కొంతమంది మహిళలు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి తుడుస్తూనో, కడుగుతూనో కనిపిస్తారు. తమ ఇల్లు మల్లెపువ్వులా మెరిసిపోవాలనుకుంటారు. పదిమందీ తమ ఇంటి శుభ్రతను గుర్తించాలనీ, అభినందించాలనీ కోరుకుంటారు. గచ్చుమీద ఏ చిన్న మరక కనపడినా దాన్ని శభ్రం చేసేవరకు వారి మనసు ఊరుకోదు. అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులూ వున్నాయి. అవేంటో వాటిని ఎలా అధిగమించాలో ఈవారం చూద్దాం.
మాలతికి ఇద్దరు పిల్లలు. వారు తమ పనులు తాము చేసుకోగల వయసులో ఉన్నవారే. పైగా ఆమె ఉద్యోగం చేయదు. ఎప్పుడు చూసినా ఇంటిపనుల్లో మునిగి ఉంటుంది. రోజు మొత్తం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. పక్కింటివారు ఆమెను అరుదుగా పలకరిస్తుంటారు. ఎందుకంటే ఆమె ఇంటి పనులలో హడావిడిగా ఉంటుంది. దాంతో బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆమె పరిశుభ్రత పిచ్చితో ఇంట్లో నిరుత్సాహ వాతావరణం ఏర్పడింది. అందుకే పనంతా పూర్తిగా అయిపోయిన తరువాత హాయిగా కాసేపు కూర్చోవచ్చు అని అనుకోకూడదు. ఎందుకంటే ఒక పని పూర్తి అవగానే మరో పని కనిపిస్తుంది. అది పూర్తి అవగానే మరోటి. అలా ఏదో ఒక పని పుట్టుకొస్తూనే ఉంటుంది. చివరికి ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోతుంది. కానీ పని తెమిలినట్టు అనిపించదు. గృహిణికి తన భర్తతో, పిల్లలతో, వారికి అన్ని అవసరాలు తీర్చడంతో, వంటకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవడంతోనే ఆమె సమయం కాస్తా అయిపోతుంది. వీటన్నిటితో పాటు ప్రతి రోజూ ఇల్లంతా శుభ్రం చేయాలంటే ఎలా కుదురుతుంది? ఎముకలన్నీ అరిగిపోయేలా చేస్తూ ఉంటే చివరికి శాశ్వత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. అలా చేయాలని అనుకోవడం అవివేకమవుతుంది కూడా.
ఇది కుటుంబ సంతోషాన్ని హరిస్తుంది. ఇల్లాలు బాధపడడమే కాకుండా తన కుటుంబాన్ని బాధిస్తుంది. ఉదాహరణకు ఏ వస్తువునైనా పెట్టిన చోట నుంచి తీసినా, మురికి కాళ్లతో ఇంట్లోకి వచ్చినా భర్తను, పిల్లలను కోప్పడుతుంటారు. ఏదో ఒకటి సణుగుతూ పనులు చేయడం వల్ల పిల్లలకు టిఫిను పెట్టడం, భర్తకు క్యారియర్ సర్దడం ఆలస్యమౌతుంది. ఇంట్లో తరచూ ఇటువంటివి జరగడం వల్ల ఆ ఇంట్లో కళ తప్పుతుంది.
అమెరికాలో చేసిన ప్రయోగాలను బట్టి శారీరక, మానసిక సమస్యలకు ఇతర కారణాల కంటే రోజువారీ జీవితంలోని విసుగే కారణమని తేలింది. కాస్తైనా విరామం లేకుండా పూర్తి పరిశుభ్రత కోసం పాకులాడడం కంటే మరో అసహాయ స్థితి ఉండదు. కొన్ని పనులు చేయలేకపోతే వారు ఏదో తప్పు చేసిన వారిలాగా బాధపడతారు. తాము ఇంటి కోసం ఏమీ చేయలేని వారిగా, తమ వల్ల ఎటువంటి ఉపయోగమూ లేనట్లుగా మనస్తాపానికి గురవుతారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో రోజంతా కష్టపడడం, గబాగబా నడవడం వల్లే మహిళలకు తీవ్రమైన మోకాళ్ల నొప్పి వస్తుందని కొన్ని అధ్యయనాలలో తేలింది. ఇంటిని అలంకరించడానికి ఎంతో కష్టపడడం వల్ల శారీరకంగా బాగా అలసిపోయి మోకాళ్ల నొప్పి, ఇతర అనారోగ్యం ఏర్పడుతుంది. నిరుత్సాహకరమైన వాతావరణం ఏర్పడి ఫలితం లేకుండా పోతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచాలన్న ధ్యాసతో అనవసరపు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వినోదానికి ఉండే కాస్త సమయం కూడా హరించుకుపోతుంది.
ఏ పనీ కాకముందే కాసేపు కూర్చోవడం ఒక మంచి లక్షణం. జాగు చేయకుండా ముఖ్యమైన పనులు అంటే కుటుంబ సభ్యులకు భోజనం వడ్డించడం, గిన్నెలు కడగడం వంటివి త్వరగా చేసుకోవాలి. ఆ తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని ఇతర ముఖ్యమైన పనులు చేసుకోవాలి. పరిశుభ్రత పేరుతో రోజు మొత్తం పని చేస్తూ ఉండకూడదు. మనకు ఎక్కువగా సమయం లేదనుకున్నప్పుడు ఇల్లు మొత్తం తుడవకుండా మురికిగా ఉన్నచోట తుడుచుకుంటే సరిపోతుంది. చాలా ముఖ్యమైన పనుందనుకున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకునేవి కాకుండా త్వరగా అయ్యే వంటకాలను తయారుచేస్తే సరిపోతుంది. పిల్లలను స్కూలుకు పంపడం, మధ్యాహ్న భోజనం త్వరగా చేయడం వల్ల ఎవరికీ ఇబ్బందీ ఉండదు. ఉతకాల్సిన, లేదా ఐరన్ చేయాల్సిన బట్టలు ఉన్నా మనకు సమయం దొరికే వరకు వాటిని ఆపొచ్చు. కాబట్టి ఆ పనుల గురించి హైరానా పడాల్సిన పనిలేదు. గిన్నెలు కడగడం ఒక గంట ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ భోజనం ఆలస్యమైతే ఇబ్బంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకోవాలి. అన్ని పనులూ అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పటికి కావలసిన పనులు త్వరగా చేసుకోవడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం వల్ల బద్ధకం అని అనుకోనక్కర్లేదు. దీనివల్ల పని పట్ల ఇంగిత జ్ఞానం ఉన్నట్టు.
శక్తిని, పనిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేసుకోవాలి.
*రోజూ పడుకోబోయే ముందు ఏ పనులు చేశామో వాటిని గుర్తు చేసుకోవాలి. చేయని వాటిని తలుచుకోవద్దు.
*శుభ్రంగా ఉండడం మంచి పద్ధతే కానీ చెప్పులతో కాస్త మట్టి వచ్చిందనో, ఇంటికి వచ్చిన అతిథులు టేబుల్ క్లాత్ని మురికి చేశారనో వారికి అసౌకర్యం కలిగించొద్దు.
* మన ఇంటికి వచ్చిన వారు కూడా ఫలానా సమయంలో ఫలానా పద్ధతిలో ఫలానా పనిచేయాలని ఆశించినప్పుడు వారిని బలవంతం చేసినట్టవుతుంది.
*అస్తమానం చీపురు, బూజుకర్ర పట్టుకోవడం మానేయండి. అప్పుడప్పుడు నడుం వాల్చండి.
*అవసరమైన పనికి మాత్రమే సూచనలను బలపరచుకుని ఇంటి వాతావరణాన్ని ఆనందమయం చేసుకోండి. దీనివల్ల అనవసరపు బాధ్యతల నుండి తప్పించుకోవచ్చు.
*విశ్రాంతి గదిలో, పడక గదిలో పనిముట్లు, ఫ్లవర్వాజులు, క్యాసెట్లు, చెప్పుల ర్యాకులు వంటివి పెట్టుకోవద్దు. అవి చికాకును, విసుగును కలిగించి విశ్రాంతికి అవరోధం కలిగిస్తాయి.
*అతిథులు వస్తారనుకున్నప్పుడు ఆ రోజు కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి గదులను శుభ్రం చేసుకుని మిగతా రోజుల్లో మనం చేయగలిగిన పని చేసుకుంటే సరిపోతుంది.
*పని గంటలను తగ్గించుకునే దారులు వెతుక్కోవాలి. వత్తిడిని తగ్గించుకోవడానికి అవసరమైన వ్యాయామం చేయడం, సంగీతం వినడం వంటివి చేయాలి.
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిశుభ్రత కోసం పాటు పడడం అర్థం లేని పని.