బిటి వంగ లాభం గోరంత నష్టం కొండంత

డాక్టర్‌ కె.శివబాబు

రాష్ట్ర హెల్త్‌ సబ్‌ కమిటీ సభ్యులు

జనవిజ్ఞానవేదిక

జహీరాబాద్‌

ఫోన్‌ : 92462 77022

ఇటీవలి తాజా పరిణామం జన్యు పరివర్తన ఆహార పంటల ప్రవేశం. ఈ ప్రయత్నం మానవాళి ముందు అసంఖ్యాక ప్రశ్నలు లేవనెత్తుతున్నది. ప్రత్యేకించి ఇలాంటి పంటలు మానవారోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఎంత వరకు సురక్షితం? అనే ప్రశ్నలకు సమాధానాలు సమగ్రంగా లభ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరస్కరణకుగురైన బిటి వంకాయ పంటను భారత ప్రభుత్వ జన్యు సాంకేతిక పరిజ్ఞాన ఆమోద సంఘం (జిఇఎసి) మూడు నెలల క్రితం హడావిడిగా ఆమోదించింది. మహికో బహుళజాతి కంపెనీ ఈ పంటను ప్రవేశపెడుతున్నది. బిటి వంగ అంశంపై భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి బిటి వంగ ఆరోగ్యంపై కల్గించే దుష్ఫలితాల్ని పరిశీలిద్దాం.

ఆరోగ్యవంతమైన మానవ జీవనానికి సురక్షితమైన ఆహారం అత్యవసరం. అనేక శతాబ్దాల పరిణామ క్రమంలో ఆకులు, అలములు ఏరుకుని తినే ఆటవిక దశ నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయగల దశకు ఆధునిక మానవుడు చేరుకోగలిగాడు. అయితే మొత్తం ఆహారోత్పత్తి పరిణామ క్రమంలో ఆరోగ్యం సురక్షితంగా ఉండటమనేది ప్రధానాంశంగా ఉంది. అలా సురక్షితమైన పంటలను, పదార్థాలను స్వీకరిస్తూ, ఆరోగ్యాన్ని నష్టపరిచే వాటిని తిరస్కరిస్తూ రావడం జరిగింది.

* ఇప్పటికే భారతదేశంలో క్షయ, అతిసార, హెచ్‌ఐవి, ఇతర లైంగిక వ్యాధుల నిర్మూలనకై అమలులో ఉన్న జాతీయ పథకాల మౌలిక లక్ష్యానికి బిటి వంగ తయారీలో ఉపయోగించిన యాంటి బయాటిక్‌ నిరోధక కారకాల వల్ల తీవ్ర విఘాతం కలుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మచ్చుకైనా కానరాని క్షయ మన దేశంలో బహుళ ఔషధ నిరోధక క్రిమిగా అంటే ఒకటి కంటే ఎక్కువ రకాల ఔషధాలకు లొంగని క్రిమిగా ఏర్పడడంతో ప్రమాదకరంగా పరిణమించింది. ఈ పరిస్థితి బిటి వంగ తయారీలో వాడిన యాంటిబయాటిక్‌ నిరోధక కారకాల వల్ల మరింత జటిలమవుతుంది.

* భారత దేశంలో ఉన్న ఆయుర్వేద, సిద్ధ వంటి దేశీయ వైద్య విధానాల్లో దేశంలో లభ్యమయ్యే కొన్ని రకాల వంగని ఉపయోగిస్తున్నారు. బిటి వంగ ప్రవేశంతో ఈ విషయంలో అనిశ్చితి ఏర్పడుతుంది.

* బిటి వంగ విషప్రభావం గురించి కృత్రిమ ప్రోటీన్లతో చేసిన అధ్యయనం శాస్త్రీయం కాదు. అలాంటి అధ్యయనాలతో సమగ్రమైన శాస్త్రీయ అంచనాకు రాలేము.

* దాదాపు 15 శాతం కేలరీలు తక్కువున్న బిటి వంగ పోషక విలువల రీత్యా కూడా తక్కువ నాణ్యత కలిగిన దానికింద లెక్క.

* మహికో కంపెనీ వెల్లడించిన ఫలితాల్లో ఎలుకలలో జరిపిన అధ్యయనాల్లో బిటి వంగ వల్ల అతిసారవ్యాధి రిపోర్టు చేయబడింది. ఎలుకల్లో తక్కువ కాలం, అసంపూర్తిగా జరిపిన అధ్యయనాల్లో అతిసార కనబడిందంటే దీర్ఘకాల మానవాళి ఉపయోగానికి ఎంత క్షేమం అన్నది ప్రశ్నార్థకమే. అందులోనూ అతిసార లాంటి వ్యాధులతో అసంఖ్యాక మరణాలు సంభవిస్తున్న దేశంలో ప్రజలకు ఇటువంటి ప్రయోగం మరింత చేటు తెస్తుంది.

* ఈ అధ్యయనంలో మరో దుష్ఫలితం కాలేయ పనివిధానం దెబ్బతినడం. కాలేయం పనితీరుని సూచించే బైలురుబిన్‌ పెరుగుదల ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికే హెపటైటిస్‌ - ఎ,బి,సి వంటివే గాక మలేరియా సంబంధిత హెపటైటిస్‌ కూడా భారత ప్రజల్లో కనబడుతున్న నేపథ్యంలో బిటి వంగ కాలేయంపై చూపగల దుష్ఫలితాలు మరింత నష్టదాయకం.

* దూడలకు పాలిస్తున్న ఆవులపై జరిపిన అధ్యయనాల్లో పెరిగిన పాల పరిమాణం హార్మోన్లలో కలిగే మార్పులను సూచిస్తున్నాయి. ఇలాంటి హార్మోన్ల అసమతుల్య మానవదేహంలో ప్రత్యేకించి గర్భిణిల్లో, శిశువుల్లో, సంతానోత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆందోళనకరమైన ప్రశ్న. మహికో కంపెనీ ఈ అంశంపై చెప్పుకోదగ్గ అధ్యయనం జరపలేదు.

* బిటి వంగ సురక్షితమని, వండిన బిటి వంగలో బిటి టాక్సిన్‌ శాతం సున్నా అనీ మహికో చెబుతున్నది. కానీ మన దేశంలో రోజువారీ వండే పద్ధతులు పలురకాలు. చింతపండు ఉపయోగించే వంటకాల్లో ఆమ్లస్వభావం వల్ల కొన్ని అమైనో ఆమ్లాలు సురక్షితంగా ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పండిన బిటి వంగలో బిటి టాక్సిన్‌ శాతం ఎంత ఉంటుందనేది ప్రశ్నార్థకమే. బిటి టాక్సిన్‌ క్రిమిసంహారక మందుగా పలుదేశాల్లో ఉపయోగిస్తున్నందు వల్ల ఈ అంశంపై దీర్ఘకాల అధ్యయనం జరగాల్సి ఉంది.

* దేశీయమైన ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానాల్లో రస, గుణ, వీర్య, విపాక రస, ప్రభాస అనే అంశాల ఆధారంగా మొక్కలను ఉపయోగిస్తారు. ఒక ఔషధం తాలుకు మూల పదార్థాంలో వచ్చే ఎలాంటి స్వల్ప మార్పైనా దాని ఫలితాల్లో తీవ్ర మార్పులకు దారితీస్తుంది. సాలనేసి కుటుంబానికి చెందిన వంగలో సాలమార్గిన్‌, సాలసోనిస్‌ పదార్థాల మధ్య ఉండే మార్పులు బిటి వంగ రూపంలో ప్రమాదకర ఫలితాలకు దారితీయవచ్చు. ఇదేగాక సహజంగా లభించే వంగలో ఉండే ఆరోగ్యానికి ఉపకరించే ఆస్కార్బిక్‌ ఆమ్లం, లైకోపిన్‌వంటి యాంటి ఆక్సిడెంట్లు బిటి వంగలో ఎలాంటి మార్పులకు గురవుతున్నాయో అధ్యయనం జరగాల్సి ఉంది.

* హెర్బల్‌ ఔషధాల ఎగుమతిలో అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం మన దేశం గుర్తించదగ్గ స్థానంలో ఉంది. ఇప్పటికే అనేకదేశాలు జన్యుపరివర్తిత ఆహారపంటలను తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో బిటి వంగ పంట ఆమోదం అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశ హెర్బల్‌ ఔషధాల విశ్వసనీయత దెబ్బతీసే ప్రమాదంలో ఉంది.

* సిఎస్‌ఐఆర్‌ (న్యూఢిల్లీ) నివేదిక ప్రకారం సహజ వంగలో కాలేయంలో కొలెస్ట్రాల్‌ జీవక్రియల్ని వేగవంతం చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ నియంత్రించే స్వభావం ఉంటుంది. సహజ వంగ కొలినెస్టరేజ్‌ అనే ఎంజైమ్‌ను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్‌ గ్రంథిపై ప్రభావం చూపుతుంది. ఈ అంశాలకు సంబంధించిన బిటి వంగ ఎలాంటి ప్రభావాలు కల్గివుంటుందనే దానిపై అధ్యయనాలు జరగలేదు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్