మనదేశంలో దాదాపు అన్ని రకాల పరిశ్రమలు చార్టర్డ్ అకౌంటెంట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిశ్రమల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే దేశంలో కనీసం 5 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. కానీ సీఏలో ఉత్తీర్ణులవుతోన్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ రంగం దగ్గర్నించి, మౌలిక పారిశ్రామిక రంగం, ఆడిట్ కంపెనీలు సీఏలకు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. సీఏలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఐసీఏఐ అనేక మార్పులు కూడా చేసింది. ముఖ్యంగా పదో తరగతి దశ నుంచే సీఏ లక్ష్యంగా పెట్టుకొని సిద్ధమవడానికి ఇప్పుడు వీలవుతుంది.
చార్టర్డ్ అకౌంటెంట్ కావాలంటే కింది దశలన్నీ విజయవంతంగా అధిగమించాలి. 1.పదో తరగతి పూర్తయ్యాక కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సిపిటి)కి పేరు నమోదు చేసుకోవాలి. అప్పటి నుంచి సిపిటి కోసం ప్రిపేర్‌కావచ్చు.
2. పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు, సిపిటి నిర్వహించే నాటికి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్ష రాసుండాలి. సప్టిమెంటరీ, అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పద్ధతిలో టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా సిపిటి పరీక్ష రాయవచ్చు.
3. సిపిటి ఆబ్జెక్టివ్ మల్టిఫుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటుంది. మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. కనీసం 100 మార్కులు తెచ్చుకుంటే ఇందులో ఉత్తీర్ణత సాధించినట్టు పరిగణిస్తారు.
4. ఇంటర్మీడియట్‌తోపాటు సిపిటిలో కూడా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇక చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో చేరవచ్చు.
5.సిపిటి తర్వాత దశ...పిసిసి (ప్రొఫెనల్ కాంపిటెన్సీ కోర్సు). పిసిసికి పేరు నమోదు చేసుకున్న తర్వాత కనీసం మూన్నెళ్లు ఆర్టికల్డ్ ట్రైనింగ్ తీసుకోవాలి.
6.తర్వాత 20 రోజుల వ్యవధిలో రోజుకు 5 గంటలపాటు కనీసం 100 గంటలు ఐటీ శిక్షణ పొందాలి. దీన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా పరిగణిస్తారు.
7. ప్రొఫేషనల్ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్ (పిసిఈ)కు హాజరుకావడానికి ముందు కనీసం 15 నెలలు ఆర్టికల్డ్ అసిస్టెంట్ లేదా ఆడిట్ అసిస్టెంట్‌గా పనిచేయాలి.
8. పిసిఈలో ఉత్తీర్ణులయ్యాక సీఏ ఫైనల్ కోర్సుకు పేరు నమోదు చేసుకోవాలి. అధీకృత సంస్థ నుంచి స్టడీ మెటీరియల్ తీసుకోవాలి.
9. ఫైనల్ పరీక్షకు సిద్ధమవుతూనే జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ (జిఎంసిఎస్) కోర్సు చేయాలి.
10. మూడున్నరేళ్ల ఆర్టికల్డ్ ట్రైనింగ్ పూర్తిచేయాలి. ఇవన్నీ పూర్తయ్యాక ఫైనల్ పరీక్ష రాయాలి. ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులైతే చార్టర్డ్ అకౌంటెంట్ అయినట్లే.
ఆబ్జెక్టివ్ పరీక్ష : ఐసిఎఐ చేసిన మార్పుల్లో అత్యంత ప్రధానమైనది...సిపిటిని ప్రవేశపెట్టడం. గతంలో నిర్వహించే సిఎ ఫౌండేషన్ పరీక్ష డిస్క్రిప్టీవ్ పద్ధతిలో ఉండేది. దీనివల్ల చాలామంది అభ్యర్థులకు ఈ దశను అధిగమించడమే కష్టంగా ఉండేది. సిపిటి పూర్తిగా ఆబ్జెక్టివ్ మల్టిఫుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. కొంచెం శ్రమిస్తే దీనిలో విజయం సాధించి సిఎ కోర్సులో ప్రవేశించవచ్చు. ఈ సౌలభ్యం వల్ల కామర్స్, మ్యాథ్స్ విద్యార్థులే కాకుండా ఇతర సబ్జెక్టులు, కోర్సులు చదువుతున్న అభ్యర్థులు కూడా సిఎపై దృష్టి సారిస్తున్నాయి.
సిపిటిని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఏటా జూన్, డిసెంబర్‌లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఆర్టికల్డ్ ట్రైనింగ్ విషయంలో చేసిన మార్పుల వల్ల విద్యార్థులు రోజువారి ఖర్చులకు ఎంతో కొంత సంపాదిస్తూనే సిఎ కోర్సు చేసే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. పిసిసికి పేరు నమోదు చేసుకున్నాక అభ్యర్థులు ఆర్టికల్డ్ ట్రైనింగ్ చేయాలి. ఈ సమయంలో సంబంధిత కంపెనీ లేదా ఆడిటర్ కొంత స్టయిఫండ్ ఇస్తారు. ఈ మార్పుల వల్ల సిఎను కెరీర్‌గా ఎంచుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
* ఇంజనీరింగ్, మెడిసిన్, అనేక ఇతర ప్రొఫేషనల్ కోర్సులతో పోల్చుకుంటే సిఎ పూర్తిచేయడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదువుతూ, మొదటి ప్రయత్నంలోనే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే...కోర్సు మొత్తం పూర్తయ్యేసరికి 20 వేల రూపాయలకంటే ఎక్కువ ఖర్చవ్వదు.
* దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో ఐసిఎఐ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. వాటిలో పేరు నమోదు చేసుకోవచ్చు మనరాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో సిఎ పరీక్షలు రాయవచ్చు.
* సిఎ కోర్సు స్వరూపం, శిక్షణ, ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర సమాచారం www.icai.org వెబ్‌సైట్‌లో లభిస్తుంది.
కాస్ట్ అకౌంటెన్సీ : ఇంటర్ అర్హతతో చేయగల మరో ప్రొఫెషనల్ కోర్సు...కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెన్సీ (సిడబ్ల్యుఎ). ఇంటర్ తర్వాత కనీసం రెండు మూడేళ్లు కష్టపడితే సిడబ్ల్యుఎ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. కార్పొరేట్ రంగంతోపాటు, సేవారంగంలో కూడా కాస్ట్ అకౌంటెంట్లకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సిఎ మాదిరిగానే కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెన్సీ కోర్సు కూడా మూడు దశల్లో ఉంటుంది.
ఫౌండేషన్ కోర్సు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్ ఫైనలీయర్ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు కూడా అర్హులు. ఏటా జూన్, డిసెంబరులలో పరీక్ష నిర్వహిస్తారు. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్మీడియట్ దశకు చేరుకుంటారు. ఇంటర్మీడియట్ : కాస్ట్ అకౌంటెన్సీ వృత్తికి సంబంధిచిన ప్రధాన సబ్జెక్టులు ఇంటర్మీడియట్ కోర్సులో ఉంటాయి. మొత్తం సబ్జెక్టులను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఈ కోర్సుతోపాటుగా అభ్యర్థులు మూడేళ్లు ప్రాక్టీకల్ శిక్షణ తీసుకోవాలి. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటర్మీడియట్ పరీక్షకు పేరు నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
1. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫైనల్‌కు పేరు నమోదు చేసుకోవాలి. కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన చట్టపరమైన అంశాలకు ఫైనల్ కోర్సులో ప్రాధాన్యతనిస్తారు.
ఉద్యోగావకాశాలు :
సిడబ్ల్యుఎ చదివినవారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ (ఐసిఎఎస్) రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం సాధించవచ్చు.
* కార్పొరేట్ కంపెనీల్లో శాప్, ఈఆర్‌పి ఆధారిత ఉద్యోగాల్లో కాస్ట్ అకౌంటెంట్లకు ప్రాధాన్యం లభిస్తుంది.
* ఐసిడబ్ల్యుఏఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఏడాది కోర్సు చేయడం ద్వారా కంపెనీల్లో జూనియర్ స్థాయి ఉద్యోగాలు సాధించవచ్చు.
* సిడబ్ల్యుఏకి సంబంధించిన శిక్షణ, ప్రాంతీయ కార్యాలయాల సమాచారం www.icwai.org లో లభిస్తుంది.
ఎన్.వి.రాజేందర్