'ఎందుకిలా జరిగింది, అసలేమౌతోంది దేశంలో, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ ఇంత మంది వీధులకు ఎక్కలేదు. అంతమంది ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో తేలాలి, అంతకంటే ముందు అసలు వారిని ఎలా రానిచ్చారు, వందమంది ఉంటారనుకుంటే వెయ్యిమంది పోలీసులను పంపి అణచివేసే మన యంత్రాంగానికి ఇప్పడు ఏమైంది, దాని సంగతి ఎలాగూ తేలుస్తాము, అసలు మీకేమైంది, ఇంత మంది వీధుల్లోకి వస్తుంటే మీకు తెలియకుండా ఎలా ఉంది, మీరంతా ఎక్కడున్నారు, వారు చేసిన నినాదాలను చూస్తే తప్పు మీలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఓటర్లకు వాగ్దానాలు చేయమని చెప్పాము, చెప్పాము సరే ఒకేసారి అన్ని అంశాలను పరిష్కరిస్తామని వాగ్దానం చేయమనలేదే, మనం వాగ్దానభంగపరులుగా ఎందుకు మారాలి? పౌరులన్నతరువాత ఫిర్యాదులు చేస్తారు, సంఘటితంగా ఉన్న ప్రభుత్వం వాటిని ఎల్లవేళలా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది, అలాంటి అధికారం లేకపోతే అరాచకానికి దారితీస్తుంది, జనంతో ప్రత్యక్ష సంబంధాలు ఎందుకు పోయాయి' ఇదంతా చూస్తుంటే ధుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయం గుర్తుకు వస్తోంది కదూ. నిజమే. ఎనిమిదేళ్లు అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు ప్రధానిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్ అధికారపార్టీ నాయకత్వంపై తిట్ల దండకానికి దిగాడని అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నాయి.
పుతిన్‌కు ఇంత కోపం ఎందుకొచ్చిందంటే జనవరి 31న కాలిన్‌గ్రాడ్ అనే పట్టణంలో ప్రధాని పుతిన్, ఆ రాష్ట్రగవర్నర్ బూస్ రాజీనామా చేయాలని దాదాపు పన్నెండువేల మంది ప్రదర్శకులు డిమాండ్ చేశారు. లక్షలాది మంది ప్రదర్శనలు జరిపినా దున్నపోతు మీద వానకురిసినట్లుగా ఉండే మన పాలకపార్టీల నాయకుల గురించి పుతిన్‌కు తెలియదా ఏమిటి, పన్నెండువేల మంది ప్రదర్శనకే అంతలా రెచ్చిపోవాలా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఎందుకో తరువాత చూద్దాం. ఆటోవిడి భాగాల దిగుమతులపై భారీగా పెంచిన పన్ను, పెంచిన విద్యుత్,ఇతర సేవల ధరలు తగ్గించాలని, పెన్షన్లు పెంచాలని, మాంద్యం తగ్గేవరకు పన్నుల పెంపుదలను స్థంభింపచేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఒక వేదిక పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆటోవిడిభాగాల పన్ను రద్దు చేసి జనం ఆగ్రహంపై నీళ్లు చల్లాలని చూసింది. అయితే మిగతా డిమాండ్లతో ఆ ప్రదర్శన కొనసాగించాలని వేదిక నిర్ణయించింది. చివరకు ఆ ప్రదర్శనలో పుతిన్ రాజీనామా అనే రాజకీయ డిమాండ్ ముందుకు వచ్చింది. అదే రోజు మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్ వంటి అనేక పట్టణాలలో చిన్న చిన్న ప్రదర్శనలు జరిగాయి. అయితే వాటిని భారీ పోలీసుబలగాలతో విఫలం చేశారు.
కాలిన్‌గ్రాడ్ పోలీసులు మాత్రం ప్రదర్శకులను ఉపేక్షించి చూసీ చూడనట్లు వ్యవహరించారు. ధిక్కారమున్ సైతునా అని ఒక్కసారిగా పుతిన్ సర్కార్ ఉలిక్కిపడింది. ఎందుకిలా జరిగిందో యుద్ధ ప్రాతిపదికన విచారించాలని ఉన్నతాధికారులను కాలిన్‌గ్రాడ్‌కు పంపింది. మరోవైపున అదే రోజున అనేక పట్టణాలలో జరిగిన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకొని జరగనీయకుండా చేసినపుడు కాలిన్‌గ్రాడ్‌లో అనుమతించినవారిపై ఎందుకు చర్య తీసుకోరాదని ఆలోచిస్తోంది.ఈ పరిణామం పాలక కూటమిలో విమర్శలు, ప్రతివిమర్శలకు కారణమైంది. పార్లమెంట్‌లో మూడింట రెండువంతుల మెజారిటీ ఉన్న అధికారపక్షం మార్చి 14న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో 90శాతం స్థానాలు సాధించాలని యునైటెడ్ రష్యా భావిస్తోంది. వాటికి ఎక్కడ గండి పడుతుందో అన్నదే దాని అసలైన దుగ్ద.సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసిన తరువాత గత రెండు దశాబ్దాలుగా రకరకాల జిమ్మిక్కులతో రష్యన్లను నమ్మించి పబ్బంగడుపుకున్న శక్తుల నిజస్వరూపం నానాటికీ బయట పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బాగా ఉన్నపుడు జనాన్ని బుజ్జగించిన పుతిన్ సర్కార్‌కు ఇప్పుడు సాధ్యం కావటం లేదు. 2007 నుంచి మూడోవంతు పెరిగిన నిరుద్యోగ సైన్యం 60లక్షలకు చేరింది. పశ్చిమదేశాలకు జూనియర్ భాగస్వాములుగా మారేందుకు ప్రయత్నించిన మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్‌కు అండగా ఉన్న శక్తులు రాజకీయంగా ప్రజలకు దూరమైన సమయంలో పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం, అదే సమయంలో అంతర్జాతీయ చమురు ధరలు పెరగటంతో రాబడి పెరిగి వేతనాలు, పెన్షన్లను చెల్లించటంతో జనం సంతృప్తి చెందారు. మరోసారి ఇప్పుడు రష్యా బొక్కసం ఖాళీ అవుతోంది.
అనేక సేవల ఛార్జీలను గణనీయంగా పెంచారు. విదేశీకార్లు, విడిభాగాలపై పన్నుపెంచి స్వదేశీ కార్ల పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరచేందుకు చేసిన యత్నం అనేక మందికి ఆగ్రహం కలిగించింది. బొక్కసాన్ని నింపుకోవాలంటే ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వరంగ ఆస్తులను అమ్ముకోవటం మినహా ప్రభుత్వానికి మరొక మార్గం కనిపించటం లేదు. అందుకే ఈ ఏడాది 7,200 బిలియన్ రూబుళ్లను ప్రైవేటీకరణ ద్వారా కూడపెట్టుకోవాలని పుతిన్ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం కొన్ని చట్టాలను కూడా సవరించేందుకు నడుం కట్టింది.
రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్టుపార్టీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు గాను పుతిన్ తన నమ్మినబంట్లు కొందరితో జస్ట్ రష్యా పార్టీ అనే కొత్త పార్టీని పెట్టించాడు. దాని నాయకుడైన సెర్గీ మిరొనోవ్ ఫెడరేషన్ కౌన్సిల్ స్పీకర్‌గా ఉన్నారు. పాలకపార్టీపై జనంలో ఆగ్రహం ఉన్నపుడు వ్యతిరేక ప్రకటనలు చేసి తమవైపు తిప్పుకోవటం, అదే సమయంలో ప్రభుత్వానికి మద్దతు తెలపటం ఆ పార్టీ విధి. దానిలో భాగంగానే మిరోనోవ్ కాలిన్‌గ్రాడ్ ప్రదర్శన తరువాత పుతిన్‌పై ధ్వజమెత్తాడు. దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న రష్యన్లు ఇంకేమాత్రం అలా ఉండటానికి వీల్లేదు. పుతిన్ బడ్జెట్, మాంద్యాన్ని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఉపయోగపడవని ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నాడు. దానిపై యునైటెడ్ రష్యా నాయకులు స్పందిస్తూ మిరోనోవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విమర్శ ప్రతి విమర్శలు ప్రజలెదుర్కొంటున్న సమస్యలనుంచి దృష్టిని పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కమ్యూనిస్టుపార్టీ నాయకుడు సెర్గీ ఒబుకోవ్ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రజానిరసనలు ప్రారంభం కాకుండా సర్కార్ కదలదు, మరొకటేమిటంటే ఆ ప్రదర్శనలు తొమ్మిదో లేదా పన్నెండు వేలో కాదు, 1989-91 మాదిరి కనీసం 50వేల మందితో జరిగితేనే ప్రయోజనం ఉంటుందని రష్యన్ ఇన్ఫర్మేషన్ ఏజన్సీ వ్యాఖ్యాత నికొలారు ట్రాట్‌స్కీ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కొసమెరుపేమిటంటే కాలిన్‌గ్రాడ్ ప్రదర్శన అధ్యక్షుడు మెద్వెదెవ్, ప్రధాని పుతిన్‌లను కుదిపేసినప్పటికీ వారి కనుసన్నలలో పనిచేసే టీవీ,రేడియో, పత్రికల్లో ఒక్క ముక్కంటే ఒక్క ముక్క వార్త కూడా రాలేదు. ఇంటర్నెట్ బ్లాగ్‌ల ద్వారా బయటకు వచ్చింది. ఇదీ అక్కడి మేడి పండు ప్రజాస్వామ్యం.