ఇది మహిళా పోరాట సంవత్సరం

  • పపంచ జనాభాలో 130 కోట్లమంది ప్రజలు రోజుకు ఒక డాలరుకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. ఇందులో 75 శాతం మహిళలు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న ఆహార పదార్ధాలలో 60 శాతం ఉత్పత్తికి అతివల శ్రమే ఆధారంగా ఉన్నది. అయినప్పటికీ ఆకలి బాధలతో అలమటించే 80 కోట్లమందిలో స్త్రీలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు.

ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శత వసంతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించిన సమయంలో రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు లేవననెత్తిన డిమాండ్లు వందేళ్ళ క్రితం ఎంతటి ప్రాధాన్యత కలిగి వున్నాయో ఇప్పటికీ అంతే విలువను కలిగివున్నాయి. సమాన వేతనం, ఎనిమిది గంటల పనిదినం అనేవి ఇప్పటికీ చాలామంది మహిళలకు గగనకుసుమమే అయ్యాయి. ప్రసూతి సౌకర్యాలు, శిశుసంరక్షక కేంద్రాలు వంటివి అసంఘటిత రంగంలోని శ్రామిక మహిళల చెవికైనా సోకలేదు. అదేవిధంగా చట్టసభలలో భారతీయ మహిళలకు సరైన స్ధానం లభించటం లేదు. ప్రసూతి సౌకర్యాలు, శిశుసంరక్షణ కేంద్రాలు, ఆహార భద్రత, చట్టసభలలో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్‌ అన్న డిమాండ్ల సాధన కోసం ఏడాది పొడవునా అంతర్జాతీయ మహిళా దిన శత వార్షికోత్సవాలను నిర్వహించాలని సిఐటియు నిర్ణయించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాశస్త్యాన్ని మరుగుపరచి, దానిని అపహాస్యం చేసే ప్రయత్నాలు ఈనాడు జరుగుతున్నాయి. గృహోపకరణాలనూ, సౌందర్య సాధనాలనూ అమ్ముకోవటానికి దీనినొక సందర్భంగా వినియోగించుకుంటున్న వారున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోని వర్గ స్వభావాన్ని మరుగుపరచే ప్రయత్నం కూడా సాగుతున్నది. అంతేకాక, పెట్టుబడిదారీ సమాజంలోని దోపిడీకి వ్యతిరేకంగా స్త్రీ పురుషులు చేసే ఉమ్మడి పోరాటాన్ని నీరుగార్చేటందుకై పురుషులకు వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని సాగించేటందుకు కూడా ఈ సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో స్త్రీ విముక్తికీ, మొత్తంగా దోపిడీనుంచి సమాజ విముక్తికీ మధ్యగల సంబంధాన్ని బహిర్గతం చేయడం ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోని విప్లవ స్వభావాన్ని కాపాడుకోవాలి.

వందేళ్ళ క్రితం ఊహించటానికి కూడా సాధ్యంకాని స్ధాయిలో ఈనాడు శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఉత్పత్తులు అనూహ్యమైన స్ధాయికి చేరాయి. కాని ప్రపంచ జనాభాలో 130 కోట్లమంది ప్రజలు రోజుకు ఒక డాలరుకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. ఇందులో 75 శాతం మహిళలు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న ఆహార పదార్ధాలలో 60 శాతం ఉత్పత్తికి అతివల శ్రమే ఆధారంగా ఉన్నది. అయినప్పటికీ ఆకలి బాధలతో అలమటించే 80 కోట్లమందిలో స్త్రీలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకంలో ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రతా సౌకర్యాలు, ఓవర్‌టైమ్‌ చెల్లింపులు వంటివాటిపై కార్పొరేట్‌ యాజమాన్యం దాడి చేస్తున్నది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో సైతం శ్రామిక మహిళలు ప్రత్యేకించి ఒంటరి మహిళలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సుదీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న శ్రామికుల హక్కులను కాలరాచేటందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో నయా ఉదారవాద ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్నాయి. ప్రభుత్వంలో ఏపార్టీ ఉన్నప్పటికీ స్త్రీల జీవితాలతో ఆడుకుంటున్నాయి. వ్యవసాయ సంక్షోభంతో గ్రామ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఉపాధి కోసం వేల సంఖ్యలో మహిళలు ఒంటరిగానో, కుటుంబాలతోనో పట్టణాలకు వలస వెళ్తున్నారు. కాని అక్కడ కూడా వారికి సరైన పనులు లభించటం లేదు. ఎక్కువమంది ఇంటిపని వారుగా కాలం వెళ్ళమారుస్తున్నారు. ఇలాంటి వారికి ఉపాధి హామీ, కనీస వేతనాలు, సామాజిక భద్రత వంటివేమీ ఉండవు.

ఆర్థిక వ్యవస్ధ పెరుగుదల రేటును చూపుతూ నయా ఉదారవాద ప్రపంచీకరణ మద్దతుదారులు ఏమి చెప్తున్నప్పటికీ, అసంఖ్యాక స్త్రీలు, పిల్లలు దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారు. వారి స్థితి రోజురోజుకీ దిగజారుతున్నది. 2015వ సంవత్సరానికి ఇంకా సాంతం ఐదేళ్ళు కూడా లేదు. కాని సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్య సాధనలో భారతదేశం చాలా వెనుకబడి ఉన్నది. దుర్భర దారిద్య్రాన్నీ, ఆకలినీ తొలగించటం, సార్వత్రిక విద్యను సాధించడం, స్త్రీ పురుష సమానత్వం, మహిళల సాధికారిత, తల్లుల ఆరోగ్యాన్ని సంరక్షించడం, శిశుమరణాల తగ్గింపు వంటివి సహస్రాబ్ది లక్ష్యాలుగా నిర్ధేశించు కోవటం జరిగింది. అయితే 174 దేశాలతో కూడుకున్న మానవాభివృద్ధి జాబితాలో మన దేశం 134వ స్థానంలో ఉన్నది. గర్భ ధారణ సమస్యలతో ప్రతి ఏటా 1,25,000 మంది స్త్రీలు చనిపోతున్నారు. నిజానికి ఈ మరణాలు కొద్దిపాటి ప్రయత్నంతో నివారించవచ్చు. ప్రసూతి మరణాలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. లక్ష ప్రసవాలలో 300 మరణాలు ఉంటున్నాయి. ప్రపంచం మొత్తం మీద బరువు తక్కువ పిల్లలు మన దేశంలోనే ఎక్కువ. ఆరేళ్ళలోపు పిల్లల్లో ప్రతి రెండవ బిడ్డ బరువు తక్కువగా ఉంటున్నది. ప్రభుత్వం మాటలైతే చెపుతున్నదిగాని ఇలాంటి వారి సంక్షేమం కోసం ఏమి చేయటంలేదు. దాని సేవలన్నీ సంపన్నులకేగాని దరిద్ర నారాయణులకు ఉద్దేశించినవి కావు.

స్త్రీ పురుషుల మధ్య అసమానతలు తగ్గటానికి బదులు పెరుగుతున్నట్లు ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు తెలుపుతున్నాయి. పంజాబు, హర్యానా, చివరకు కేరళలో సైతం లింగ నిష్పత్తి భీతి గొలుపుతున్నది. సమాన వేతన చట్టాన్ని చేయటానికి భారత ప్రభుత్వానికి 34 ఏళ్ళకు పైగా పట్టింది. పురుషులకన్నా స్త్రీలు 30 శాతం తక్కువ వేతనాలను తీసుకుంటున్నారు. దేశ జనాభాలో 85 శాతం మహిళలు అధికారిక దారిద్య్ర స్థాయి ఆదాయంలో 50 శాతాన్ని మాత్రమే పొందుతున్నారు. ప్రత్యేక ఆర్థిక మండలాల్లో పనిచేసే మహిళల స్థితిగతులు 19వ శతాబ్దపు దుస్తుల ప్యాక్టరీలలోని మహిళల దుస్థితిని గుర్తుకు తెస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలాలకు కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి. కాని అధికారుల అండదండలతో వాటిని బహిరంగంగానే ఉల్లంఘించడం జరుగుతున్నది.ఇటీవల పది రాష్ట్రాలలోని 3,000 కుటీర పరిశ్రమలకు చెందిన వారిని సిఐటియు సర్వే చేసింది. వీరి ఆదాయం రోజుకు రూ. 25లు ఉన్నట్లు వెల్లడైంది. సామాజిక భద్రత తదితర సౌకర్యాలు వారికి మచ్చుకైనా లేవు. అసంఘటిత రంగంలో పనిచేసే 96 శాతం శ్రామికులది ఇదే పరిస్థితి. ప్రభుత్వ వ్యవహారం కూడా బాగాలేదు. సామాజిక కార్యకర్తలు, కమ్యూనిటీ వర్కర్లు అంటూ పేరుపెట్టి వారికి కనీస వేతనాలను, సామాజిక భద్రతను తిరస్కరిస్తున్నది. ఇంటిపని, పిల్లల పెంపకం వంటివి సంప్రదాయకంగా ఆడవారి పనిగానే ఉంటున్నది. దీనికి తోడు కుటుంబ పోషణ కోసం ఇంటిబయట కూడా పనిచేయవలసి వస్తున్నది. ప్రధానంగా అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్యకర్తలుగా, ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారికి గౌరవ వేతనాలను ఇస్తున్నారేగాని కనీస వేతనాలను ఇవ్వటం లేదు.

సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన పదమూడు సంవత్సరాల తరువాత కూడా స్త్రీల ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయి. లైంగిక వేధింపులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు చట్టం లేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడానికి ఎన్ని ఆటంకాలు, ఎంత రాద్ధాంతం సృష్టించారో చూశాము. ఈ బిల్లు లోక్‌సభలో ఎప్పుడు పెట్టేది ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఏ మాత్రం జాప్యం చేయకుండా దీనిని వెంటనే సభలో పెట్టాలి. ''పార్లమెంటును మరింత ప్రజాస్వామికం చేయాలంటూ'' వందేళ్ళ క్రితం ఓటు హక్కు కోసం ఉద్యమం ప్రారంభమైంది. కాగా ఈనాడు మన దేశంలో పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం కోసం పోరాటం జరుగుతున్నది.

శత వసంతాల అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా శ్రామిక వర్గమూ, మహిళలూ ఎదుర్కొంటున్న సమస్యలను పైన పేర్కొన్నాము. లాభాల ప్రాతిపదికపై ఏర్పడిన పెట్టుబడిదారీ సమాజం మానవ జాతి ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల్లో ఏఒక్క దానినీ పరిష్కరించలేదు. అలానే స్త్రీ పురుష అసమానతలను కూడా తొలగించజాలదు. ఇటీవలి ఆర్థిక సంక్షోభం మరోసారి పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. నేటి సమాజంలో దోపిడీకి అణచివేతకూ గురయ్యే వారందరూ సమైక్యంగా నిలచి లోపభూయిష్టమైన ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆ రకంగా మాత్రమే స్త్రీలకు కూడా విముక్తి లభించగలదు. ఈ పోరాటంలో శ్రామిక మహిళలు కూడా తమవంతు పాత్రను నిర్వహించాలి. రాజకీయ పోరాటాలలో స్త్రీలను సమీకరించ వలసిన అవసరం గురించి లెనిన్‌ నొక్కి చెపుతూ 1921లో అంతర్జాతీయ మహిళా దినోత్పవ సందర్భంగా ఇలా పేర్కొన్నాడు. '.....మహిళలను కలుపుకు రాకుండా రాజకీయాల్లోకి ప్రజారాశులను మీరు సమీకరించలేరు. మానవ జాతిలో సగభాగంగా ఉన్న స్త్రీ జాతి పెట్టుబడిదారీ వ్యవస్ధలో రెట్టింపు అణచివేతకు గురవుతుంది. శ్రామిక మహిళలు, రైతు మహిళలు పెట్టుబడి కింద అణగిపోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమంటే, అత్యంత పురోగామి ప్రజాతంత్ర బూర్జువా రిపబ్లిక్‌లో సైతం స్త్రీలకు కొన్ని హక్కులను నిరాకరిస్తారు. ఎందుకంటే వారికి పురుషునితో సమాన హక్కులను చట్టం ఇవ్వదు. అతి ముఖ్యమైన రెండవదేమంటే, వారు గృహ బానిసలుగానే మిగిలి ఉంటారు'.

స్త్రీలను పోరాటంలోకి తీసుకు వచ్చేటందుకూ, వారి నిర్ధిష్టమైన డిమాండ్ల సాధనకూ ఈ విషయాలన్నిటినీ మననం చేసుకోవటం జరిగింది. కార్మిక సంఘ ఉద్యమంలో వారు ముఖ్యమైన పాత్రను నిర్వహించాలి. ఇందుకుగాను అంతర్జాతీయ మహిళా దిన శత వార్షికోత్సవాలను ఏడాది అంతా నిర్వహంచాలని సిఐటియు నిర్ణయించింది.అంతర్జాతీయ మహిళా దినం యొక్క సమరశీల స్వభావాన్ని నిలబెట్టుకుని దోపిడీకి, అణచివేతకూ వ్యతిరేకంగా పోరాటాలు సాగిద్దాం. అణచివేతకు దారితీస్తున్న అసలైన కారణాలపట్ల స్త్రీలలో జాగృతిని కలిగిద్దాం. ప్రత్యామ్నాయం కోసం పోరాటం సాగిద్దాం. తమ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న స్త్రీలకు సంఘీభావాన్నీ తెలుపుదాము. దోపిడీనుంచి సమాజాన్ని విముక్తి చేసే ఉద్యమాలకు మనలను మనం పునరంకితం చేసుకుందాము.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్