విషమ పరీక్ష

''పెందరాళే పడుకోవచ్చుగా! అలా టిక్కుటిక్కుమంటూ రిమోట్‌ నొక్కుతూ దిక్కుమాలిన అర్థరాత్రి ఛానెల్స్‌ చూడకపోతేనేం! తెల్లారితే ఉగాది పండగ. రాత్రి ఎక్కువ మేలుకుంటే పండగ పూట కూడ బారెడు పొద్దెక్కేదాకా మంచానికడ్డంగా పడి నిద్దరపోతారు. మాయదారి సంత.'' పద్మ అలా అంటుంటే దాన్ని బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాదిరి ఎంజారు చెయ్యడం అలవాటైపోయిన సుబ్రమణ్యం నిదానంగా ఛానెల్స్‌ మార్చి మార్చి చూస్తున్నాడు.

నిరంతర వార్తా ఛానెల్‌లో అర్థరాత్రి వచ్చే మసాలా సీన్లకోసం వెతుక్కుంటూవుంటే ఉగాది పంచాంగ శ్రవణం ప్రసారం వస్తోంది. బ్రహ్మశ్రీ వేదమూర్తుల ప్రతివాది భయంకర రమణయ్యశాస్త్రి పంచాంగం ఫలాలు వివరిస్తున్నారు...''వచ్చేది వికృతి నామ సంవత్సరం. ఫలితాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం... వ్యయం...రాజపూజ్యం...అవమానం...వర్ణాలు పడనూవచ్చు, పడకనూపోవచ్చు., పడినా పంటలు పండనూవచ్చు, పండకపోనూవచ్చు. పండినా రైతుకు రేటు వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ధరలు తగ్గే అవకాశం...'' ఇలా చెప్తూంటే ఎదురుగా రోశయ్యగారు, గవర్నర్‌గారు, స్పీకర్‌గారు... అంతా తలలాడిస్తూ అర్థమైనట్టు నటిస్తూ కూచున్నారు. బ్రహ్మశ్రీ...గారి వాయిస్‌ ఎఫెక్టు వల్లో ఏమోగాని సుబ్రమణ్యానికి అలా కునుకు పట్టేసింది.

ఏవండీ ! ఏవండోరు ! తియ్యగా పిలిచింది పద్మ. కళ్లు తెరిచాడు సుబ్రమణ్యం. ఎదురుగా వయ్యారంగా నిలుచుని చేత్తో వెండిగిన్నె పట్టుకుని

పద్మ ! ''ఏదీ నోరు తెరవండి.'' గోముగా అంటూ నిలుచుంది. ప్రతీ ఉగాదినాడూ తప్పని విషమపరీక్ష ఇది సుబ్రమణ్యానికి. పద్మ ఉగాది పచ్చడి తినడం అంత ఈజీ కాదు. ఓ ఏడు చింతపండుతోబాటు చింతపిక్కల్నికూడా తినిపించింది. ఇంకోఏడు వేప పువ్వు దొరకలేదని దానికి బదులు వేపాకుతో చేసింది. ఈసారి ఏమౌతుందోనని భయపడుతూ నోరు తెరచాడు. ఆశ్చర్యం ! ఉగాది పచ్చడి అద్భుతంగా తీయతీయగా చిన్న వగరు, చిన్న పులుపు, మరీ చిన్న చేదు,...మళ్లీ తినాలనిపించేలా ఉంది పచ్చడి. అద్భుతం ! అని పైకే అనేశాడు సుబ్రమణ్యం. ''మరేమనుకున్నారు ! ఇది 'వికృతి' నామ సంవత్సరం అని చక్కాపోయింది పద్మ.


పేపరు తీశాడు సుబ్రమణ్యం. ''నితావ్యవసర వస్తువులన్నింటినీ ప్రభుత్వమే చౌక దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ రేట్లకి అందిస్తుంది''. -మన్మోహన్‌సింగ్‌ ప్రకటన. ''పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర భారీ ప్రాజెక్టులన్నింటినీ కేంద్రమే చేపడుతుంది.'' -ప్రణబ్‌ముఖర్జీ. ''ఈసారి గెలిపిస్తే రాజీనామాలు మధ్యలో చెయ్యకుండా ఐదేళ్లూ పదవుల్లో ఉంటాం.'' -తెరాస హామీ. ''అసెంబ్లీలో తిట్టుకోకుండా, సమావేశాలకి అడ్డంపడకుండా సమస్యలపై చర్చిస్తాం. సభని సజావుగా నడుపుతాం.'' -స్పీకర్‌, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సంయుక్త ప్రకటన. ''గవర్నమెంట్‌ సర్వీసుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ తక్షణమే రెగ్యులరైజ్‌ చేస్తాం'' -రోశయ్య. ''ట్రాఫిక్‌ జామ్‌లు ఇకముందు హైదరాబాద్‌లో ఉండకుండా ఏర్పాటు.'' -హౌంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. ''సూటిగా, క్లుప్లంగా సరైన సమాధానాలు చెప్తాం.'' మంత్రులు ధర్మాన, శ్రీధరబాబు, జూపల్లి, పొన్నాల సంయుక్త ప్రకటన. డిఎస్సీ-2008 అభ్యర్థులకి రేపే నియామక ఉత్తర్వులు'' -మాణిక్యవరప్రసాద్‌.

బుర్ర తిరిగిపోయింది సుబ్రమణ్యానికి. ఎంత అద్భుతం ! కొత్త సంవత్సరంలో అంతా రివర్సు అంటే ఇలా ఉంటుందా అనుకుంటూ ఆనందంతో గిలగిలా తన్నుకుంటూ....సోఫా మీద నుంచి దబ్బున కిందపడ్డాడు. ఓహౌ ! ఇదంతా కలేనా ! అనుకుంటూ బొప్పికట్టిన బుర్రని తడుముకుంటూ ఉంటే ''హహ్హహ్హా...బలే బలే బాగుంది ! అంటూ గెంతుకుంటూ హాల్లోకి వచ్చింది అనుపమ.. సుబ్రమణ్యం, పద్మ దంపతుల గారాల పట్టి. ''నాన్నా ! ఈ వార్త చూశారా ! ''ప్రేమించడానికి నిరాకరించినందుకు ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్‌తో దాడి ! ఈ రివర్స్‌ గేర్‌ బాగుంది'' అంటూ ఆనందపడి పోతోంది. హు ! ఇదే గాబోసు వికృతి నామసంవత్సరం అనుకుంటూ లేచాడు సుబ్రమణ్యం. ఉగాది పచ్చడి పరీక్షకు సర్వశక్తులూ కూడదీసుకుంటూ....

- ఎమ్వీయస్‌

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్