బొగ్గు ప్రయివేటీకరణ హానికరం

బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుపై కాగ్‌ నివేదిక సహజ వనరుల వినియోగంపై, ముఖ్యంగా సామాజిక న్యాయం, పర్యావరణ భద్రత కంటే ప్రయివేటీకరణకే పెద్దపీట వేసే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను వెలుగులోకి తెచ్చింది. దురదృష్టవశాత్తూ బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులపై జరిగిన మొత్తం చర్చ అత్యధిక ధరకు కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ సమర్ధవంతమైంది, పారదర్శకమైందనే పూర్తిగా లోపభూయిష్టమైన వాదనకు పరిమితమైంది. అలాగే, ధ్యేయం, సమానత్వం, సుస్థిరత వంటి లాభాపేక్ష లేని ఇతర విధానాల ప్రాతిపదికగా జరిగే కేటాయింపులు అవినీతితో కూడుకున్నవనే పొరపాటు అభిప్రాయం వ్యక్తమైంది. అందువల్లనే ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ వంటి వేదికల్లోని కొంత మంది కార్యకర్తలు వేలం విధానం అవినీతికి ఊతం ఇస్తుందని భావించడానికి అవకాశం ఏర్పడింది. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా సహజ వనరుల కేటాయింపులు జరగాలనే వాదనకు వారు లొంగిపోయారు. బొగ్గు ప్రయివేటీకరణపై ఏకమైన బిజెపి, కాంగ్రెస్‌లకు ఈ విధానం సరిపోతుంది.

ఉమ్మడి కారణం

కాంగ్రెస్‌, బిజెపి సృష్టించిన గందరగోళంలో బొగ్గును ప్రయివేటు రంగానికి అప్పగించాలనే వాటి ఉమ్మడి ఆలోచనను అందరూ మరచిపోయారు. ఉదాహరణకు, బిజెపి తీసుకువచ్చిన బొగ్గు గనుల (జాతీయకరణ) సవరణ బిల్లు, 2000ను పేర్కొన వచ్చు. బొగ్గు మైనింగ్‌ను ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ఏజెన్సీకి మంజూరు చెయ్యడం ఈ బిల్లు ప్రధానోద్దేశం. బొగ్గు గనుల (జాతీయకరణ) చట్టం, 1973ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి) 2012, మే 14న విడుదల చేసిన పత్రికా ప్రకటన వెల్లడించింది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లోని భారతీయ కంపెనీలు దేశంలో బొగ్గును ఎటువంటి క్యాప్టివ్‌ మైనింగ్‌ ఆంక్షలు లేకుండా వెలికితీసేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. యుపిఎ-2 ప్రభుత్వం బిజెపి 2000లో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించింది. దీన్ని అన్ని ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకించినప్పటికీ ఈ బిల్లుకు చట్ట రూపం కల్పించనున్నట్లు యుపిఎ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బిల్లుపై కార్మిక సంఘాలతో ఏకాభిప్రాయానికి రాకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టరాదని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మిక సంఘాల అభిప్రాయాలను లెక్క చెయ్యరాదని ఆర్థిక మంత్రి అధ్యక్షతన 2009, ఆగస్టులో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం నిర్ణయించింది.

వాస్తవానికి బిల్లును ప్రవేశపెట్టేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు రంగంలో ప్రయివేటు రంగానికి ప్రవేశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బొగ్గు శాఖా మంత్రి ప్రకాశ్‌ జైస్వాల్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంలో ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. బిజెపి ఇదమిద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంటే కార్మిక సంఘాలు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాయని ఆయన అన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్‌, బిజెపి కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోంది. ఇతర మౌలిక వసతుల రంగాలతోపాటు బొగ్గు రంగం పెట్టుబడిదారులకు సిరుల పంట పండిస్తుందని విదేశీ పెట్టుబడిదారులకు జైశ్వాల్‌ నచ్చజెప్పగలిగారు. బొగ్గు శాఖ 2012, ఆగస్టులో విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

జాతీయకరణపై నీళ్లు

బొగ్గు వంటి పునరుత్పత్తి సాధ్యం కాని సహజ వనరుల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించడం, ప్రయివేటీకరించే వ్యూహం ఎంత మేరకు సమర్ధనీయం? మితిమీరి బొగ్గు తవ్వకాలు జరపడం, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావడం, సారవంతమైన భూములు ధ్వంసం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బొగ్గు బ్లాకులు ఎక్కువ భాగం పర్యావరణపరంగా సునిశితమైన ఆదివాసీ, అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. లాభాల కోసం బొగ్గు నిల్వలను అన్వేషించడం, ఆ తరువాత వెలికితియ్యడం సమానత్వాన్ని, సుస్థిరతను దెబ్బతీస్తాయి. 1973లో జాతీయకరణ తరువాత ప్రయివేటు బొగ్గు మైనింగ్‌కు కొన్ని మినహాయింపులు కల్పించారు. అందుకోసం క్యాప్టివ్‌ మైనింగ్‌ మార్గాన్ని నిర్దేశించారు. ఈ విధానాన్ని అండగా తీసుకుని ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. క్యాప్టివ్‌ మైన్స్‌ను ఇనుము, ఉక్కు ఉత్పత్తి కోసం కేటాయించే ప్రక్రియ 1976లో ప్రారంభమైంది. విద్యుత్‌, సిమెంటు ఉత్పత్తికి కేటాయించే ప్రక్రియ 1993లో ప్రారంభమైంది. కోల్‌ గ్యాసిఫికేషన్‌కు, లిక్విఫికేషన్‌కు కేటాయించడం 2007లో ప్రారంభమైంది. అత్యంత గుంభనంగా ప్రయివేటీకరించడం ద్వారా సిఐఎల్‌లో ప్రభుత్వ వాటాను తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రయత్నించింది. ప్రయివేటు మైనింగ్‌ కంపెనీలు మైనింగ్‌ లీజు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించే విధంగా 2006 నుంచి క్యాప్టివ్‌ అనే పదానికి నిర్వచనాన్ని నీరుగారుస్తూనే ఉంది. 2006లో చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పి చిదంబరం క్యాప్టివ్‌ మైనింగ్‌ నిర్వచనాన్ని కూడా సవరించనున్నట్లు పేర్కొన్నారు. ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ కంపెనీలకు స్థిరంగా బొగ్గును సరఫరా చేసే కాంట్రాక్టుపై ఉత్పత్తిదారులకు బొగ్గు మైనింగ్‌ చేసేందుకు అనుమతించే విధంగా ఈ నిర్వచనాన్ని సవరిస్తామని తెలిపారు. కేటాయింపునకు సంబంధించి సాధారణ నిబంధనలను తిరిగి రూపొందించేందుకు ఇది అవకాశం కల్పించింది. కొత్త నిబంధన ఈ విధంగా ఉంది. అంతిమ వినియోగదారుని అవసరాలకు అనుగుణంగా బొగ్గు కేటాయింపు జరుగుతుంది. అంతిమ వినియోగదారు కంపెనీకి గానీ లేదా జెవి లేదా నిర్దిష్ట అంతిమ వినియోగదారు కంపెనీతో నేరుగా సంబంధాలు గల మైనింగ్‌ కంపెనీకి బొగ్గు బ్లాక్‌ను కేటాయించ వచ్చని చిదంబరం పేర్కొన్నారు.

తగిన టెక్నాలజీ, సామర్ధ్యం కొరవడడంతో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సిఐఎల్‌, దాని అనుబంధ సంస్థలు ఉత్పత్తి చేయలేకపోవడం ప్రయివేటీకరణకు అనుకూలంగా చేస్తున్న ప్రధాన వాదన. అయితే క్యాప్టివ్‌ మైనింగ్‌ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అనుభవం స్పష్టం చేస్తోంది. గత పదేళ్లలో కనీసం 90 గనులను ప్రయివేటు కంపెనీలకు కేటాయించారు. వాటిలో కేవలం పది శాతం కంపెనీలే ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిపై ఇప్పుడే మేల్కొంది. 58 కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. బొగ్గు మైనింగ్‌లో ప్రభుత్వ పెట్టుబడి ప్రాధాన్యతను అన్ని కారణాలూ చాటిచెబుతున్నాయి.

కొత్త బ్లాక్‌ల్లో సాధారణంగా తవ్వకం పనులు చేపట్టరు. ఇవి సాధారణంగా అభివృద్ధికి నోచుకోని, మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయోగాత్మక తవ్వకం ప్రయివేటు కంపెనీలకు లాభదాయకం కాదు. మౌలిక వసతుల కోసం ప్రభుత్వ పెట్టుబడి లేకపోతే కేటాయించిన బ్లాక్‌లు సట్టా వ్యాపారం చేసే సంస్థలుగా మారిపోతాయి. తిరిగి అమ్మకం కోసం లేదా ఆ తరువాత ఆకస్మిక లాభాలు తెచ్చిపెట్టే సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేందుకు మాత్రమే ఉద్దేశించినవి అవుతాయి. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు పొందిన సంస్థలు మైనింగ్‌ చేయడంలో అనుభవం లేని సంస్థలని బొగ్గు శాఖ కాగ్‌కు తెలియజేసింది. స్క్రీనింగ్‌ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇందువల్ల స్పష్టమవుతోంది. బ్లాక్‌లను అనుభవం లేని, మంచి ట్రాక్‌ రికార్డు లేని కంపెనీలకు అప్పగించిన విషయాన్ని అంగీకరించడమే అవుతుంది. బొగ్గు ఖనిజ తవ్వకాన్ని సరళీకరించే అవకాశం ఉందనే అభిప్రాయంతో కేటాయింపులు జరిగాయి. ఉత్పత్తి అయిన బొగ్గులో కొంత వాటా కావాలనే డిమాండ్‌ను అంగీకరించే అవకాశం లేనందువల్ల విదేశీ కంపెనీలు ఈ బ్లాక్‌లను తీసుకునేందుకు ముందుకు రాలేదు. చట్టాన్ని సవరించకపోతే విదేశీ కంపెనీలకు అవి ఉత్పత్తి చేసిన బొగ్గులో వాటా ఇవ్వడం సాధ్యం కాదు. ఇటీవల దాదాపు 40 గనులను సంయుక్త సంస్థలకు కేటాయించారు. చట్టపరమైన ఆమోదాలు, అనుమతులు మంజూరు కావాల్సి ఉంది. భవిష్యత్తులో మంజూరయ్యే లైసెన్స్‌, అటవీ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతులు, అటవీ హక్కుల చట్టం, పిఇఎస్‌ఎఎను పాటించడంతో పాటు భూసేకరణ, పూర్తి స్థాయిలో పునరావాసం, రీసెటిల్మెంట్‌ నిబంధనలను పాటించడం వంటివి అవసరం. ఈ ముందస్తు జాగ్రత్తల విషయంలో ప్రయివేటు కంపెనీలు ఆసక్తిగా లేకపోవడం మాత్రమే కాకుండా వీటినన్నిటినీ పూర్తిచేయగల సామర్ధ్యం గానీ, ఓర్పుగానీ లేకపోవడం వల్ల ఈ వనరులు అపరిమితంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు కూడా వాటి పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ కారణాల దృష్ట్యా ఆ కంపెనీలు కేవలం లీజ్‌ సంపాదించి మిన్నకుంటాయి. ఎటువంటి కార్యకలాపాలూ నిర్వహించవు.

ప్రయివేటీకరణ-పెరిగిన దిగుమతులు

ప్రయివేటీకరణ వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందనే అభూత కల్పనను ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుత సరళి కొనసాగితే దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. బొగ్గు దిగుమతులు ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు ప్రవేశపెట్టిన 1990-91లో 50 లక్షల టన్నులు ఉండగా ప్రణాళికా సంఘం మధ్యంతర సమీక్ష చేసిన 2011-12 నాటికి 8.3 కోట్ల టన్నులకు పెరిగాయి. బొగ్గు, లిగ్నైట్‌ పై వర్కింగ్‌ గ్రూప్‌ పన్నెండవ పంచవర్ష ప్రణాళిక (2012-17)ను రూపొందించడంపై రెండు ప్రత్నామ్నాయ విధానాలను ప్రతిపాదించింది. 2016-17 నాటికి భారత్‌ 265.5 మెట్రిక్‌ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవచ్చునని ఆ నివేదిక పేర్కొంది. దీంతో ప్రపంచంలో బొగ్గు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ అగ్రగామిగా మారుతుంది. క్యాప్టివ్‌ కోల్‌ మైన్‌ కేటాయింపుల నేపథ్యంలో ప్రణాళికా సంఘం అసాధారణ రీతిలో ప్రభుత్వ విధానాన్ని నిర్మొహమాటంగా ఖండించింది. ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని కూడా సమీక్షించాల్సి ఉందని అది సూచించింది. చిత్తశుద్ధిలేని కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాక్‌లను రద్దు చేసి విశ్వసనీయత గల కంపెనీలకు కేటాయించాలని సూచించింది. ప్రపంచంలో ప్రయివేటు రంగంలో అతి పెద్ద ప్రయివేటు కంపెనీ ఈ విషయాన్ని తన పెట్టుబడిదారులకు గొప్పగా ప్రచారం చేసుకుంది. 2016 సంవత్సరాంతానికి భారత్‌ ప్రపంచంలో అతి పెద్ద బొగ్గు దిగుమతిదారు అవుతుందని అమెరికాకు చెందిన పీబాడీ ఎనర్జీ అంచనా వేసింది. అప్పటికి వార్షిక అవసరాలు 22.5 కోట్ల టన్నులకు పెరగవచ్చునని కూడా అంచనా వేసింది. ఈ అవసరాలు మున్ముందు మరింత పెరగగలవని పేర్కొంది. ఐదేళ్లలో ప్రపంచ డిమాండ్‌లో 85 శాతానికి పైగా మొత్తం భారత్‌, చైనా దేశాల నుంచి ఉండగలదని అంచనా. పీబాడీ ఎనర్జీ వంటి ప్రపంచంలోని పెద్ద సంస్థలు భారీ ఎత్తున లాభాలు మూటగట్టుకునేందుకు పొంచి ఉన్నాయి. దేశంలో పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నప్పటికీ స్వావలంబన సాధించే విషయాన్ని భారత్‌ పట్టించుకోవడం లేదు. సిఐఎల్‌ను ఉద్దేశపూర్వకంగానే బలహీనపరుస్తోంది. నిల్వలను అనుభవంలేని, సట్టా వ్యాపారం చేసే ప్రయివేటు కంపెనీలకు కేటాయిస్తోంది.

ఇది అన్ని పునరుత్పత్తి కాని వనరులకూ వర్తిస్తుంది. అధిక ధరలతో వేలం గురించి గగ్గోలు పెడుతున్నవారు నేడు బొగ్గు విషయంలో ఇలా జరిగింది, అనాలోచితంగా సహజ వనరులను దోచుకునే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రేపు నదులు, అడవులు, ఇతర వనరులను ప్రయివేటీకరించవచ్చునని తెలుసుకోవాలి. ఇప్పటికే మందాకిని, నర్మద, గంగ వంటి నదుల జలాలు విద్యుత్‌ ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా వాటిపై ఉన్న హక్కులను కోల్పోయాం. దశాబ్దం క్రితం మహానదిలో ఒక భాగాన్ని ఒక ప్రయివేటు కంపెనీకి విక్రయించారు. ఇందువల్ల నదుల చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవనం అసాధ్యమవుతుంది. మందాకినీ తీర ప్రాంతాల అందాలను ఆస్వాదించేందుకు వెళ్లే పర్యాటకులు ఆ నదీజలాల్లో 70 శాతం పర్వతాల్లోని సొరంగాల గుండా ప్రయివేటు విద్యుత్‌ ప్రాజెక్టులకు వెళ్తుండటాన్ని చూసి ఆందోళనకు గురవుతారు. ఇలాంటి స్థితిలో సందర్శకులు నిరాశతో ఇళ్ళకు తిరిగివెళతారనడంలో సందేహం లేదు.

అందువల్ల ప్రయివేటీకరణ వినాశకరమైన వ్యూహం. సిఐఎల్‌, ప్రభుత్వ రంగంలోని ఇతర కంపెనీలను పటిష్టం చెయ్యడమే ఏకైక పరిష్కారం. ఇవి బొగ్గును అనుమతిపొందిన అంతిమ వినియోగదారులకు విక్రయిస్తాయి. ఇటీవల పార్లమెంటును స్తంభింపచేసే కార్యక్రమం కాంగ్రెస్‌, బిజెపి లాలూచీ పడి సృష్టించిన నాటకమే. బొగ్గు రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రయివేటీకరించేందుకు అవి రెండూ లాలూచీ పడ్డాయి. కార్మిక సంఘాలు మాత్రమే నిలకడగా దీనిని వ్యతిరేకించాయి. బొగ్గు వనరులు, ఇతర శిలాజ ఇంధనాలను ప్రయివేటీకరించే శాసనాలను అడ్డుకోవడంలో అవి ఇప్పటి వరకూ విజయం సాధించాయి. ఆ కార్మిక సంఘాల ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో బొగ్గు వనరుల దోపిడీకి వ్యతిరేకంగా మనం గళం విప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో విధి నిర్వహణలో విఫలమైనందుకు భవిష్యత్‌ తరాలు మన గురించి చెడుగా భావించే ప్రమాదముంది. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం మనల్ని మాత్రమే కాకుండా భవిష్యత్‌ తరాలను కూడా మోసం చేస్తోంది. కార్మిక సంఘాలకు మద్దతు తెలపాల్సిన తరుణం ఆసన్నమైంది.

-స్మితా గుప్తా
  
ము Publiture