ప్రజలతో సంబంధాలే ప్రాణ సమానం

నేను మిలిటరీ అకాడమీలో 1970లో చేరాను. అప్పటికి నా వయసు కేవలం 17 సంవత్సరాలు. అంటే దాదాపు చిన్నపిల్లవాడినన్నమాట. అప్పట్లో నాకు రాజకీయ ఉద్దేశాలు, ఆశలు ఏమీ లేవు. మొదట్లో నేను బేస్‌బాల్‌ క్రీడాకారుణ్ణి కావాలని కోరుకున్నాను. గెరిల్లా యుద్ధాలు అంతరించి పోతున్న కాలంలో పెరిగిన తరం మాది. ప్రజాతంత్రయుతంగా చూస్తే దేశం స్థిరత్వాన్ని సాధిస్తున్న కాలం అది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ నేను మిలిటరీ అకాడమీలో చేరాను. ఆండ్రెస్‌ బెల్లా ప్రణాళికలో నేను ప్రథమ శ్రేణికి చెందినవాడిని. అప్పట్లో పాత సైనిక పాఠశాల ఆధునిక సైనిక విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. అంతకు ముందు అకాడమీలోని విద్యార్థులు మిలిటరీ అంశాల్లో పట్టభద్రులయ్యేవారు. కానీ నేను చేరేసరికి మిలిటరీ అంశాలతో పాటు విశ్వవిద్యాలయం స్థాయికి చెందిన సైనిక శాస్త్రాల్లో పట్టభద్రులను తయారు చేయటం ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం స్థాయిని అందుకోవటానికి పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. మేము రాజకీయ శాస్త్రం చదివాము. సైనిక సిద్ధాంతం పట్ల నాకు ఆసక్తి మొదలైంది. మావో రచనలు నాకు బాగా ఇష్టం. దీంతో ఆయన రచనలు ఎక్కువగా చదవడం ప్రారంభించాను.

మావో రచనలు చదివి కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు ఏర్పరచుకున్నాను. అందులో ఒకటి యుద్ధంలో అనేక దశలు, అంతరాలు ఉన్నాయన్న విషయం. వీటన్నింటినీ సమగ్రంగా చూడాలని ఆయన రచనల్లోనే తెలుసుకున్నాను. అన్ని విషయాలనూ గణించాలని చైనీయులు చెబుతుంటారు. ఆ రకంగా వారికి మౌలికమైన దృక్పథం ఉండేది. వాస్తవాలకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నించేవారు. మనం గణించాల్సిన వాటిలో (పరిగణనలోకి తీసుకోవాల్సిన వాటిలో) నైతికత ఒకటని మావో అంటుండేవారు. యుద్ధ ఫలితాన్ని నిర్ణయించేది రైఫిలో, యుద్ధవిమానమో, యుద్ధ ట్యాంకో కాదని, వాటిని నియంత్రించి, ఉపయోగించే మానవుడు, అతని చైతన్యం మాత్రమేనని మావో అంటాడు. ఇక రెండో విషయం, మరింత విస్తృతమైనదిగా నేను భావించే అంశమేమంటే 'చేపకు నీళ్ల అవసరం ఏమిటో సైన్యానికి ప్రజల అవసరం కూడా అంతే.' ఈ విషయాన్ని నేను ఎల్లప్పుడూ అంగీకరిస్తాను. దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. అంటే దానర్థం నేను ఎల్లప్పుడూ పౌర సైనిక దృక్పథం కలిగి ఉండేవాడిని. ప్రజలు, సైన్యం మధ్య బలమైన సంబంధాలు ఉండాలని భావిస్తాను.

ఆ కాలంలోనే నేను బాగా అధ్యయనం చేశాను. ప్రజలు, సైన్యం మధ్య సంబంధాల గురించి అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలూ చదివాను. నేను చదివిన వాటిలో ఒకటి క్లాస్‌ హెల్లెర్‌ రాసిన 'సామాజిక మార్పుకు వాహకంగా సైన్యం' అన్న పుస్తకాన్ని బాగా గుర్తు పెట్టుకున్నాను. సైనిక వ్యూహం, యుద్ధాల చరిత్ర, క్లాజ్‌విట్జ్‌, బొలివార్‌, పేజ్‌ సైనిక రచనలు, నెపోలియన్‌, అనిబాల్‌ వంటి వారి రచనలు విపరీతంగా చదివాను. నేను అధ్యయనం చేసిన రచనల్లో మార్క్స్‌ రచనలు కూడా ఉన్నాయి. నేను కమ్యూనిస్టును కాదు. కమ్యూనిస్టు వ్యతిరేకిని కూడా కాదు. నాకున్న మంచి మిత్రులు కమ్యూనిస్టులే. మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని శత్రువుగా చూడటాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను.

రాజ్యాంగ చట్టాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఎందుకంటే సైనిక శాస్త్రంలో పట్టా పుచ్చుకోవటానికి అధ్యయనం చేయాల్సిన అంశాల్లో అదొకటి. మేము ప్రజాస్వామ్యాన్ని ఒక వ్యవస్థగా అధ్యయనం చేశాము. డెమోక్రటిక్‌ యాక్షన్‌ పార్టీ సభ్యుడు రాసిన 'వెనిజులా : ఖాయిలా పడిన ప్రజాస్వామ్యం' అన్న పుస్తకంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వం అని నిర్వచిస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు అంటే ఎవరు, మానవ హక్కులు అంటే ఏమిటి, ప్రజల హక్కులు ఏమిటి? ప్రజలకు అత్యంత సంతోషాలను పంచిపెట్టేదే ప్రజాస్వామ్యం అని బొలివార్‌ నిర్వచించాడు. బొలివార్‌ ఆలోచనా విధానాన్ని కూడా అధ్యయనం చేశాను. మరో వంక మా ముందరి తరాల్లాగా మా తరం అమెరికా పాఠశాలల్లో చదువుకోలేదు. వెనిజులా కొండల్లో మా పాఠశాల ఉండేది. పాఠ్యపుస్తకాలు మా దేశం గురించి చెప్పేవే. నన్ను ప్రభావితం చేసిన మరో అంశం సైనిక నాయకత్వ లక్షణాల అభివృద్ధి గురించిన అధ్యయనం. చాలా కాలం నేను బోధకునిగా పని చేసినందున నాయకత్వ సమీకరణాల అభివృద్ధి గురించిన అంశాలు ఇంకా నాకు గుర్తున్నాయి. సైన్యం లోపల, సైన్యం బయట రెండు పార్శ్వాల గురించి నేను ఆలోచించేవాడిని. మనమంతా మానవులమే. తేడా ఒక్కటే. ఒకరి వద్ద యూనిఫారం, తుపాకి ఉంటే మిగిలిన తరగతి ప్రజల వద్ద అవి ఉండవు. పుట్టుక రీత్యా ఇప్పటి సైనికులు రైతులే. ఇరుగుపొరుగుకు చెందిన పిల్లలే.

80వ దశకమంతా మేము సైనిక అకాడమీలోనూ, సైనిక స్థావరాల్లోనూ గడిపాము. బొలివేరియన్‌ నాయకత్వాన్ని తయారు చేస్తూ గడిపాము. సామాజిక మార్పుకు వాహకంగా సైన్యం అన్న విషయానికి తిరిగి వస్తే ఆ కాలంలో లాటిన్‌ అమెరికాలో ఉన్న సైనిక ప్రభుత్వాలు నా ఆలోచనను ప్రభావితం చేసి ఉండొచ్చు. పనామా, పెరూ పరిణామాల గురించి చెప్పుకోవచ్చు. పనామాలో అకాడమీ లేనందున అప్పట్లో పనామా అధ్యక్షునిగా ఉన్న ఒమర్‌ టొర్రిజోస్‌ కొడుకు మా అకాడమీకి వచ్చారు. అతను బేస్‌బాల్‌ ఆడేవాడు. అందువల్ల స్నేహితులమయ్యాము. అప్పుడప్పుడూ తన తండ్రి రాసిన కొన్ని పుస్తకాలు తెమ్మని అడిగేవాడిని. టొర్రిజోస్‌ కోస్టారికాలో ఉన్నపుడు జరిగిన తిరుగుబాటు గురించి, చిరిక్వి కొండలు చుట్టుకుని ఆయన ఎలా తిరిగి దేశంలోకి వచ్చాడన్న విషయాల గురించి తెలియజేసేవాడు. దీంతో నేను టొర్రిజోస్‌ అభిమానినయ్యాను.

నన్ను ప్రభావితం చేసిన మరో అంశం అలెండీని కూలదోసిన సంఘటన. అలెండీని కూలదోసినప్పుడు నేను అకాడమీలో మూడో సంవత్సరం చదువుతున్నాను. నూతన కేడెట్‌ కోర్సులోకి విద్యార్థులు ప్రవేశించారు. నేను శిక్షణ ఇస్తున్న ఈ నూతన ప్లాటూన్‌లో ఒక సైనికుడికి కేవలం 17 సంవత్సరాలే. అతని పేరు జోస్‌ విసెంటె రంగేల్‌ అవలోస్‌. ప్రస్తుతం అతను సక్రే నగర మేయర్‌. ఉపాధ్యక్షులు జోస్‌ విసెంటే రంగేల్‌ కొడుకు. అప్పట్లో ఇతను ఎంఎఎస్‌, ఎంఐఆర్‌, పిసివి పార్టీలతో కూడిన వామపక్ష కూటమి తరపున అధ్యక్ష పదవికి బరిలో ఉన్నారు. ఇటువంటి వారు మరికొందరు అప్పట్లో అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇతను సైన్యంలో సభ్యుడు కాకూడదని కొందరు అకాడమీ అధికారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతని తండ్రి కమ్యూనిస్టు అయినందునన్నమాట. అప్పటికి వెనిజులాలో ఇంకా గెరిల్లా దళాలు పని చేస్తూనే ఉన్నాయని గుర్తుంచుకోవటం అవసరం. ఈ కొత్త కుర్రాడిని జాగ్రత్తగా పరిశీలిస్తుండమని నాకు చెప్పారు. 'జాగ్రత్త. ఇతను కమ్యూనిస్టు' అని చెప్పారు. అతని గురించి చెడుగా నివేదికలు పంపమని కూడా తర్వాత నన్ను ఒత్తిడి చేశారు. తద్వారా అతణ్ణి అకాడమీ నుంచి బయటకు పంపటానికి రంగం సిద్ధం చేయాలని ప్రయత్నం చేశారు. నిజానికి అతను మంచి వ్యక్తి. మంచి విద్యార్థి కూడా. మంచి స్ఫూర్తి ఉంది. గురిచూసి కొట్టడంలో అతను దిట్ట. గురి చూసి కాల్చటంలో ఒకసారి అతను బహుమతి కూడా గెల్చుకున్నాడు. అప్పుడు ఒక అధికారి నాతో మాట్లాడుతూ 'అతను గెరిల్లా అని తెలుసుకున్నావా. అతను ఇంకా శిక్షణ తీసుకుంటున్నాడు' అన్నాడు. అటువంటి సమయంలోనే అలెండీ ప్రభుత్వాన్ని కూల్చేసిన సంఘటన వెలుగు చూసింది. అప్పటికే నేను వామపక్ష ఉద్యమాల పట్ల సానుభూతి పెంచుకున్నాను. ఈ కుట్ర నన్ను ఇంకా ప్రభావితం చేసింది.

నేను కేడెట్‌గా ఉన్నప్పుడే 1974లో పెరూ దేశాన్ని సందర్శించాను. అయాఖుచో యుద్ధం 160వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడకు వెళ్లాలని నాకు ఆదేశం. అప్పటికి నాకు 21 సంవత్సరాలు. అకాడమీలో చివరి సంవత్సరం అధ్యయనం జరుగుతోంది. అప్పటికే నాలో స్పష్టమైన రాజకీయ ఆకాంక్షలు నిర్దిష్ట రూపం తీసుకున్నాయి. సైనికునిగా పెరూ విప్లవాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం నాకు నిజంగా ఒక ఉద్వేగభరితమైన అనుభవం. జువాన్‌ వెలాస్కో అల్వారడోను నేను ప్రత్యక్షంగా ఎరుగుదును. ఒకరోజు అధికార ప్రాసాదంలో నన్ను, వెనిజులా సైన్యంలోని మిగిలిన ప్రతినిధులను ఆయన స్వాగతించారు. ఒక చిన్న పుస్తకాన్ని మాకు బహుమతిగా ఇచ్చారు. అది మా రాజ్యాంగ ప్రతి అంతుంటుంది. 1992లో తిరుగుబాటులో పాల్గొనే వరకూ దాన్ని నేను భద్రపర్చాను. తిరుగుబాటు సందర్భంగా ప్రభుత్వం ఈ పుస్తకంతో సహా నావద్ద నుంచి సకలమూ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వాటిలో విప్లవ కార్యక్రమం, నా పుస్తకాలన్నీ ఉన్నాయి.

ఈ సంఘటనలన్నీ నన్ను ఏదో విధంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. టొర్రిజోస్‌ సంగతులు తెలుసుకున్న నేను టొర్రిజోసిస్టునైతే, వెలాస్కో గురించి తెలుసుకున్న తర్వాత ఆయన్ను ఆరాధనతో చూడటం మొదలు పెట్టాను. పినోచెట్‌ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పట్ల వ్యతిరేకత నాలో గూడుకట్టుకుంది.

సైనిక అకాడమీ నుంచి 1975లో నేను పట్టభద్రుడినైనాక అప్పటికే నాకున్న రాజకీయ ఆలోచనలతో అకాడమీ నుంచి బయటపడ్డాను. నాకు గుర్తున్నంత వరకూ 1975లో ముత్తాతలకు చెందిన మార్క్వెసినాలోని బరినాస్‌కు పంపారు. అక్కడ నన్ను మానువల్‌ కెడెనో బెటాలియన్‌ సమాచార శాఖ అధికారిగా నియమించారు. 1960 దశకంలో గెరిల్లా వ్యతిరేక చర్యలకు పాల్పడిన బెటాలియన్లలో ఇదొకటి. అక్కడ పని చేస్తున్నప్పుడు చదువుకోవటానికి బోలెడు సమయం దొరికేది. 1975 తర్వాత ఆ ప్రాంతంలో గెరిల్లాలు లేరు కదా. 21 సంవత్సరాల వయసులో అక్కడ గెరిల్లాలకు చెందిన పాడుబడిన కారులో మార్క్సిస్టు సాహిత్యం దొరికింది. అందులో ఆసక్తిగా కనిపించిన పుస్తకం ఫెడెరికో బ్రిటో ఫిగుయెరోవా రాసిన ఎజెక్విల్‌ జమోరా నాటి సంగతులు అన్న పుస్తకం. ఈ కాలం నాటి సంగతులు అధ్యయనం చేయటం ద్వారా గెరిల్లాలు ఆకలిదప్పికలతో పని చేశారని, దుర్గమ పరిస్థితుల్లో పడి ఉన్నారని, సైన్యాధిపతులు ప్రభుత్వంతో ఉండగా సైన్యం ప్రజలతో ఉన్నారన్న అభిప్రాయం కలిగింది. అప్పుడు ప్రజలు గెరిల్లాలుగా మారటానికి దారితీసిన పరిస్థితులను పరిశోధించటం కోసం విప్లవానికి మూలకారణం తెలుసుకునే క్రమంలో మావో, చే గువేరా రచనలు చదవటం ప్రారంభించాను.

నాకు 15 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా స్వంత ఊరు బరినాస్‌లో రూయిజ్‌ గువేరా వంటి పాత కమ్యూనిస్టు చరిత్రకారులు నాకు మంచి స్నేహితులయ్యారు. ఆయన సంతానం కూడా నాకు తెలుసు. ఈ మధ్యనే మొదలైన కాసువా ఆర్‌ అనే రాజకీయ సంస్థకు చెందిన వారు ఆయన సంతానం. వీరి ద్వారా నేను వ్లదిమీర్‌, ఫెడెరికో రూయిజ్‌ టిరాడోలను కలుసుకున్నాను. వ్లదిమీర్‌ ప్రస్తుతం పిపిటి సభ్యుడు. మారియా క్రిస్టినా ఇగ్లెసియాస్‌తో కలిసి పని చేస్తున్నారు. ఆయన యువకునిగా ఉన్నప్పుడు కాసువా ఆర్‌తో కలిసి పని చేశారు. నాకు కొంత మేర రాజకీయ గురువుగా కూడా వ్యవహరించారు. నాకంటే నాలుగేళ్లు పెద్ద అతను. చాలా పరిణతి చెందిన వాడు. కష్టపడేవాడు. ఆయన్ని పొపెయి అని పిలిచేవాళ్లం. ఆ కాలంలో రాజకీయ చర్చలు, అధ్యయనం బాగా జరిగాయి.

రూయిజ్‌ సోదరులు నన్ను ఆల్‌ఫ్రెడో మనేరియా, పాబ్లో మెదినాలకు పరిచయం చేశారు. మారాకేలో నేను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే మనేరియాతో చర్చలు జరిపాను. అది 1978లో. అప్పటికి నా వయసు 25 ఏళ్లు. నా జీవితంలో అతన్ని అప్పుడు మాత్రమే ఒక్కసారి చూశాను. అయితే ఆయన చెప్పిన విషయాలు మాత్రం నాకు ఇంకా గుర్తున్నాయి. 'చావేజ్‌, బల్లకు నాలుగు కాళ్లున్నాయని మనం గుర్తించాలి' అన్నారు. ఆయన గయానాలోని కార్మికవర్గం గురించి, నిరుద్యోగుల గురించి, మేధావులు, మధ్యతరగతి వర్గంతో పాటు నాల్గోపాదంగా ఉన్న సైన్యం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు. 'నేను నిన్ను ఒకటే విషయం అడగదల్చుకున్నాను. అది ఇప్పటి గురించి కాదు. మధ్యంతర దశ గురించి. దాదాపు పదేళ్ల తర్వాతి పరిస్థితుల గురించి. మనం ఏం చేస్తున్నా మీరు దానికి అంగీకరించాలి' అన్నారు. ఆ విధంగా అప్పటి నుంచి నేటి వరకూ ఈ సిద్ధాంతాన్ని నేను గుర్తుంచుకున్నాను. రాజకీయాల్లో మన సామర్థ్యం, విప్లవావకాశాలు అన్న రెండు విషయాలు గమనంలో ఉంచుకోవాలి.

(చావెజ్‌ స్వీయ జ్ఞాపకాల నుంచి)

-హ్యూగో చావెజ్‌
  

Sorry

java.lang.NullPointerException