూడా జ్వరపీడితులున్నారు. బర్నిక వలసలో డయేరియా, మలేరియా ప్రబలడానికి ప్రధాన కారణం అపారి ధ్యమే. నేలబావి నుంచి కలుషిత నీటిని వీరంతా తాగుతున్నారు. స్థానిక ఎఎన్‌ఎం రోజూ వచ్చి మాత్రలు పంపిణీ చేస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం మామిడిపల్లి పిహెచ్‌సి వైద్యుడు జగదీష్‌ బర్నికవలసలో వైద్యశిబిరం నిర్వహించారు.

తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి వైద్య సేవలందిస్తున్నా డయేరియా, మలేరియా బాధితులు తగ్గడం లేదు.

అత్యవసర మందుల్లేవు

పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, తోణాం, మామిడిపల్లి పిహెచ్‌సిలలో అత్యవసర మందులు కొరత ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ మలేరియా పీడితులకు మాత్రం మందులు సరఫరా చేస్తున్నారు. సెరిబ్రల్‌ మలేరియాతో బాధపడే రోగులకు అవసరమైన మందుల్ని కొనుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు కొనుక్కొంటున్నారు. లేనివారు ఇబ్బందిపడుతున్నారు. సెరిబ్రల్‌ మలేరియా వ్యాధిని గుర్తించే పరీక్షలు కూడా ఖరీదైనవే కావడంతో స్థానిక వైద్యులు రోగులను విజయనగరం పంపుతున్నారు. విజయనగరం తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు, మందులు ఖర్చులు భరించలేని గిరిజనులు ఇంటిదారి పడుతున్నారు. బోయిన చినరాముడు అనే బాలుడిని విజయనగరం రిఫర్‌ చేస్తే తీసుకెళ్లడానికి డబ్బుల్లేక ఆయన తండ్రి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మందులకొరత లేదని జిల్లా వైద్యాధికారులు పైకి చెబుతున్నా అత్యవసర మందులు మాత్రం లేనట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. నిరుపేద గిరిజనులు, దళితులు మాత్రం అంటువ్యాధులకు బలైపోతున్నారు.

హెల్త్‌ ఎమర్జన్సీ ప్రకటించాలి

మండలంలో మలేరియా, డయేరియా బాధితులు ఎక్కువగా మరణిస్తున్నందున ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని సిపిఎం మండల నాయకుడు కోరాడ ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మర్రి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గురువారం వారు బర్నికవలస, బొడ్డపాడు గ్రామాల్లో మలేరియా, డయేరియా పీడితుల్ని పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ బర్నికవలస గ్రామంలో పారిశుధ్యం అద్నానంగా ఉందన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందకపోవడంతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారన్నారు. సాలూరు సిహెచ్‌సి నుంచి విజయనగరం రిఫర్‌ చేసినప్పుడు ఆర్థిక స్తోమత లేని గిరిజనులు ఇంటి దారిపడుతున్నారన్నారు. ఐటిడిఎ అధికారులు గిరిజనులకు రవాణా ఛార్జీలు భరించాలని కోరారు. మలేరియా, డయేరియా రోగాలకు అత్యవసర సేవలకు ప్రభుత్యాసుపత్రుల్లో మందులు లేవన్నారు. మరణించిన గిరిజన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు కోరారు.

అత్యవసర మందులు తెప్పించండి

సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన మందులు తెప్పించాలని ఎమ్మెల్యే రాజన్నదొర వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్‌ ఎర్రయ్యతో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవల కోసం ఏయే మందులు ఉండాలో తనకు జాబితా ఇవ్వాలని కోరారు. అత్యవసర మందులు లేని కారణంగా నిరుపేద గిరిజనులు, దళితులు మరణిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అత్యవసర మందుల కోసం తాను జిల్లా వైద్యాధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే చెప్పారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్