చేతిరుమాలును అడ్డం పెట్టుకుంటే దుర్గంధాన్ని ఆపగలదా?

దుర్గంధం వ్యాపించినప్పుడు చేతిరుమాలును (కర్చీఫ్‌)ను అడ్డం పెట్టుకుంటాం కదా! చేతిరుమాలు దుర్గంధాన్ని ఆపగలదా?- తేజ, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.

చేతిరుమాలు (కర్చీఫ్‌) దారపుపోగులతో సంధానించుకున్న గుడ్డ ముక్క. ప్రతి దారపు పోగులోనూ చాలా దూదిపోగులు ఉంటాయి. దూదిపోగులన్నీ సెల్యూలోజ్‌ అనే బహ్వణువు (polymer) తాలూకు ముక్కలు. ఒక భూతద్దం తీసుకొని చూసినట్లయితే చేతిగుడ్డలో ఉన్న సంక్లిష్ట క్రమబద్ధమైన అల్లిక (fabric) మనకు తెలుస్తుంది. ఈ బహ్వణువులోని అన్ని భాగాలూ ఒకేవిధమైన రసాయనిక భంగిమలో ఉండవు. ఒకేవిధమైన శక్తిస్థాయిల్లోనూ ఉండవు. కొన్ని భాగాలు బాగా స్థిరంగా ఉండగా, మరికొన్ని భాగాలు కొంత అస్థిరం (strained)గా ఉంటాయి. అస్థిరంగా ఉన్న పరమాణువులు లేదా అణుభాగాలు (moieties) మరింత స్థిరత్వాన్ని పొందడానికి ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి అణు స్థావరాలని చర్యాస్థావరాలు (active centers) అంటారు. ఏదైనా చిన్న చిన్న అణువులు తారసపడితే వాటిని చర్యాస్థావరాల లోగిళ్లలోకి లాక్కొని స్థిరత్వాన్ని పొందుతాయి. ఇలా ఒక వస్తువు ఉపరితలం మీదకు మరో ఇతర పదార్థపు అణువులు చేరడం వల్ల వ్యవస్థ స్థిరత్వం పొందుతుంది. ఈ దృగ్విషయాన్ని అధిశోషణం (adsorption) అంటాము. ఒకవేళ ఒక పదార్థపు అంతర్భాగంలోకి మరో పదార్థపు అణువులు లేదా పరమాణువులో చొచ్చుకుపోవడం వల్ల వ్యవస్థ స్థిరత్వం పొందితే ఆ పరిస్థితినే శోషణం (absorption) అంటారు. మీరడిగిన ప్రశ్నలోని విషయం అధిశోషణానికి చెందింది.

దుర్గంధభరితమైన వాతావరణంలో దుర్గాంధాన్ని కలిగించే రసాయన పదార్థాలు ఉంటాయి. సాధారణంగా ఇవి వాయుస్థితిలో ఉండడం వల్ల వాతావరణంలో సులభంగా వ్యాపనం (diffusion) చెందుతాయి. కొన్ని సేంద్రియ పదార్థాలు (organic compounds), కొన్ని నిరింద్రియ (inorganic compounds), పదార్థాలు దుర్గాంధాన్ని కలిగిస్తాయి. వీటిలో గంధకం (sulfur), భాస్వరం (phosphorous), సెలీనియం, నైట్రోజన్‌ ధాతువులు ఉంటాయి. దుర్గాంధాన్ని కలిగించే పదార్థాలన్నీ తమతమ మోతాదును బట్టి మన శరీరానికి అవాంఛనీయమేనని మనం గుర్తుంచుకోవాలి. అటువంటి విషపదార్థాల నుంచి దూరంగా ఉండమని మనల్ని ప్రేరేపించడానికే ప్రకృతిసిద్ధంగా ఉన్న ఘ్రాణ వ్యవస్థ (olfactory sense) కు అవి దుర్గంధంగా, అవాంఛనీయంగా గోచరిస్తాయి.

చేతిరుమాలు ముక్కులకు, నోటికి అడ్డం పెట్టుకోవడంవల్ల కొంతలో కొంతైనా ఈ దుర్గంధపూరిత పదార్థాల అణువులు చేతిరుమాలులో ఉన్న దారపు పోగుల్లోని బహ్వణువు మీద అధిశోషణం చెందుతాయి. దరిమిలా, తక్కువ అణువులు మాత్రమే ముక్కురంధ్రాలగుండా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. ఏమీ అడ్డుపెట్టుకోకపోవడంకన్నా ఏదో ఒకటి అడ్డుపెట్టుకుంటే కొంతైనా మేలే కదా! ఎందుకంటే మొత్తం దుర్గంధపు అణువులను చేతిరుమాళ్లు ఆపలేవు. ఒక్కోసారి అధిశోషణం కాకున్నా చేతి రుమాల్లో ఉన్న ఇతర వాసనల నేపథ్యంలో ఈ దుర్గంధ అణువుల వాసన పరిగణనలోకి రాకపోవచ్చును. ఏదిఏమైనా తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు, జలుబు సమయాల్లో, స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు, వాతావరణం దుర్గంధ పూరితమైనప్పుడు చేతిరుమాళ్లు అడ్డంపెట్టుకుంటేనే మంచిది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్