సద్దుమణగని ఉత్కంఠ - సర్దుకుంటున్న కాంగ్రెస్‌

శ్రీకృష్ణకమిటీ విచారణాంశాలు ఖరారు కాకముందే తమ కాంగ్రెస్‌ వారిని జెఎసి ల నుంచి నెమ్మదిగా తగ్గించడం, హుకుంలు జారీ చేయడం, ముఖ్యమంత్రిని ఢిల్లీ రప్పించి కాంగ్రెస్‌లో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల్లో చాలా సంకేతాలున్నాయి. ఈ కమిటీలో జగన్‌, కె.విపిలకు కూడా చోటు కల్పించడాన్ని బట్టి వైఎస్‌ మరణానంతర అంతర్గత మధనాన్ని పున్ణప్రారంభించినట్టవుతున్నది.

తెలకపల్లి రవి

    కాంగ్రెస్‌ అధిష్టాన వర్గమూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ పరిణామాలపై దశలవారీగా నెమ్మదిగా చేస్తున్న ప్రకటనలు వ్యూహాత్మకమే అయినా వూహాగానాలను ఉత్కంఠను కొనసాగించడానికి కారణమవుతున్నాయి. తద్వారా తమ పార్టీ వారికి అవసరమైన ఉపశమనం కలిగించినప్పటికీ ఉద్రేకాలు పెంచే శక్తుల ధోరణిలో మాత్రం మార్పు వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర పరిస్థితులపై వేసిన కమిటీని ఆధారం చేసుకుని రెండు ప్రాంతాలలోని కాంగ్రెస్‌ నేతలు తమదైన భాష్యాలు చెప్పుకుని బయటపడుతుంటే తెలుగు దేశం అంత సూటిగా సర్దుకోలేకపోతున్నది. ముఖ్యంగా తెలంగాణేతర ప్రాంతాలలో తెలుగుదేశం నాయకులు ఇది రాష్ట్రాన్ని విభజించే కుట్ర అంటుంటే తెలంగాణాలోని తెలుగు దేశం నాయకులు ఇది కాలయాపన ఎత్తుగడ అని ధ్వజమెత్తుతున్నారు. సంప్రదింపుల ద్వారా సంయమనంతో సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని మొదటి నుంచి చెబుతున్న సిపిఎం ఇప్పుడు అదే వైఖరిని పునరుద్ఘాటిస్తున్నది. కాగా టిఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తున్నది. కేంద్ర బిజెపి ఈ కమిటీ రాజ్యాంగ విరుద్ధమన్నట్టు వ్యాఖ్యానించింది. అసలు కమిటీ ఏర్పాటు దాని విధి విధానాలను కేంద్రం ఒక్కసారిగా వెల్లడించకుండా దశలవారీగా దాగుడుమూతలు కొనసాగిస్తున్నది. కమిటీ వేయవచ్చన్న సూచనలు మొదట, పేర్లు తర్వాత, విచారణాంశాలు ఆ తర్వాత... వదులుతున్నది. ఇదంతా యాదృచ్ఛికం కాదన్నది స్పష్టమే.

    జస్టిస్‌ శ్రీకృష్ణ నాయకత్వంలో వేసే ఈ అయిదుగురు సభ్యుల కమిటీని తెలంగాణా విభజన కోసమే ఏర్పాటు చేస్తున్నారా లేదా అన్నది పెద్ద చర్చగా సాగుతున్నది. కేంద్రం తొలి ప్రకటనను బట్టి చూసినా రాజకీయ వాస్తవికతను బట్టి ఆలోచించినా దీనికి సమాధానం తేలిగ్గానే దొరుకుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితిపై అభిప్రాయాల సేకరణ అన్నప్పుడు అందులో తెలంగాణాతో సహా అన్ని విషయాలూ వుండటం సహజం. దీనిపై నేరుగా ప్రకటన చేయాలని, కమిటీలు అవసరం లేదని చెప్పడం రాజకీయ ప్రచారానికి ప్రజల మనోభావాలను సంతృప్తి పర్చడానికి తప్ప రాజ్యాంగ పరంగా అక్కరకు వచ్చే వాదన కాదు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇలాటి సమస్యలపై అనేక కమిటీలు, అధ్యయనాలు, వాద ప్రతివాదాలు జరిగిన తర్వాతనే పరిష్కారాలు సాధ్యమయ్యాయి. అందులో కొన్నిటికి సంవత్సరాలు పట్టగా మరికొన్ని త్వరితంగా ముగిసిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌ విషయమే తీసుకుంటే రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతరం లేదని ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1947లో ప్రకటిస్తే అది వాస్తవరూపం దాల్చడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఈ లోగా అనేక వాదోపవాదాలు తర్జనభర్జనలూ, ప్రతిపాదనలూ, సవరణలూ అనుకూలతలూ ప్రతికూలతలూ. పొట్టి శ్రీరాములు బలిదానం గురించి తరచూ చెప్పేవారు ఆయన కోరినట్టు మద్రాసు రాష్ట్రంతో తెలుగు నాడు రాలేదని గుర్తుంచుకోవాలి. అలాగే బళ్లారి ఆంధ్రప్రదేశ్‌కు రావాలన్న ఒక సిఫారసు తర్వాత న్యాయస్థానంలో వీగిపోయింది. రాజకీయ పార్టీల వైఖరుల్లో కూడా అనేకానేక మార్పులు మలుపులూ వున్నాయి. అందులోనూ ఫ్రధానంగా కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా ప్రభావం చూపింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కమ్యూనిస్టులే కారణమని చేసే వాదన చారిత్రకంగా సత్యమే కాని అది పాక్షిక సత్యం. ఎందుకంటే 1921లో కాంగ్రెస్‌ భాషా ప్రాతిపదికను గుర్తించే నాటికి కమ్యూనిస్టులు ఇంకా ఒక శక్తిగానే లేరు.1928లోనే జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ మేరకు నివేదిక నిచ్చారు. బ్రిటిష్‌ వారు పంపించిన సైమన్‌ కమిషన్‌ కూడా అదే విధమైన నివేదిక నిచ్చింది. 1945లో అంటే స్వాతంత్రానికి పూర్వం జరిగిన ఆఖరి ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రణాళికలోనే ఈ వాగ్ధానం చేసింది. ఆనాటి పరిస్థితుల్లో అదొక అనివార్యమైన శాస్త్రీయమైన వైఖరి. బ్రిటిష్‌వారి హయాంలో 9 రాష్ట్రాలూ, 5 చీఫ్‌ కమీషనర్ల పాలిత రాష్ట్రాలు వుండేవి. ఇవి గాక చిన్నా చితక స్వదేశ సంస్థానాలు 562 వున్నాయి. కాబట్టి స్వతంత్ర భారత రాజకీయ పునర్వ్యవస్థీకరణ అప్పుడు చారిత్రిక అవసరం. అందుకు భాష ప్రాతిపదిక కావడం శాస్త్రీయ నిర్ణయం. హిందీ భాషలో గాని, మరో భాషలో గాని ఒకటికి మించిన రాష్ట్రాలు వున్నాయంటే దానికి చారిత్రిక కారణాలు కనిపిస్తున్నాయి. పంజాబీ, మరాఠా భాషలకు రెండు రాష్ట్రాలున్నాయంటే కారణం అక్కడ విదేశీ పాలన ఆలస్యంగా అంతం కావడమే. దాన్ని ఒక సాధారణ సూత్రంగా మార్చేస్తే కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. హర్యానాను పంజాబ్‌ నుంచి, గుజరాత్‌ను మహారాష్ట్ర నుంచి విడదీయడం భాష ప్రాతిపదికపైనే. అవన్నీ ఫజల్‌ అలీ సిఫార్సులే. హైదరాబాదును ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం కూడా ఆ కమిషన్‌ సిఫారసుల ప్రకారం జరిగిందే. కాకపోతే ఆయన అయిదేళ్లు ఆగిచూడమంటే అప్పటి దాకా ఆగకుండానే పాలకవర్గాలు విలీనం చేశాయి. ఇందుకు కమ్యూనిస్టుల సైద్ధాంతిక రాజకీయ క్రియాశీలత దోహదం చేసిన మాట నిజమే గాని అంతిమంగా నిర్ణయం మాత్రం పాలకవర్గాలదే.

    ఇప్పుడు కొత్తగా విభజన నినాదాలు వచ్చినందున ఏం చేయాలో తప్పక సంప్రదించుకోవచ్చు. కాని అందుకోసం గతాన్ని పాక్షికంగానో, పొరబాటుగానో చూపనక్కరలేదు. ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణా కోసం 56 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుందన్న మాట అదే పనిగా వినిపిస్తున్నది. 1956లో విలీనం ఒప్పందం మేరకే జరిగింది. అది కూడా తెలుగు వారికే కాదు. మరాఠా ప్రాంతాలు మహరాష్ట్రలో కన్నడ ప్రాంతాలు కర్ణాటకలో కలిసినట్టే తెలుగు జిల్లాలు తెలుగు రాష్ట్రంలో కలిశాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందాల ఉల్లంఘన కాంగ్రెస్‌ పుణ్యమే. అయినా 1969లో గాని విభజన ఉద్యమం రాలేదు. అలాగే 1972లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాలు వచ్చిన మాటను మాత్రమే చెప్పి తర్వాత చారిత్రికంగా అవి నిలవలేకపోయిన భాగాన్ని విడిచిపెడితే పాక్షికత్వం అవుతుంది. తెలంగాణా విభజనవాదులు ప్రకటించిన పుస్తకం ప్రకారమే 1969 తర్వాత మళ్లీ 1986లో తెలంగాణా ఇన్ఫర్మేషన్‌ ట్రస్టు ఏర్పాటు,1992లో కాకతీయ యూనివర్సిటీలో ఒక శాఖ ఏర్పాటు మాత్రమే జరిగాయి. బిజెపి చిన్న రాష్ట్రాల నినాదం తెచ్చిన తర్వాత 1993లో అందుకు సంబంధించిన సదస్సు జరిగింది. 1996 తర్వాత కొంతమంది విద్యాధిక వర్గాలు దీనిపై ప్రచార సాహిత్యం తీసుకురావడం పెరిగింది. ఆ దశలో ఇప్పటి టిఆర్‌ఎస్‌ నేతలు కూడా దాన్ని బలపర్చిన దాఖలాలు లేవు. 2001 తర్వాత వారి కార్యకలాపాలు మొదలైనాయి. 56 ఏళ్లు అన్న మాట వెనక వాస్తవాలు ఇవి. మరోవైపు చూస్తే విశాలాంధ్ర ఉద్యమం1913లో మొదలైంది. దేశంలో భాషా రాష్ట్రాల ఏర్పాటుకే అది వూపునిచ్చింది. కాని అలాటి చోటనే 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. జై ఆంధ్ర, జై తెలంగాణా రెండూ పాలకవర్గ నాయకుల నుంచి వచ్చిన ఉద్యమాలే. ఆ అవసరాలు తీరగానే వారు సద్దుచేయకుండా సర్దుకున్నారు. ఇప్పుడు కూడా డిసెంబరు 9 ప్రకటన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. అప్పటి వరకూ తెలుగు ప్రజలందరూ పరస్పరం సహనశీలతనూ సుహృద్భావాన్ని కాపాడుకున్నారు. గత చరిత్ర నాటికి ఇప్పటికి పరిస్థితులలో మార్పు వుండొచ్చు కాని పాలకవర్గాల పాచికల గురించి మాత్రం ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందే.

    శ్రీకృష్ణ కమిటీ ఏం చేస్తుందనే దానికంటే దాని ముందు ప్రధాన పార్టీలు ఏం చెబుతాయన్నదే ముఖ్యమైన సమస్య. వివిధ ప్రాంతాలలో విభిన్న వాదనలు వారు చేస్తున్నప్పుడు పరిష్కారం సాధించేది వుండదు. ఎందుకంటే కమిటీలు, కమీషన్లు నివేదిస్తాయే తప్ప నిర్ణయాధికారం కలిగివుండవు. ఆ బాధ్యత మళ్లీ రాజకీయ పార్టీల దగ్గరకే వస్తుంది. రాజ్యాంగం మూడవ అధికరణం ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు పునర్విభజన పార్లమెంటు చేపట్టాలంటే అందుకు రాష్ట్రపతి సిఫార్సు చేయాలి. దానికి ముందు ఆయన సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవాలి. ఒక్కో పార్టీకి చెందిన వారు రెండుచోట్ల రెండు రకాలుగా మాట్లాడుతుంటే అభిప్రాయ సేకరణ కూడా సజావుగా సాగడం కష్టం. గతంలోనూ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ తదితర పాలకపక్షాలు భిన్న స్వరాలు వినిపించాయి. ఇప్పుడు ఆ చరిత్ర అంతకంటే దారుణంగా పునరావృతమవుతున్నది. ముందు ఫ్రధాన రాజకీయ పక్షాలు ఏకోన్ముఖ వైఖరి తీసుకోవాలని ప్రజలు ఒత్తిడి తేవలసి వుంటుంది. అందులోనూ అధికార పక్షంపై ఆ బాధ్యత ఎక్కువగా వుంటుంది. ప్రధాన ప్రతిపక్షం కూడా అదే విధమైన గందరగోళంలో చిక్కుకుపోయినందున సమస్య ఇంకా క్లిష్టం అవుతున్నది. యాభయ్యవ దశకంలో ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ నిక్కచ్చిగా వుండటం పరిష్కారానికి ఎంతగానో ఉపకరించింది. ఇప్పుడు కూడా సిపిఎం ఆ సూత్రబద్ధ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కనీస కాల వ్యవధి నిర్ణయించి సహేతుక పరిష్కారం దిశలో పయనించాలని గట్టిగా కోరుతున్నది. ఈ స్థితిలో ఏ ప్రాంతంలో వున్న ఏ శక్తులైనా అకారణ ఉద్రేకాలకు, అవాంఛనీయ ఉద్రిక్తతలకు లోనవకుండా ప్రశాంత పరిస్థితి ఏర్పడ్డానికి సహకరించాలని భావిస్తున్నది.

    ఈ కమిటీ విచారణాంశాలు ఖరారు కాకముందే తమ కాంగ్రెస్‌ వారిని జెఎసి ల నుంచి నెమ్మదిగా తగ్గించడం, హుకుంలు జారీ చేయడం, ముఖ్యమంత్రిని ఢిల్లీ రప్పించి కాంగ్రెస్‌లో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల్లో చాలా సంకేతాలున్నాయి. ఈ కమిటీలో జగన్‌, కె.విపిలకు కూడా చోటు కల్పించడాన్ని బట్టి వైఎస్‌ మరణానంతర అంతర్గత మధనాన్ని పున్ణప్రారంభించినట్టు అవుతున్నది. అంటే ప్రాంతాల వారీగా విభజితులై రాజకీయ విన్యాసాలు చేసిన కాంగ్రెస్‌ నేతలు మరోసారి తమ విధేయతల వైపు నడవొచ్చు. ఆ విధంగా అంతర్గత కలహాల పర్వం మళ్లీ మొదలు కావచ్చు. అప్పుడు ప్రజల దృష్టి మీడియా ప్రాధాన్యతలు కూడా మారొచ్చు. ప్రభుత్వం ప్రతిష్టంభనలో పడిందన్న విమర్శలు, ప్రజలపై భారాల పరంపరలు, శాంతి భద్రతల వైఫల్యాలు, ఎడతెగని దుర్ఘటనల మధ్య మరోసారి రాష్ట్ర ప్రజలకు కనీస భరోసా కల్పించాలనే కొత్త పల్లవి ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి వినిపించవచ్చు. లోపాయికారిగా అనేక అవగాహనలు, ఆదేశాలు వుంటాయని చెప్పనక్కరలేదు. వీటన్నిటి పూర్తి స్వరూపం ఫిబ్రవరి 15 శాసనసభ సమావేశాలలో గాని గోచరించకపోవచ్చు. ప్రధాన పాలక వర్గ పార్టీలు ఇన్ని మల్లగుల్లాలు పడుతున్న సమయంలో పైపై ప్రచారాలకు లోబడిపోకుండా భారాలకు వ్యతిరేకంగా పోరాడ్డం, భవిష్యత్తును పదిలపర్చుకోవడం ఇవే ప్రజల ముందున్న సవాళ్లు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్