డా|| వీరపనేని విష్ణున్ రావు
'శ్వాస' ఆస్తమా చికిత్స కేంద్రం
హైదరాబాద్, ఫోన్: 9848426879
రిలీవర్స్ బ్రాంకో డైలేటర్స్
శ్వాసనాళాల చుట్టూ బిగుసుకు పోయిన మృదువైన కండరాలను సడలింపచేసే మందులివి. తద్వారా శ్వాసనాళాలు తెరుచుకుని, గాలి సులభంగా లోనికి బయటకు వెళ్తుంది.
దుష్ఫ్రభావాలు : గుండెవేగంగా కొట్టుకోవడం, అసహనంగా అనిపించడం, కడుపులో తిప్పినట్టు ఉండడం, తలనొప్పి, సన్నగా వణుకు అనిపించడం, నోరు, గొంతు పొడిబారడం, కొంచెం బిపి పెరగడం కనిపిస్తాయి. కండరాల బలహీనత కలుగుతుంది. రక్తంలో పొటాషియం స్థాయి తగ్గుతుంది.
ప్రివెంటర్స్ (యాంటి ఇన్‌ఫ్లమేటరీస్)
మిథైల్ జాంతిన్స్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవి కూడా బ్రాంకో డైలేటర్స్ కిందికి వస్తాయి. టాబ్లెట్ల రూపంలో వాడతారు.
దుష్ఫ్రభావాలు : గుండెవేగంగా కొట్టుకోవడం, వణుకు రావడం. అసహనంగా అనిపించడం. వాంతి వచ్చినట్లుండడం. తలనొప్పి, చికాకు, నిద్రలేమి. కడుపులో, గుండెలో మంట అనిపించడం. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావడం జరుగుతుంది.
యాంటి కొలినర్జిక్స్
ఇవి కూడా బ్రాంకోడైలేటర్స్. శ్వాసనాళాలను వెడల్పుచేస్తాయి. ఇన్‌హేలర్స్‌లాగా వాడతారు.
దుష్ఫ్రభావాలు : పీల్చగానే దగ్గురావడం. గొంతు తడారిపోవడం. కడుపులో తిప్పినట్లు ఉండడం. తలనొప్పి.
ఇన్‌హేలర్ రూపంలో ఈ స్టీరాయిడ్స్ తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువ. అందులో ఒకటి.. నాలుక, గొంతు పచ్చి చేస్తాయి. మంటగా అనిపిస్తుంది. గొంతు బొంగురు పోతుంది. ఇన్‌హేలర్ పీల్చిన తరువాత వెంటనే నోరు, గొంతు శుభ్రం చేసుకుంటే ఈ బాధలు కూడా వుండవు.
నాటుమందులు - దుష్ఫ్రభావాలు
కొందరు నాటువైద్యులు టాబ్లెట్స్, ప్రెడ్నిసోలోన్, బెట్నెసాల్ మొదలైనవి, ఇంజెక్షన్స్ డెక్‌డ్రాన్, బెట్నాసాల్, మిథైల్ ప్రెడ్ని సోలోన్, కెనాకార్ట్, ట్రైకార్ట్ టాబ్లెట్స్‌నే పొడిచేసి, నాటు మందుల పేరుతో లాడ్జిలలో, గుళికల రూపంలో, పౌడర్స్ రూపంలో ఇస్తుంటారు. గుర్తుపట్టకుండా వీటిలో రకరకాల రంగులు కలుపుతారు. ఈ ఇంజక్షన్లన్లే మూడునెలలకోసారి ఎక్కువ మోతాదుల్లో ఇస్తారు. వీటిని రహస్యంగా ఉంచుతారు. వీటి గురించి ఎవరికీ చెప్పరు. 'విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం' అంటారు. ఈ టాబ్లెట్స్‌ని, ఇంజెక్షన్లను లేదా వీటితో తయారు చేసే ఆ నాటు మందుల వల్ల కలిగే దుష్ఫ్రభావాలు ఇలా ఉంటాయి...
కొన్ని రోజుల తర్వాత : ఒంట్లో నీరు చేరుతుంది. లావెక్కినట్లు అనిపిస్తుంది. ఆకలి బాగా పెరిగిపోతుంది. శ్వాస తేలిగ్గా అందుతుంది. అందుకే ఈ మందులవైపు మొగ్గు చూపుతారు. మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఈ మందులకు ఏ మందు సరికాదని భ్రమపడతారు. తరువాత గాని అసలు విషయం బోధపడదు.
కొన్ని నెలల తర్వాత : అసలైన దుష్ఫలితాలు మొదలవుతాయి. దేనిని తట్టుకునే శక్తి ఉండదు. నీరసించి పోతుంటారు. ఇన్‌ఫెక్షన్లు సులభంగా వస్తాయి.
కొన్నేళ్ల తర్వాత : ముఖం గుండ్రంగా తయారవుతుంది. కంటి శుక్లాలు వచ్చి చూపు మందగిస్తుంది. ముఖమంతా వెంట్రుకలు వస్తాయి. మహిళల్లో కూడా ! చర్మం పలచబారిపోతుంది. ఎక్కువ ఒత్తిడి తగిలినా కమిలిపోతారు. ఎముకలు గుల్లబారిపోతాయి. త్వరగా విరిగిపోతాయి. కండరాలలో పటుత్వం తగ్గిపోతుంది. కూర్చుంటే లేవడమే కష్టమైపోతుంది. పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. బానపొట్ట, సన్నటి కాళ్ళు, గుండ్రటి ముఖంతో వ్యక్తి రూపురేఖలే మారిపోతాయి.
గుర్తుంచుకోవాల్సినవి
ఇన్‌హేలర్స్‌లో డోసు తక్కువ. ఇవి పవర్‌ఫుల్ మందులు కావు. పవరు తక్కువ మందులు. టాబ్లెట్లు, టానిక్‌లు, ఇంజక్షన్ల కంటే వందల రెట్లు డోసు తక్కువ. అలవాటయ్యే మందులు ఎంత మాత్రం కాదు. అతిముఖ్యమైన అంశం ఏమిటంటే ఏ ఇన్‌హేలర్ వాడకం చేయాలి అనేదే. అస్తమాపై పూర్తి అవగాహన ఉన్న వైద్యుడి పర్యవేక్షణలో రోగికి పూర్తి న్యాయం జరుగుతుంది. అవగాహన లేకపోతే అష్టకష్టాలు పడుతుంటారు. అవగాహన పెంచుకోవాలి.