రేడియేషన్ చికిత్స వల్ల కలిగే దుష్ఫ్రభావాలకు తులసితో సమర్థవంతంగా చికిత్స చేయ్యొచ్చని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) శాస్త్రవేత్తలు తెలిపారు. తులసి మొక్క ఆధారంగా శాస్త్రవేత్తలు మూలిక ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుందని తెలుసుకోవడానికి రెండో దశ ప్రయోగాలు నిర్వహించనుంది. తులసిలో యాంటి-ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి రేడియేషన్ ప్రభావం వల్ల కలిగే అస్వస్థతను నిరోధిస్తాయి. రేడియేషన్ చేయించుకున్న రోగులకే కాకుండా కీమోథెరపి చేయించుకున్న రోగులకు కూడా దీన్ని వాడొచ్చు. ' ఈ ప్రాజెక్టు ఖరీదు 7 కోట్ల రూపాయలు. వాణిజ్యపరంగా ఔషధాన్ని భవిష్యత్తులో తీసుకొస్తాం' అని డిఆర్‌డిఓ చీఫ్ కంట్రోలర్ డబ్ల్యు సెల్వస్వామి తెలిపారు. ఇప్పటికే ఇది రెండో దశ ప్రయోగంలో ఉంది, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందన్నారు. జంతువులపై జరిగిన ప్రయోగాల ఫలిలాలు సంతృప్తిని, ఉత్సాహాన్నిచ్చాయని తెలిపారు.