జన్యుమార్పిడి శాస్త్రవేత్త, ఫ్లాంట్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ జాతీయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ పి. ఆనంద్ కుమార్ ఎరపంటను వేయనందువల్లనే బిటి1 టెక్నాలజీకి నిరోధక శక్తి వచ్చిందని, దీనికి బదులుగా బిటి2 రకాన్ని వేయాలని సూచిస్తున్నారు. దీనితోబాటు బోల్‌వార్మ్ నియంత్రణకు ''పత్తికాయలు అభివృద్ధి చెందే సమయంలో రైతులు కనీసం రెండుసార్లు పురుగుమందు పిచికారి చేయాలని, ఇది అదనపు ఆయుధంగా పని చేస్తుందని'' తన జన్యుమార్పిడి ఇంజనీరింగ్ కమిటీ సభ్యత్య అనుభవాన్నంతా క్రోడీకరించి ఇప్పుడు ఉచిత సలహా ఇస్తున్నాడు ఆనంద్ కుమార్. ఈ సూచన అసలు బిటి ప్రక్రియ ఉద్దేశానికే విరుద్ధం. ఇది గతంలోనే ఎంతో మంది విజ్ఞులు వెలిబుచ్చిన భయాందోళనలను ధృవీకరిస్తుంది.
బిటిపత్తి సాంకేతిక పరిజ్ఞానం అస్థిరత్వంతో కూడినది. మాన్‌శాంటో కంపెనీ ప్రచారం చేస్తున్నట్లుగా సస్యరక్షణ మందుల వాడకం అంతగా తగ్గదని, నాన్‌బిటి రకంతో పోల్చినపుడు బిటి రకంలో కేవలం 1,2 స్ప్రేలు తక్కువవుతాయని, ఇతర కీటకాలు ఉధృతమౌతాయని, కాయతొలుచు పురుగులలో నిరోధక శక్తి వేగంగా పెరుగుతుందని, కొత్త పర్యావరణ సమస్యలు వస్తాయని ఎంతో మంది విజ్ఞులు, స్వచ్ఛంద సేవా సంస్థలు మొదటే అభ్యంతారలు తెలిపారు. కాని, తనకున్న వ్యాపార పట్టు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల శక్తి ఆధారంగా బిటిపత్తి సేద్యాన్ని బాగా విస్తరింప చేసింది మోన్‌సాంటో కంపెనీ. మార్కెట్‌పై ఈ కంపెనీ ఆధిపత్యం ఎంతగా విస్తరించిందంటే నాన్‌బిటి పత్తి విత్తనాలు రైతులకు అసలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా, 90 శాతానికి పైగా పత్తి విస్తీర్ణం ఇప్పుడు బిటి రకాలదే. తద్వారా, ట్రైట్ వాల్యూ రూపంలో ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయల లాభాల్ని మోన్‌సాంటో కంపెనీ పొందుతుంది. ఇది మోన్‌శాంటో కంపెనీ బిటి పత్తి పరిశోధనలపై పెట్టిన ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ.
2000-01లో ప్రారంభమైన బిటి పత్తి సాగు మన రాష్ట్రంలో క్రమంగా 90 శాతానికి పైగా విస్తరించింది. మూడు సంవత్సరాల క్రితం బిటి విత్తనాల ధరలను నియంత్రించి 450 గ్రాముల విత్తన పా్యకట్ ధరను గరిష్టంగా బిటి1 హైబ్రీడ్ రకానికి రూ. 650, బిటి2 రకానికి రూ.750 ధరకు నిర్ణయించడంవల్ల పత్తి విస్తీర్ణం పెరగడం ద్వారా పత్తి ఉత్పత్తి పెరిగింది. జాతీయ స్థాయిలో 2001-02లో దాదాపు 7.7 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణం 2007-08కి దాదాపు 9.25 మిలియన్ హెక్టార్లకు పైగా పెరిగింది. ఇదే కాలంలో పత్తి ఉత్పత్తి దాదాపు 237 లక్షల బేళ్ల నుండి 270 లక్షల బేళ్లకు పెరిగింది. రాష్ట్రంలో 2001-02లో 11.08 లక్షల హెక్టార్లలో పత్తి సేద్యం కాగా, 2008-09 నాటికి ఇది 13.98 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఈ కాలంలో దూది ఉత్పత్తి (లింట్) 16.63 లక్షల టన్నుల నుండి 34.6 లక్షల టన్నులకు పెరిగింది. దూది ఉత్పాదకత హెక్టారుకు 277 కిలోల నుండి 421 కిలోలకు పెరిగింది. అయితే, ఈ కాలంలో ఎరువుల వాడకం, ఇతర ఉత్పాదకాల వాడకాలు, ఖర్చులు పెరిగాయి. అందువల్ల, పెరిగిన పత్తి ఉత్పత్తిని కేవలం బిటి సాంకేతికానికి ఆపాదించడం అశాస్త్రీయం, అవాస్తం. గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, 2009-10లో పత్తి ఉత్పాదకత బాగా తగ్గింది. కానీ, మోన్‌శాంటో కంపెనీ ఈ క్షీణించిన పత్తి ఉత్పాదకతను అననుకూల వాతావరణ పరిస్థితులకు ఆపాదిస్తుంది.
నిరోధక శక్తి పెరుగుదల- ప్రత్యామ్నాయం
క్షేత్రస్థాయిలో బిటి1 పత్తి సమర్థత క్రమంగా క్షీణిస్తుందని, దీనిలో కూడా సస్యరక్షణ మందుల వాడకం అనివార్యమౌతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మోన్‌సాంటో కంపెనీ రెండేళ్ల క్రితం కాయ తొలుచు పురుగులతో బాటు పొగాకు లద్దె పురుగును కూడా తట్టుకోగల బిటి2 రకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తరువాత, బిటి1 విస్తీర్ణం క్రమంగా తగ్గింది. బిటి2 విస్తీర్ణం పెరుగుతుంది. ఈ మార్పులు గతంలోనే ఎంతో మంది విజ్ఞులు, వెలిబుచ్చిన భయాందోళనలను ధ్రువపరుస్తున్నాయి. ముఖ్యంగా, నాగ్‌పూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ జరిపిన విస్తృత అధ్యయనంలో ఒకే పంటను ఆశించే పింక్‌బోల్‌వర్మ్ లాంటి కాయతొలుచు పురుగులలో నిరోధక శక్తి ఆవిర్భవించిందని గుర్తించింది. ఇదే కాక కొత్త రకం పురుగులు కాయను తొలుస్తున్నట్లు కూడా గుర్తించింది. నిరోధక శక్తి పెరగకుండా ఉంచడానికి అవసరమైన వ్యూహా నమూనాన్ని ఏర్పాటు చేయడానికి పర్యావరణం, జీవ, జన్యుపరమైన మార్పులను, కీటకాల సహజ ఒత్తిడిని సమన్వయంతో అధ్యయనం చేయాలని, ఈ సంస్థ సూచించింది.
బిటి సాంకేతిక పరిమితులు...
అసలు బిటి సాంకేతిక పరిజ్ఞానమే అస్థిరత్వం గలది. బిటిసాగులో 10 శాతంతో ప్రారంభమైన ఎరపంట విస్తీర్ణం 30 శాతానికి పెంచాల్సి రావడం దీనికి తిరుగులేని సాక్ష్యం. పైగా, ఈ సాంకేతికం కేవలం కాయతొలుచు పురుగుల నివారణకే పనికొస్తుంది. మిగతా కీటకాల నియంత్రణకై సస్యరక్షణ మందులను వాడక తప్పడం లేదు. బిటి సాంకేతికాల వల్ల వీటి నియంత్రణకై సస్యరక్షణ మందుల వాడకం గతం కన్నా పెరిగింది. సహజంగా, ప్రకృతిలో వివిధ కీటకాల మధ్య స్థిరత్వంతో కూడిన ఒక విధమైన సమతుల్యత ఉంటుంది. బిటి సాంకేతికం కేవలం కాయ తొలుచు పురుగులను నియంత్రిచినప్పుడు ఈ సహజ సమతుల్యత దెబ్బతిని ఇతర కీటకాల ఉధృతి పెరుగుతుంది. ఫలితంగా బిటి పత్తిలో ఇతర రసం పీల్చు పురుగులు, నల్లిలాంటి ఇతర పురుగుల ఉధృతి పెరిగింది. వీని నివారణకై సస్య రక్షణ మందులను గతం కన్నా అధికంగా వాడాల్సి వచ్చింది. బిటి సేధ్యానికి అనుమతి ఇచ్చే సమయంలో ఈ మార్పులను క్రమం తప్పకుండా పున్ణరంచన వేయాలని జన్యుమార్పిడి అంగీకార కమిటీ సూచించింది. కానీ, ఈ పున్ణరంచనా సరిగ్గా కొనసాగించడం లేదు.
పింక్‌బోల్‌వార్మ్ నిరోధక శక్తి....
పై నేపథ్యంలో, గుజరాత్ రాష్ట్రంలో కనీసం నాలుగు జిల్లాల్లో బిటి1 హైబ్రీడ్ రకానికి పింక్‌బోల్‌వార్మ్ నిరోధక శక్తిని పెంచుకున్నదనే వార్తలు ఆశ్చర్యం కలిగించడం లేదు. నాగ్‌పూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించిన తరువాత మాత్రమే మోన్‌సాంటో కంపెనీ మరోమార్గం లేక ఈ విషయాన్ని అంగీకరించాల్సి వచ్చింది. పైగా, బిటి1 రకానికి బదులుగా బిటి2 రకాన్ని వేసి రోగ నిరోధక శక్తి వేగంగా రాకుండా చేయవచ్చుని ఈ కంపెనీ 'రాయల్టీ లేని ఉచిత సలహాను' ఇస్తుంది. మరి రైతులకు జరిగిన నష్టానికి బాధ్యులెవరు? ఎవరు ఈ నష్టాన్ని పూడ్చుతారు? పైగా బిటి1కి నిరోధక శక్తి గల పింక్‌బోల్‌వార్మ్ అదే సాంకేతిక ఆధారంతో రూపొందించిన బిటి2 ఎంతోకాలం నిరోధక శక్తి కలిగి ఉండదో చెప్పలేం. జన్యుమార్పిడి శాస్త్రవేత్త, ఫ్లాంట్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ జాతీయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ పి. ఆనంద్ కుమార్ ఎరపంటను వేయనందువల్లనే బిటి1 టెక్నాలజీకి నిరోధక శక్తి వచ్చిందని, దీనికి బదులుగా బిటి2 రకాన్ని వేయాలని సూచిస్తున్నారు. దీనితోబాటు బోల్‌వర్మ్ నియంత్రణకు ''పత్తికాయలు అభివృద్ధి చెందే సమయంలో రైతులు కనీసం రెండుసార్లు పురుగుమందును పిచికారి చేయాలని, ఇది అదనపు ఆయుధంగా పని చేస్తుందని'' తన జన్యుమార్పిడి ఇంజనీరింగ్ కమిటీ సభ్యత్య అనుభవాన్నంతా క్రోడీకరించి ఇప్పుడు ఉచిత సలహా ఇస్తున్నాడు ఆనంద్ కుమార్. ఈ సూచన అసలు బిటి ప్రక్రియ ఉద్దేశ్యానికే విరుద్ధమైనది. ఇది గతంలోనే ఎంతో మంది విజ్ఞులు వెలిబుల్చిన భయాందోళనలను ధృవీకరిస్తుంది.
రాష్ట్రంలో బిటిపత్తి...
ఇక రాష్ట్రంలో బిటి1 టెక్నాలజీ ద్వారా మొదట పూర్తిగా, ఆ తరువాత 90 రోజుల వరకు కాయ తొలుచు పురుగు నుండి పత్తిని రక్షించ వచ్చని ప్రచారం జరిగింది. కాని ఈ ప్రచారం తప్పని ఇప్పుడు రైతులు అనుభంలో తెలుసుకున్నారు. పైరు వేసిన 70 రోజులను దాటి బిటి రక్షణ కలగటం లేదని క్షేత్ర నివేధికలు తెలుపుతున్నాయి. వాస్తవంలో ఈనాడు కాయతొలుచు పురుగు నియంత్రణకు కూడా సస్యరక్షణ మందులను గత రెండేళ్లుగా రైతులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో, బిటి సాంకేతిక సామర్థ్యం అసలు సరిగ్గా అంచనా వేయబడిందా అని అనుమానించాల్సి వస్తుంది.
బిటి విత్తన రేటును పెంచడం సమంజసమా?
ఇది చాలదన్నట్లు, విత్తన ఉత్పత్తి ఖర్చు పెరిగిందనే పేరుతో విత్తన కంపెనీలు విత్తనాల ధరను ప్యాకెట్‌కు బిటి1, బిటి 2 హైబ్రీడ్ రకాలకు రూ.650, 750 ల నుండి రూ. 950, 1050 పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిని చేశాయి. తమకు తెలిసిన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవమేమంటే బిటిపత్తి విత్తనాన్ని కాంట్రాక్టు పద్దతిపై రైతులే ఉత్పత్తి చేస్తున్నారు. పెరిగిన ఖర్చులను వీరే భరిస్తున్నారు. వీరికి ఇచ్చే రేటు 750గ్రా|| విత్తనానికి రూ. 250-280 మాత్రమే. అంటే 450గా|| పాకెట్‌కు రూ.150-170 మాత్రమే. విత్తన కంపెనీలు ట్రేట్ వాల్యూ రూపంలో మోన్‌సాంటోకు ఇప్పటికే ప్యాకెట్‌కు రూ. 90 నుండి 150 రూపాయలు చెల్లిస్తున్నారు. కేవలం మధ్యవర్తి పాత్ర వహించే విత్తన కంపెనీలు పాత ధరపైనే నూరు శాతం పైగా లాభాల్ని పొందుతున్నాయి. ఇక వారు కోరుకుంటున్న విధంగా విత్తనాల ధరలను పెంచితే, అదనంగా వచ్చే లాభాలు బాగా పెరుగుతాయి.అనధికార వార్తల ప్రకారం పెంచబోయే విత్తన రేటులో 50 శాతాన్ని ట్రేట్ వాల్యూగా మోన్‌సాంటో కంపెనీకి అదనంగా చెల్లించాలి.
అంటే ఒకవేళ కంపెనీలు కోరుతున్నట్లుగా ధరలను పెంచితే మోన్‌సాంటోకు అందే ట్రేట్‌వాల్యూ 450 గ్రా|| పా్యకట్‌కు బిటి1కు రూ. 240, బిటి2 రకానికి 300 రూపాయలు అందుతుంది. బిటి సాంకేతిక పరిజ్ఞానం క్షీణిస్తున్న దశలో విత్తన మార్కెట్‌పై గల గుత్తాధికారంతో విత్తన కంపెనీలు ఈ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. సుమారు 50 లక్షల ప్యాకెట్లు మన రాష్ట్రంలో అమ్ముడౌవుతాయనుకుంటే, పత్తి రైతులు అదనంగా 150 కోట్ల రూపాయల భారాన్ని మోయాల్సి వస్తుంది. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పత్తి రైతులు ఈ అదనపు భారాన్ని మోయగలరా? బిటి సాంకేతిక పరిజ్ఞానం క్షీణిస్తున్న దశలో ఈ అదనపు భారం ఏ మేర న్యాయమైంది? అసలు విత్తనోత్పత్తిలో అదనపు ఖర్చుల్ని ఎదుర్కొంటున్న కాంట్రాక్టు పత్తి విత్తన ఉత్పత్తిదారునికి పరిహార పెంపకం ఏది?ఈ పరిణామాలను పరిశీలిస్తే, బిటి విషయంలో గతంలో వెలిబుచ్చిన భయాందోళనలన్నీ వాస్తవాలేనని, ప్రభుత్వ మద్ధతుతో కంపెనీ చేసిన ప్రచారం అవాస్తవమని తేలుతుంది.
పట్టణాలపై ప్రపంచబ్యాంకు పంజా!
ధరలపై స్పందనలేని దగాకోరు ప్రభుత్వం
ద్రవ్యోల్బణం, ధరలు-ఆర్బిఐ చర్యలు
విత్తన చట్టం రైతులకా? కంపెనీలకా?
ఆహార భద్రతకు తిలోదకాలిచ్చే ప్రతిపాదనలు
సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో వెనుకంజ
బయటపడుతున్న గనుల బండారం
ఐరోపా కమ్యూనిస్టులపై పాలకుల అక్కసు
వైద్య వృత్తి మానవీయ విలువల్ని కాపాడుకోవాలి