మన ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు పూర్తి అధికారాలున్నాయి. అయినా కేంద్రం చీటికీమాటికీ ఈ విషయంలో తలదూర్చుతోంది. విత్తనాలు, రుణాలు, సాగునీరు, మార్కెట్, పంటల విధానం మున్నగునవన్నీ రాష్ట్ర పరిధిలోని అంశాలే. కేవలం విత్తన పరిశోధనలకు మాత్రమే కేంద్రం పరిమితం కావాలి. కానీ, సరళీకృత విధానాలు అమలులోకి వచ్చాక రాష్ట్రాల హక్కులపై దాడి పెంచింది. 1997 నుండి మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రపంచబ్యాంకు సంస్కరణలు వ్యవసాయ రంగం పాలిట శాపంగా ఎలా పరిణమించాయో చూశాము. రైతాంగ ఆత్మహత్యల పరంపర ఈ సంస్కరణల పుణ్యమే. ఒక్క మన రాష్ట్రం అనే కాదు ప్రపంచబ్యాంకు సంస్కరణలు అమలు చేసిన చోటల్లా వ్యవసాయం కుప్పకూలింది. సోమాలియా, మెక్సికో అనుభవాలు ఇందుకు చక్కని ఉదాహరణ. తమ ఆహారోత్పత్తులకు గిరాకీ పెంచుకోవడానికి వీలుగా వర్ధమాన దేశాలలోని వ్యవసాయ రంగాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీయాలన్నది ధనిక దేశాల పన్నాగం. దీనిలో భాగంగానే ఆయా ప్రభుత్వాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిడి తెచ్చి తమ విధానాలను అమలు చేస్తున్నారు. ఆ విధానాల అమలు ఫలితంగా భారతదేశంలో మిగులు ఉత్పత్తులుగా ఉన్న పంచదార, పత్తి, గోధుమలు, వంట నూనెల ఉత్పత్తులకు కొరత ఏర్పడి నేడు దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. దిగుమతులు చేసుకున్న ఉత్పత్తుల ధరలు వినియోగదారుడు భరించలేని విధంగా ఉన్నాయి. ఇదంతా సంస్కరణలలో భాగమే. మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతున్నది. ఆహారేతర పంటల విస్తీర్ణం పెరుగుతోంది. నేడు 70 లక్షల ఎకరాలలో ఆహారేతర పంటలు వేస్తున్నారు. వీటికి మార్కెట్టు లేక రైతులు దివాలా తీస్తున్నారు.
2010 జనవరి 29న హైదరాబాద్‌లో ''నీటిరంగ సంస్కరణలు-భవిష్యత్ చర్యలకు జాతీయ స్థాయిలో సహకారం'' అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. జాతీయ స్థాయిలో సాగునీటిరంగంలో ప్రపంచబ్యాంకు సంస్కరణలను వేగవంతం చేయటమే దీని ఉద్దేశం. ఇందులో పాల్గొన్న రాష్ట్రాలన్నీ ప్రపంచబ్యాంకు నుండి అప్పు తెచ్చుకొని ప్రాజెక్టుల నిర్మాణాలు కావిస్తున్నాయి. సంస్కరణలను అమలు చేయటానికి ప్రయోగశాలగా రాష్ట్రంలోని నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టుల క్రింద పంటల విధానంలో మార్పులు, మైక్రో ఇరిగేషన్ పథకాల అమలు లాంటి చర్యలు కొనసాగిస్తారు. సాగునీటి మీటర్లు ఏర్పాటు చేస్తారు. నీటి వినియోగాన్ని బట్టి వాటర్ రెగ్యులేటరీ కమీషన్ నిర్ణయించిన నీటి తీరువాను వసూలు చేస్తారు. నీటి తీరువాను చెల్లించలేని రైతులు నీటి వినియోగానికి అనర్హులవుతారు. పైగా ఆహార పంటలకు బదులు ఎగుమతి ఆధారిత వాణిజ్య పంటలకు ప్రాధాన్యత కల్పించటం వలన రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడి తగ్గి ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది. సాగునీటి రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలి. కాని కేంద్ర ప్రభుత్వ జోక్యంతో సంస్కరణలు అమలుచేయ పూనుకోవటం రాష్ట్ర సాగునీటి విధానానికి చేటు తెస్తున్నది.
కేంద్ర జలవిధానాన్ని ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జలవిధానాన్ని ప్రకటించింది. ప్రపంచబ్యాంకు షరతుల అమలు కోసమే దీనిని తీసుకొచ్చిందనేది నిర్వివాదాంశం. నీటిని వ్యాపారంగా మార్చి ప్రైవేట్, బహుళజాతి సంస్థలకు లాభాలు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేయడానికి దీనిని తీసుకొచ్చింది.1980లో జాతీయ జలవిధానం, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. నదుల అనుసంధాన నిర్ణయానికి ముందే 1972లో డా.కె.ఎల్.రావు గంగా-కావేరి అనుసంధాన ప్రతిపాదన తెచ్చారు. దాని గురించి కేంద్రం పట్టించుకోకుండా ఒకేసారి దేశంలోని 39 నదుల అనుసంధానానికి ప్రణాళిక తయారుచేసింది. ''జాతీయ జల అభివృద్ధి ఏజెన్సీ'' సొసైటీని ఏర్పాటుచేసింది. 2016 నాటికి ఈ నదుల అనుసంధానాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో సురేష్‌ప్రభు నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని వేసింది.. నీటి కొరత అధికంగా ఉన్న రాష్ట్రం నుండి ఒకరు, విస్తారంగా నీరు లభించే రాష్ట్రం నుండి ఒకరు, ఆర్ధికవేత్త, సామాజికవేత్తలను ఇందులో నియమించింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాల దృష్ట్యా ఈ పథకాన్ని నిలిపేసింది. అంతర్ రాష్ట్ర నదీజల వివాదాలు ఇప్పటికీ తెమలకుండా తేలకుండా వున్నాయి. ఇటువంటి స్థితిలో అనుసంధానం చేపట్టడమంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది. కేంద్రం నీటి సంస్కరణల పేరుతో రాష్ట్రాల అధికారాలను నియంత్రించాలని చూస్తోంది. ఇది మరింత ప్రమాదకరం.
మార్కెట్ సంస్కరణల పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్ల బిల్లును ఆమోదించింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కో-ఆప్ట్ చేసిన కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఒక విధంగా ఇవి ప్రభుత్వ నియంత్రణ కింద కొనసాగుతున్నాయి. కేంద్రం ఆమోదించిన చట్టం ప్రకారం రాష్ట్రానికి మార్కెట్ల నిర్వహణపై అజమాయిషీ ఉండదు. కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. అప్పుడు కనీస మద్దతు ధర అమలు బాధ్యత పూర్తిగా గాలికొదిలేస్తారు. కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు తమ రైతాంగాన్ని రక్షించటానికి మద్దతు ధరలను పెంచి నేరుగా కొనుగోళ్ళు చేస్తున్నాయి. ప్రజల వినియోగం కోసం తక్కువ ధరలకు పౌరసరఫరాలశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లపై బహుళజాతి సంస్థల పెత్తనం ఏర్పడితే రాష్ట్రంలోని సన్న,చిన్నకారు రైతులు గిట్టుబాటు కాక దివాళా తీయడం ఖాయం.
అదే విధంగా రాష్ట్ర జాబితాలో ఉన్న విత్తనరంగంపై కేంద్రం ''విత్తనచట్టం'' తెస్తున్నది. రాజ్యాంగ హక్కు ప్రకారం విత్తనాల ఉత్పత్తి, పంపిణీ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం తన రైతాంగ ప్రయోజనాలకు అనుగుణంగా చట్టం చేయాలి. ఈ హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవటమో లేక రాష్ట్రాలే కేంద్రానికి ధారదత్తం చేయటమో జరిగింది. కేంద్రం బహుళజాతి సంస్థల రక్షణ కోసం నేటికీ విత్తన చట్టాన్ని పార్లమెంట్ చేత ఆమోదింపచేయలేదు. గత దశాబ్ధకాలంగా విత్తనచట్టం లేకపోవటం వలన నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేస్తూ కంపెనీలు రైతులను వేల కోట్లలో నష్టపరుస్తున్నాయి. విత్తనాల వల్లే రైతులు నష్టపోయినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించినా సంబంధిత కంపెనీల నుండి రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తగిన చట్టాలు లేకపోవటం వల్లే కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించగలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తనాల పరిశోధనలకుగాను రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి. సంస్కరణల అనంతరం రాష్ట్రాలకి కేటాయించాల్సిన నిధులపై కోత విధిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం తాను నిర్వహించాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరిస్తూ, రాష్ట్రాల హక్కులను కాజేయాలని చూస్తున్నది. ఇప్పటికే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. బహుళజాతి విత్తన కంపెనీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అవి ఆడిందే ఆట పాడిందే పాటగా చలామణి అవుతోంది.
సారంపల్లి మల్లారెడ్డి