చీకటి చీకటి చీకటి

  • చురక సంహిత

విసుగు చెందని విక్రమార్కుడు ... డాష్‌ ... డాష్‌ ... డాష్‌ ... బేతాళుడు ఇలా అన్నాడు. 'రాజా ఇంట్రడక్షన్‌ లేకుండా సరాసరి విషయంలోకి వెళ్లిపోదాం. కరెంటు పోయి డిటిపి జరగకపోతే మన కథకే ఎసరు పెట్టవచ్చు. సరే నీకు శ్రమ తెలియకుండా కథ చెప్పాలి కదా! అసలు ఈ కరెంటు అనేది లేని రోజుల నుంచీ నీవు నన్ను మోస్తూనే ఉన్నావు, నేను ఎగిరిపోతూనే ఉన్నాను. దయ్యాల కథలు రాత్రిపూటే ఉండాలని నీకు, ఆ రాంగోపాల్‌ వర్మకు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ మనమెప్పుడూ రాత్రే కలుసుకుంటూ ఉన్నాము. మనమెలాగూ కరెంటు మీద ఆధారపడేవాళ్లం కాదు. కానీ ఇకపై అలా జరగదు. రాజా నీవు గమనిస్తున్నావో, లేదో కానీ దూరంగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి ఎప్పుడూ ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే అవి కరెంటువి. ఒక విధంగా చూస్తే మనమే నయం చీకటికి అలవాటు పడ్డాం.'

'రాజా నీవు ఎటూ చివరిలోనే మాట్లాడతావు కాబట్టి ఇప్పుడు నేనే వాగుతూ ఉంటాను. నేను ఎన్నో కథలు చెప్పాను. నీవు అన్నింటికీ సమాధానం చెబుతున్నావు. ఎప్పుడూ ప్రజల గురించిన ధ్యాసే కానీ స్వలాభం గురించిన ఆలోచన నీకు లేనే లేదు.'

'...వర్షాకాలం వస్తుంది. నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తాయి. ప్రభుత్వాలు వాటిని సంరక్షించుకుంటే అటు ఆహార సమస్యా, కరెంటు కష్టాలు కొంతవరకైనా తీరుతాయి. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. నీటి కోసం పోట్లాడుతూ ఎవరూ వాడుకోక సముద్రంపాలు చేస్తున్నారు. రెండు పిల్లులు, కోతి కథలోలాగా ప్రవర్తిస్తున్నారు. మళ్లీ సముద్రపు నీటి నుంచి మంచినీళ్లను తయారు చేస్తామంటారు. ఉదయాన్నే దీపాలు వృధాగా వెలిగిస్తూ చీకట్లను వారే ఆహ్వానిస్తున్నారు. గ్రిడ్డులు ఫెయిల్‌ అయితే రాష్ట్రాల మీదికి వేస్తున్నారు. అడవులన్నీ నరికేసుకుంటున్నారు. వాతావరణంలో వేడి పెరిగిందని వారే అంటారు, చర్యలు తీసుకోరు.'

'రాజా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకపక్క నీవు కరెక్టు సమాధానం చెబుతావని, ఇంకోపక్క ఈ కరెంటు గురించిన బెంగ నాకు ఎక్కువైంది. నా ప్రశ్న విను. మనుషులు చేతిలో ఉన్నదాన్ని పారబోసుకుని మళ్లీ ఏరుకోవటం ఎందుకు చేస్తున్నారు? వారికి ముందు చూపు ఉండదా? పంటలకూ, కరెంటు ఉత్పత్తికి నీటిని వాడుకోకుండా కష్టాలు పడుతున్నారు. ప్రతి సంవత్సరమూ కరెంటు కోతలు పెడతారు. కానీ అవి లేకుండా చేయటానికి పూనుకోరు. ఇలా ఎందుకు జరుగుతోంది. నీకు తెలిసి సమాధానం చెప్పకపోతే ఓల్టేజీని బట్టి నీ తల ఎన్ని ముక్కలైనా కావచ్చు.'

'బేతాళా, నీవు మంచి ప్రశ్నలే వేశావు. నాకు కరెంటుతో పనిలేదు. ఎందుకంటే నేను సమాధానం చెప్పగలనన్న నమ్మకం నాకుంది. నా తల ముక్కలయ్యే ప్రశ్నే లేదు. ఇక మానవుల ప్రవర్తన గురించి సమాధానం పెద్దగా ఉంటుంది. 'అశోకుడు చెట్లు నాటించెను' అని సినిమా పాటలో వాడుకుంటారు కానీ దాన్ని నిజం చెయ్యరు. ప్రయివేటు వారిని కాపాడటం కోసం చెట్లను కొట్టివేస్తారు. ఏదో కొద్ది మంది నాయకులకు తప్ప ముందు చూపు ఎవ్వరికీ లేదు. దానిక్కారణం వారి వారి కుర్చీల్ని కాపాడుకోవటానికి కేటాయించే సమయాన్ని నీవు చెప్పిన అతి ముఖ్యమైన విషయాలకు కేటాయించకపోవటమే. ప్రతిదాన్నీ ఓట్లతో తూస్తారు. ఎండాకాలంలో త్రాగునీరు లేక ప్రజలు బాధపడటం, కరెంటు లేక రైతులు, ఆసుపత్రుల్లో రోగులు, ఇలా ఎవరి కష్టాలు వారు పడుతూనే ఉన్నారు. సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడం తప్ప, వాటిపై తమ దృష్టి పెట్టరు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా ప్రజలకు అవే ఇక్కట్లు తప్పటం లేదు. ప్రభుత్వాన్ని బలపరుస్తున్న పార్టీలకు మంత్రి పదవులు, ఇతర సౌకర్యాలు ఇవ్వటానికి సమయం, ప్రజాధనం చాలటం లేదు.

ఇక కాలుష్యాన్ని ఎగజిమ్మే దేశాలే ఇతరులు కాలుష్యరహితంగా ఉండాలంటారు. ఎనభై శాతం కాలుష్యం ఇరవై శాతం భూభాగం నుంచి వస్తున్నది. వీరే ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. పైపు లైను ద్వారా ఇంధనం పంపుతామన్న ఇరాన్‌ను కాదని అమెరికా తోక పట్టుకొని వెళ్తున్నారు నాయకులు.'

రాజుకు ఈవిధంగా మౌన భంగం కాగానే బేతాళుడు ఇన్వర్టర్‌ సహాయంతో చెట్టెక్కాడు ...

-- జంధ్యాల రఘుబాబు