స్వతంత్ర భారతదేశ పార్లమెంటు 60వ జన్మ దినోత్సవం సందర్భంగా గౌరవ సభ్యులు, మిగిలిన దేశం చేసుకుంటున్న సంబరాల్లో నేనూ పాలుపంచుకుంటున్నాను. దేశ పార్లమెంటు షష్టిపూర్తి జరుపుకుంటోంది. పురాతన నమ్మకం ప్రకారం షష్టిపూర్తితో కొత్త జీవితం ప్రారంభవుతుంది. అయితే మెరుగైన జీవితం ప్రారంభమవుతుందని మాత్రం పేర్కొనలేదు. భవిష్యత్తు కోసం మెరుగైన పార్లమెంటు, ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించడం నేటి లోక్‌సభ, రాజ్యసభల కర్తవ్యం. ఈ అంశాల గురించి చర్చించేముందు, బ్రిటన్ మాజీ ప్రధాని ఆంథోనీ ఎడెన్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవడం అవసరం.''మొట్టమొదటి నుండి చేసిన అన్ని ప్రయోగాల్లో పార్లమెంటరీ ప్రభుత్వం కోసం భారత్ చేసిన సాహసం అత్యంత ఉత్తేజభరితమైందిగా నేను భావిస్తున్నాను...భారత్‌లో ప్రవేశపెట్టిన వ్యవస్థ మన దేశంలో ఆచరణలో ఉన్న వ్యవస్థకు మక్కీకి మక్కీ ప్రతిరూపం కాదు. అది మనం ఎన్నడూ కలగనని విశాల రూపం''. వాస్తవానికి గత ఆరు దశాబ్దాలుగా ఈ ప్రక్రియను మనం పటిష్టపరచుకోగలిగాం. అందులోని విషయ పరిజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోగలిగాం. అత్యవసర పరిస్థితి, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంతర్గత సవాళ్లను అధిగమించగలిగాం.
మన రాజ్యాంగంలో అత్యంత కీలకమైన విషయం ప్రజలకు ఉన్న సార్వభౌమాధికారం. దీనిని చట్టసభలకు (పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు) ఎన్నికైన వారి ద్వారా అమలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ (ప్రభుత్వం) చట్టసభలకు జవాబుదారీగా ఉండాలి. చట్టసభలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
పార్లమెంటరీ కార్యకలాపాల నిర్వహణ వ్యవధి తీరుతెన్నులపై ఈ యంత్రాం గం సామర్ధ్యం ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గత రెండు దశాబ్దాలుగా పార్లమెంటు ఎన్నడూ సంవత్సరానికి 100 కంటే ఎక్కువ రోజులు సమావేశం కాలేదు. 1992లో దీనికి దగ్గరగా 98 రోజులపాటు సమావేశమైంది. 14వ లోక్‌సభ అత్యంత కనిష్టంగా మొత్తం 332 రోజులపాటు సమావేశాలు (ఏడాదికి 66 చొప్పున) జరిగాయి. ఇంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో 24 శాతం సమయం అంతరాయాలు, వాయిదాలతో వృథా అయ్యింది. మరోవైపు బ్రిటిష్ పార్లమెంటు సంవత్సరానికి కనీసం 160 రోజులపాటు సమావేశమవుతుంది.
పార్లమెంటు సమావేశాలు మరిన్ని ఎక్కువ రోజులపాటు జరగకపోతే, ప్రభుత్వంపై పటిష్టమైన నిఘా ఉండబోదు. ఫలితంగా చట్టసభలకు ఎగ్జిక్యూటివ్ జవాబుదారీతనం తగ్గిపోతుంది. నియంతృత్వ పోకడలకు అడ్డుకట్టవేసే రాజ్యాంగ వ్యవస్థ దెబ్బతింటుంది. పార్లమెంటు ఏడాదికి కనీసం 100 రోజులు సమావేశ మయ్యే విధంగా దీనిని సరిదిద్దాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.
ఇక రెండో అంశం న్యాయవ్యవస్థకు సంబంధించినది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని అన్వయించడంతోపాటు పౌరుల హక్కుల సంరక్షకురాలిగా వ్యవహరిస్తుంది.. న్యాయవ్యవస్థ ప్రభుత్వం చేసే చట్టాలను సమీక్షించడంతో పాటు న్యాయాన్ని అందించే వ్యవస్థగా వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా హైకోర్టు, అనుబంధ కోర్టుల్లో 3.2 కోట్ల కేసులు, సుప్రీం కోర్టులో 56,383 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయశాఖా మంత్రి గత సమావేశాల్లో సభకు తెలియజేశారు. 2010 డిసెంబర్ నాటికి ఈ జాప్యం కారణంగా 3,50,003 మంది బందీలు వివిధ జైళ్లల్లో మగ్గుతున్నారు. న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లే. న్యాయవ్యవస్థను అత్యవసర ప్రాతిపదికపై పటిష్టపరచాలి. న్యాయవ్యవస్థ చట్టాలను అన్వయిస్తుంది. అంతేకానీ వాటిని రూపొందించదు. ప్రభుత్వ విధానాన్ని నిర్ణయించలేదు. రాజ్యాంగం కోర్టులకు కల్పించింది చట్టాల సమీక్షే కానీ చట్టాలను రూపొందించడం, క్రియాశీలంగా వ్యవహరించడం కాదు.
జాతీయ న్యాయ కమిషన్ ఏర్పాటుచేసే విషయాన్ని తీవ్రంగా పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైంది. మూడు విభాగాలు, న్యాయవ్యవస్థ ప్రతినిధులతో దీనిని ఏర్పాటుచేయాలి. న్యాయవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలను ఇది పర్యవేక్షించాలి. న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై వచ్చే అవినీతి ఆరోపణలను పరిశీలించడం, న్యాయమూర్తుల దుష్ప్రవర్తనపై వచ్చే ఇతర ఫిర్యాదుల పరిశీలన, న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం కల్పించడం వంటి అంశాలను కమిషన్ పర్యవేక్షించాలి.
ఇక మూడవ విషయం, కొన్ని వ్యవస్థాగత మార్పులు చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత సుసంపన్నం చేయాలి. 1952లో సాధారణ ఎన్నికల తరువాత ఒక్కసారి కూడా పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు ప్రజల సానుకూల ఓట్లతో కంటే వ్యతిరేక ఓట్లతో వచ్చినవే. మెజారిటీ మార్క్‌కు దగ్గరగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కటే. ఆ ప్రభుత్వం 48.1 శాతం ఓట్లు, 415 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1998లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం 36.2 శాతం అనుకూల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇదే ఇప్పటివరకు అత్యంత తక్కువ ఓటింగ్ శాతంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. మెజారిటీ ప్రజల అభిప్రాయమే అంతిమమనే ప్రజాస్వామ్య సిద్ధాంతం దాని నిజమైన స్పూర్తితో ఆచరణలోకి రావడం లేదు. దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ గురించి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. ఈ వ్యవస్థలో ప్రజలు పార్టీలకు ఓటు వేస్తారు. అవి ముందుగా నిర్ణయించిన ప్రాధాన్యతా జాబితా ప్రాతిపదికగా నిర్ణీత సంఖ్యలో ఎంపీలను నామినేట్ చేస్తాయి. పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా ఆయా పార్టీలకు సీట్లు లభిస్తాయి. పార్లమెంటులో మెజారిటీ ఎంపీలు గల పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ ప్రభుత్వం ఓటర్ల మద్దతును ప్రతిబింబిస్తుంది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తు సమగ్రంగా చర్చించింది. అయితే బ్రిటిష్ తరహా 'ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్' వ్యవస్థను ప్రవేశపెట్టింది. 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ దామాషా ప్రాతినిధ్య వ్యవస్థను సిఫార్సు చేసింది. భారతదేశ విభిన్నత్వానికి ఇదే అత్యుత్తమ పరిష్కారమని సూచించింది.
భారతదేశ పరిస్థితుల నేపథ్యంలో, దామాషా ప్రాతినిధ్య వ్యవస్థతోపాటు, ప్రస్తుత వ్యవస్థతో కూడిన మిశ్రమ వ్యవస్థ ఆదర్శవంతమైంది కావచ్చు. ఉదాహరణకు, ఇరుగుపొరుగున ఉన్న రెండు నియోజకవర్గాలను విలీనం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. ఇటువంటి వ్యవస్థలో ప్రజలు రెండు ఓట్లు వేస్తారు. ఒకటి, వ్యక్తిగత అభ్యర్ధులకు, మరొకటి పార్టీలకు వేస్తారు.
ఈ వ్యవస్థ వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. పార్టీలు తమ అభ్యర్ధులను ముందుగా సమర్పించిన జాబితా నుండి పార్లమెంటుకు పంపేందుకు పొందాల్సిన కనీస ఓటింగ్ శాతాన్ని నిర్ణయించడం ఇందులో సానుకూల అంశం. ప్రజలు నేరుగా ఎన్నుకునే అభ్యర్థులు ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం వహించవచ్చు. సంకీర్ణాల యుగంలో అసమంజసమైన ఒత్తిడులు, డిమాండ్లను ఎదుర్కొనేందుకు ఇది మెరుగైన విధానం.
చివరగా, గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల కాలంలో రెండు రకాల భారతదేశాలు ఆవిర్భవించాయి. ఒకటి సంపన్నులకు వెలిగిపోతున్న భారతదేశం కాగా, పేదలకు కడగండ్లు మిగిల్చిన భారతదేశం రెండవది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ తుది పరిశీలన, ఆమోదం కోసం సమర్పిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవడం సముచితంగా ఉంటుంది.
''1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన వ్యవస్థలోకి అడుగుపెడుతున్నాం.. రాజకీయాల్లో సమానత్వం కలిగి ఉంటాం. సామాజిక, ఆర్థిక జీవనంలో మాత్రం మనం అసమానత్వం కొనసాగుతుంది. రాజకీయాల్లో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ సిద్ధాంతాలను గుర్తిస్తాం. మన సామాజిక, ఆర్థిక జీవనంలో సామాజిక, రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా ఒక వ్యక్తి- ఒక విలువ సిద్ధాంతాన్ని మనం వ్యతిరేకిస్తుంటాం.
ఈ పరస్పర వైరుధ్యాలతో కూడిన జీవితాన్ని ఎంత కాలం గడుపుతాం? మన సామాజిక, రాజకీయ జీవనంలో ఎంతకాలం సమానత్వాన్ని నిరాకరిస్తుంటాం?
ఎక్కువ కాలం దీనిని వ్యతిరేకిస్తూ పోతే, మన రాజకీయ ప్రజాస్వామ్యమే కష్టాల్లో పడుతుంది. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరలో నిర్మూలించాలి. లేనిపక్షంలో అసమానత్వంతో బాధపడేవారు రాజ్యాంగ పరిషత్ అత్యంత ప్రయాసపడి రూపొం దించిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తారు'' (1949 నవంబర్ 25).
మన ప్రజలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సాధికారితను కల్పిస్తూ మన పార్లమెంటు చట్టాలు చెయ్యాలి. ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ సిద్ధాంతాన్ని ఒక వ్యక్తి, ఒక విలువ సిద్ధాంతంగా పరివర్తన చెయ్యాలి. పై హెచ్చరికను గమనంలోకి తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
పార్లమెంటులో సభ్యులుగా మెరుగైన భవిష్యత్తును రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం మన బాధ్యత.
(పార్లమెంటు షష్టిపూర్తి సందర్భంగా రాజ్యసభ ప్రత్యేక సమావేశంలో చేసిన ప్రసంగం)