బిటి వంకాయ గురించి చేసిన తమ ప్రయోగాలను భారత్‌లోని మహికోగానీ, బహుళజాతి సంస్ధ అయిన మోన్‌శాంటోగానీ స్పష్టంగా తెలియచేయటం లేదు. పారదర్శకంగా లేకపోవటం వారి వ్యాపారతత్వాన్నే తెలియచేస్తున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానంపై ఎవరి అదుపు ఉంటుంది?
మట్టిపొరలలో లభించే ఒక బాక్టీరియాను (బాసిల్లస్ తురింజిన్‌సిస్, ఈ రెండు పదాల మొదటి అక్షరాలను కలిపి బిటి అంటున్నాము) వంకాయలో ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశపెట్టినందున సాధారణంగా వంగ మొక్కను ఆశించే పురుగులకు హాని కలిగించే ఒక విషపదార్ధం మొక్కలో తయారవుతుంది. దీనివల్ల వంగ కాపు పెరగటమేకాక, పురుగు మందుల వాడకం తగ్గుతుందని చెపుతున్నారు.
జన్యుపరమైన మార్పులతో కూడిన ఆహార పదార్థాల గురించి భారతదేశంలో తీవ్రమైన వివాదాలు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తత్సంబంధిత చర్చలే నడుస్తున్నాయి. జన్యుపరంగా మార్పులు చేసిన వంకాయ (దీనినే బిటి వంకాయ అంటున్నారు) రకాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన అనుమతి ఇచ్చేవిషయమై భారతదేశంలో చర్చ సాగుతున్నది. ఐరోపాలో కూడా ఇలాంటి చర్చే సాగుతున్నది. అక్కడ జన్యుపరమైన మార్పులతో కూడిన బియ్యం రకాన్ని ప్రవేశపెట్టాలని బేయర్ సంస్ధ కోరుతున్నది. జన్యుపరమైన ఆహార పదార్ధాల విషయమై సాగుతున్న చర్చలో అనేక అంశాలు ఉన్నాయి. ఈరకమైన ఆహార పదార్థాల వినియోగంవల్ల కలిగే సమస్యలు, సాగుకు సంబంధించిన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అదుపు వగైరాల గురించి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారం గురించి సమగ్రమైన అవగాహనకు రావాలంటే, జన్యుపరంగా మార్పుచేసిన మొక్కల ఉత్పత్తి తదితర అంశాల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ భూతలమంతటిలోనూ మానవులు ప్రత్యేకమైన లక్షణాలను కలిగిన వారు. వివిధ ప్రాణుల ఉత్పత్తిలోనూ, వాటి అభివృద్ధిలోనూ ప్రకృతి నిర్వహించే పాత్రను మెరుగుపరచటానికిగానీ, మార్పు చేయటానికిగానీ సమర్ధత గలిగినట్టిది మానవజాతి ఒక్కటే. అస్తిత్వంలోవున్న ప్రాణులలో మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో మార్పులు చేయగలిగింది కూడా మానవ జాతేనని చెప్పవచ్చు. ప్రకృతిలో మార్పు తీసుకు రావాలన్న మానవుని అభిలాష ఈనాటిది కాదు. మొక్కల నుంచీ, జంతువుల నుంచీ మనకు లభ్యమయ్యే ఆహారం అనేక మార్పులకూ చేర్పులకూ గురైనదే. ఆదిమ మానవులు సాగుచేసిన 'అడవి' మొక్కజొన్న, గోధుమ, బియ్యం వంటివి అనేక మార్పులకు గురయ్యాయి. ఈ మార్పుల కారణంగా దిగుబడులు, నాణ్యత, సువాసన, రుచి వగైరా పెరిగాయి.
ప్రపంచం మొత్తంమీద అత్యధిక ప్రాధాన్యతగల ఆహారంగావున్న వరిని ఉదాహరణగా తీసుకుందాము. సుమారు 12,000-11,000 సంవత్సరాల క్రితం యాంగ్జీ నదీ లోయలో వరిని సాగుచేసే వారని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అడవుల్లో పెరిగే వరిధాన్యాన్ని సేకరించటం నుంచి వరిని సాగుచేసే విధానం వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మధ్య చైనాలో రెండు రకాలైన వరిని (వీటిని ఈనాడు ఇండికా, జపోనికా అని పిలుస్తున్నాము) సాగు చేస్తుండేవారు. సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ సాగు పద్ధతి మధ్య చైనా నుండి ఆగేయాసియా, దక్షిణాసియాలకు వ్యాపించింది. జపాన్‌లో వినియోగించే ముతక ధాన్యం నుండి బాస్మతి వరకు రకరకాల వరి భారత్, పాకిస్ధాన్‌లలో సాగవుతున్నది. ఈ రకాలన్నీ ఒకప్పుడు అడవి గడ్డి నుంచి వచ్చినవే. పెంపుడు జంతువులలో కూడా ఎంపిక చేసిన రకాలకు విలువ పెరిగింది. మనచుట్టూ గుర్రమూ, కుక్క తదితరాలు కనపడటానికి కారణం ఇదే. కాలక్రమంలో సంకర జాతులు ఉద్భవించాయి. రెండు రకాలైన జాతులను కలిపి ఒక జాతిని తయారు చేయటాన్ని ఇందులో మనం చూస్తాము.
విభిన్నమైన జన్యుమార్పిడి విధానం
సజీవ ప్రాణుల కణ నిర్మాణం రీత్యా వాటిని సంకరం చేయటం సాధ్యమవుతున్నది. సమస్త ప్రాణులలోనూ కణాలు, జన్యువులు ఉంటాయి. ఇవే విభిన్నమైన లక్షణాలకు కారణమవుతాయి. ఒకేరకమైన జాతిలో సైతం ఏ రెండూ అచ్చు గుద్దినట్లుండవు. ఒకే జాతివారైనప్పటికీ ఇరువురు మానవులను మనం గమనించినట్లయితే వారిరువురి మధ్యా తేడాలు కనిపిస్తాయి. మొక్కలలోనూ, జంతువులలోనూ సైతం ఇదే పద్ధతి కనపడుతుంది. జన్యు కణాలలోని తేడాయే ఇందుకు కారణం. ఒకే జాతికి చెందిన రెండింటిలో జన్యుకణాలు ఒకేరకంగా కనిపించినప్పటికీ ఒకదానికొకటి ప్రతిరూపంగా ఉండవు. వరిని తీసుకున్నట్లయితే కొన్ని మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. అంటే వీటిలో పొడవును పెంచే జన్యుకణాలు ఉన్నాయన్న మాట. రైతుగాని వీటి విత్తనాలను జాగ్రత్త చేసి మరుసటి ఏడాది విత్తినట్లయితే ఎక్కువ భాగం ఎత్తయిన మొక్కలే వస్తాయి. కొంతకాలం తరువాత చూసినట్లయితే గతంలో కన్నా ఎత్తు ఎక్కువ పెరిగే పైరుకు సంబంధించిన విత్తనాలు తన వద్ద ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇకపోతే సంకరం విషయానికి వస్తే, తాను జాగ్రత్త చేయదలచుకున్న రెండు లక్షణాలను కలపటం అన్నమాట. ఉదాహరణకు వర్షాభావాన్ని తట్టుకునే రకాన్నీ, ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాన్నీ కలిపినట్లయితే ఈ రెండు గుణాలున్న రకం ఉనికిలోకి వస్తుంది.
వేల సంవత్సరాలుగా మానవుడు తయారు చేస్తూ వస్తున్న వాటితో జన్యు మార్పిడి రకాలు ఎలా వేరు పడతాయో చూద్దాము. పైన పేర్కొన్న విధానాలన్నీ ప్రకృతిపై ఆధారపడినవి. ఈ పద్ధతిలో కోరుకోని లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. పైగా ఈ పద్ధతిలో సంతృప్తికరమైన ఫలితాలను పొందాలంటే చాలా ఏళ్ళు వేచి చూడాలి. జన్యు మార్పిడి పద్ధతిలో చాలా తక్కువ కాలంలోనే ఫలితాలు సాధించవచ్చు. జన్యు మార్పిడి అంటే కణాలను కలిపివేయటం. ప్రయోగశాలలోనే వీటిని కలుపుతారు. ఒక ప్రాణ కణంలోకి జన్యువును చొప్పించటం లేదా తీసివేయటాన్నే జన్యుమార్పిడి అంటారు. ఈ మార్పిడి ఒకే జాతిలో జరిగితే అంతర్ జన్యుమార్పిడి అని, వేర్వేరు జాతుల జన్యువుల మధ్య మార్పిడి జరిగినట్లయితే బాహ్య జన్యుమార్పిడి అని అంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాత్రమే ఈ మార్పిడి సాధ్యం కాగలదు. ఒక జాతి జన్యుకణాలను మరో జాతి జన్యుకణాలతో అనుసంధానం చేయటం ప్రకృతిలో ఎన్నడూ జరగదు లేదా అరుదుగా మాత్రమే జరుగుతుంది.
బిటి వంకాయ విషయానికొస్తే ఈ సాంకేతిక విజ్ఞానం ఎలా ఉపయోగపడుతున్నదీ మనం అర్థం చేసుకోవచ్చు. మట్టిపొరలలో లభించే ఒక
బాక్టీరియాను (బాసిల్లస్ తురింజిన్‌సిస్, ఈ రెండు పదాల మొదటి అక్షరాలను కలిపి బిటి అంటున్నాము) వంకాయలో ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశపెట్టినందున సాధారణంగా వంగ మొక్కను ఆశించే పురుగులకు హాని కలిగించే ఒక విషపదార్ధం మొక్కలో తయారవుతుంది. దీనివల్ల వంగ కాపు పెరగటమేకాక, పురుగు మందుల వాడకం తగ్గుతుందని చెపుతున్నారు. దీనిని బహుళజాతి సంస్ధ మోన్‌శాంటో తయారు చేసింది. భారత్‌లో వీటి ట్రయల్స్‌ను మహికో (మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ)తో కలిసి చేపట్టింది. మహికో-మోన్‌శాంటో కలిసి బిటి వంగ విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఆందోళన కలిగించే అనేక విషయాలు
జన్యుమార్పిడి రకాల ప్రవేశంవల్ల ప్రకృతిలోని ఇతర రకాలపై ప్రభావం పడగలదన్న ఆందోళన పెరుగుతున్నది. ఒకసారిగాని జన్యుమార్పిడి పంటలను సాగుచేసినట్లయితే కాలక్రమంలో అవి తమ జన్యుకణాలను ఇతర భూముల్లో సాగవుతున్న పంటలకు సంక్రమింపచేస్తాయి. అంటే కాలక్రమంలో జన్యుమార్పిడి జాతులు ప్రకృతిలో పెరుగుతాయన్నమాట. కనుక మున్ముందు హాని జరగదన్న హామీ ఏమీ లేదు. సైద్ధాంతికంగా చూసినట్లయితే కృత్రిమంగా ఒక జన్యువును ప్రవేశపెట్టినట్లయితే పంటకు లేదా పర్యావరణానికి నష్టం జరిగే అవకాశం ఉన్నది. కనుక ప్రయోగ సమయంలోనే కచ్చితమైన పరీక్షలను నిర్వహించాలని చెపుతున్నారు. జన్యుకణాల మార్పిడి కారణంగా ప్రకృతికి నష్టం
జరగరాదన్నదే పలువురి ఆకాంక్ష.
జన్యుమార్పిడి సాంకేతిక పరిజ్ఞానం జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి ఏకీకృత పద్ధతిని ప్రవేశపెట్టే ప్రమాదం ఉన్నది. జన్యు మార్పిడి రకాలు పెరిగినట్లయితే అవే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమిస్తాయి. ఈ రకాలు విఫలమైతే ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. కనుక జీవ వైవిధ్యాన్ని కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండవ విషయమేమంటే మానవుల వినియోగార్ధం జన్యుమార్పిడి రకాలను ప్రవేశపెడుతున్నారు. ఆహార పంటల్లో జన్యుమార్పిడి వలన మానవులకు ఎలాంటి హానీ జరగదన్న హామీ ఉండాలి. ఏ మొక్క ఉపయోగమో ఏది హానికరమో అన్న విషయాన్ని వేల సంవత్సరాల అనుభవంలో మానవుడు గ్రహించాడు. కాని ప్రస్తుతం కొద్ది సంవత్సరాల అనుభవాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటున్నాము. కనుకనే జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెట్టేటపుడు మానవులకు హాని జరగదన్న పూర్తి హామీ ఉండాలి. ఇదియిలా ఉండగా జన్యుమార్పిడి ఆహార పదార్ధాల విషయంలో వివిధ దేశాలు విభిన్న నిబంధనలను పాటిస్తున్నాయి. జన్యుమార్పిడి ఆహారం అన్న లేబుల్‌ను ప్రదర్శించాల్సిన అవసరం లేదని అమెరికా, కెనడా చట్టాలు చెపుతున్నాయి. కాగా ఐరోపా యూనియన్ దేశాలు, జపాన్, మలేసియా, ఆస్ట్రేలియాలలో ఇలాంటి లేబుల్‌ను తప్పనిసరిగా వేయాలి. అలా చేసినపుడు వినియోగదారుడు తన ఇష్టాన్నిబట్టి కొనటమో లేక మానటమో చేస్తాడు. లేబుల్‌ను వేయటమేకాక జన్యుమార్పిడి ఉత్పత్తులను ఇతర ఉత్పత్తులకు వేరుగా ఉంచాలి.
ఐరోపా యూనియన్‌లోని మొత్తం సాగుభూమిలో జన్యుమార్పిడి పంటలను కేవలం 0.05 శాతంలో మాత్రమే సాగు చేస్తుండగా అమెరికాలో 18 శాతం భూమిలో సాగుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే జన్యుమార్పిడి వంటనూనెలో 96 శాతం ఒక్క అమెరికాలోనే ఉత్పత్తి అవుతున్నది. అలానే ఆహార పదార్ధాల విషయంలో కూడా అమెరికాయే ముందున్నది. ఏదియేమైనా పర్యావరణంపైనా, ఆరోగ్యంపైనా వీటి ప్రభావాన్ని తప్పని సరిగా పరిశీలించాలి. వీటి వాడకంపై ప్రపంచ దేశాలలో ఏకాభిప్రాయం లేదు. భారతీయులమైన మనం ఈ అంశాన్ని ప్రజలలో చర్చకు పెట్టటం ద్వారా ఒక నిర్ణయానికి రావాలి. ఆ విధంగానే మన స్వంత మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవాలి.
జన్యుమార్పిడి సాంకేతిక పరిజ్ఞానంపై అదుపు ఎవరికుంటుందన్నదే అత్యంత ప్రధానమైన మూడవ విషయం. ఈనాడు జీవ సాంకేతిక పరిజ్ఞానం బడా కంపెనీల సొత్తుగా మారింది. జన్యుమార్పిడి సాంకేతిక విజ్ఞానం విషయంలో కూడా ఇదే వాస్తవం. ఈ విజ్ఞానం ప్రత్యేకించి భారత్‌వంటి వర్ధమాన దేశాల వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తుంది. సంప్రదాయకంగా మన దేశ రైతులు తదుపరి పంటకు ఇప్పటి పంటలో నుంచి విత్తనాలను జాగ్రత్త చేసుకుంటారు. సంకర జాతి రకాల ప్రవేశంతో ఈ పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రైతులు విత్తనాల కంపెనీల వద్ద సంకరజాతి రకాలను కొనుగోలు చేస్తున్నారు. లేదా ప్రభుత్వ సరఫరాలపై ఆధారపడుతున్నారు. జన్యుమార్పిడి రకాలు వస్తే రైతులు మరింతగా కంపెనీలపై ఆధారపడవలసి వస్తుంది. భారత్‌లో పరిశోధనల ఫలితాలు ఎక్కువగా ప్రైవేటు కంపెనీలకే చెందుతున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం విదేశీ కంపెనీలు. ఆహారము తదితరాల కోసం బహుళజాతి సంస్థలపై ఆధారపడితే అది దేశానికే ప్రమాదమవుతుంది.
ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నది?
బిటి వంకాయ గురించి ప్రస్తుతం మన దేశంలో సాగుతున్న చర్చలో పైన మేము తెలిపిన అంశాలు ప్రస్తావనకు రావలసిన అవసరం ఉన్నది. బిటి వంకాయ గురించి చేసిన తమ ప్రయోగాలను భారత్‌లోని మహికోగానీ, బహుళజాతి సంస్ధ అయిన మోన్‌శాంటోగానీ స్పష్టంగా తెలియచేయటం లేదు. పారదర్శకంగా లేకపోవటం వారి వ్యాపారతత్వాన్నే తెలియచేస్తున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానంపై ఎవరి అదుపు ఉంటుంది? ప్రభుత్వం ఎవరి పక్షాన, అంటే ప్రజల పక్షానా లేక మోన్‌శాంటోవంటి బహుళజాతి సంస్థల పక్షాన నిలుస్తుందా? అన్నదే ఈనాడు ప్రధానంగా చర్చించవలసివుంది.
ఆర్థిక మెరుగుదల - అగుపించని జాడలు
ధరల నియంత్రణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది
ఇది మహిళా పోరాట సంవత్సరం
థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రజారోగ్యానికి హాని చేస్తాయా?
బిటి పత్తి - నిరూపితమౌతున్న భయాందోళనలు
చారిత్రాత్మక విజయం
2010-11 బడ్జెట్ ఆమ్ఆద్మీ ముసుగు తొలగింది
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అమెరికాలో ఆందోళనలు
అవనిలో సగం - హక్కులు, అవకాశాలు శూన్యం