'భాంబ్రజా, ఆంటర్గాన్ గ్రామాల్లో గత మూడు, నాలుగు సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోలేదు'- జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాల గురించి దేశవ్యాపితంగా తీవ్ర ఆందోళన రేకెత్తుతున్న తరుణంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో వచ్చిన వార్త ఇది. టెక్నాలజీ సాధించిన విజయంతో ప్రజలు సుఖ సౌభాగ్యాలతో తులతూగుతున్నారని ఆ వార్త స్పష్టం చేసింది. సంప్రదాయసిద్ధమైన పత్తి నుండి బోల్‌గార్డ్ లేదా బిటి కాటన్ వైపు మళ్లడం గ్రామాల్లో సామజిక, ఆర్థిక సంస్కరణకు దారి తీసిందని ఆ వార్త పేర్కొంది. మళ్లీ అదే వార్త తొమ్మిది మాసాల క్రితం అదే పత్రికలో వచ్చింది.
అయితే ఆ గ్రామాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఒక్క భాంబ్రజాలోనే 14 మంది ఆత్మహత్య చేసుకున్నారని రైతులు వ్యవసాయంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ ఏడాది మార్చిలో తెలియజేశారు. ఇందులో తొమ్మిది మంది 2003-2009 మధ్య మరణించిన విషయం ధ్రువీకరణ అయ్యింది. ఆ తరువాత కార్యకర్తల బృందం మరో ఐదుగురి ఆత్మహత్యలను ధ్రువీకరించింది. తమ గ్రామంలోని భూముల్లో అధిక విస్తీర్ణం బీడు భూమిగా మారిపోయిందని, వ్యవసాయంపై రైతులు నమ్మకం కోల్పోయారని కొంతమంది రైతులు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలియజేశారు. ఇప్పటికే వంద మందికి పైగా గ్రామాన్ని వీడి వెళ్లారని, వ్యవసాయం అంతరిస్తుండటంతో మరి కొంత మంది వెళ్లనున్నారని సురేష్ రామ్‌దాస్ భోండ్రే అనే రైతు పేర్కొన్నాడు.
బయోటెక్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం 2011 ఆగస్ట్‌లో విఫలమైంది. ఆ తరువాత బిటి కాటన్ ద్వారా బంగారం పండించండి అనే నినాదంతో ఫుల్‌పేజ్ వాణిజ్య ప్రకటన ఆగస్ట్ 28న వచ్చింది. ఆ తరువాత మహీకో-మోన్‌శాంటో బయోటెక్ (ఇండియా) లిమిటెడ్ పేరుతో వరుసగా ఫుల్‌పేజ్ ప్రకటనలు ఆగస్ట్ 29, 30,31, సెప్టెంబర్ 1, 3 తేదీల్లో అనేక పత్రికల్లో వచ్చాయి. ఇతర అంశాలతో పార్లమెంటులో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో ఆ తరువాత శీతాకాల, వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టలేదు. కొంతమంది మాత్రం బిటి కాటన్‌తో కాకపోయినా న్యూస్‌ప్రింట్‌తో బంగారం పంట పండించుకున్నారు.
వాసుదేవ్ ఆచార్య నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ వాణిజ్య ప్రకటనలపట్ల అసంతృప్తి చెందింది. విదర్భలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించాలని వివిధ పార్టీలతో కూడిన స్థాయీ సంఘం నిర్ణయించింది. మహీకో-మోన్‌శాంటో బిటి 'మిరాకిల్ (అద్భుతం)'గా అభివర్ణింపబడ్డ గ్రామాన్ని స్థాయీ సంఘం సందర్శించింది. ఈ బృందం మారెగాన్-సోనేబుర్ది గ్రామాన్ని కూడా సందర్శించింది. రెండు గ్రామాల్లో పార్లమెంటు సభ్యుల బృందానికి బంగారపు భవిష్యత్ ఏమీ కనిపించలేదు. 'మిరాకిల్' విఫలమైంది.
బిటి పత్తి భారతదేశంలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తికావడంతో ఈ కాలంలో అది సృష్టించిన సమస్యలపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. 'బిటి పత్తితో బంగారం పండించవచ్చు'అనే పేరుతో తొలి వాణిజ్య ప్రకటన గత ఏడాది ఆగస్ట్ 28న ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైంది. ఆ వాణిజ్య ప్రకటనలో పేర్కొన్న వారందరూ ప్రొఫెషనల్ రిపోర్లర్లు, ఫొటోగ్రాఫర్లే. ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంగా మలచిన వాణిజ్య ప్రకటన ఆ దినపత్రికలో 2011 ఆగస్ట్ 28న ప్రచురితమైంది. మోన్‌శాంటో కంపెనీ ఆ ఫీచర్‌ను పూర్తిస్థాయీ పెయిడ్ న్యూస్‌గా పేర్కొంది. మీడియా ఆ గ్రామాలను సందర్శించి ఈ రిపోర్టును ప్రచురించింది. తాము వ్యవసాయ క్షేత్రానికి రవాణా సదుపాయాలు మత్రమే ఏర్పాటుచేశామని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2011లో ప్రచురించిన అంశం 2008లో ప్రచురించిన అంశాన్ని ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా ప్రచురించారు. ఒకే విధమైన ఫుల్‌పేజ్ ప్రకటన మూడేళ్లలో రెండు సార్లు ప్రచురితమైంది. ఒకసారి వార్తగా, రెండోసారి వాణిజ్య ప్రకటనగా వచ్చింది. ఉన్నత పారదర్శకత్వ ప్రమాణాలు పాటించినట్లు కంపెనీ పేర్కొంది.
అద్భుతం ఓ మిథ్య!
బిటి మిరాకిల్ ప్రవేశపెట్టిన తరువాత తన ఆదాయం బాగా పెరిగిందని ఎల్‌ఐసి ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తున్న నందూ రావత్ అనే రైతు పేర్కొన్నాడు. గత ఏడాది తన ఆదాయం రెండు లక్షల రూపాయలుగా పేర్కొన్నాడు. ఇందులో రు.1.6 లక్షలు ఎల్‌ఐసి పాలసీల ద్వారా లభించిందని, మిగిలిన మొత్తం వ్యవసాయం ద్వారా తనకు వచ్చిందని చెప్పాడు. ఎల్‌ఐసి పాలసీల విక్రయం ద్వారా అతడికి వ్యవసాయంపై వచ్చిన ఆదాయం కంటే నాలుగు రెట్లు అధికంగా వచ్చింది. నలుగురు సభ్యుల కుటుంబీకుడైన రావత్‌కు ఏడున్నర ఎకరాల పొలం ఉంది.
క్రిమికీటక మందులు వాడాల్సిన అవసరం లేకపోవడంతో ఎకరాకి ఇరవై రూపాయలు ఆదా అవుతున్నాయని ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. అతడు నాలుగు ఎకరాల్లో పత్తి పండించాడు. క్రిమికీటక మందులు వాడాల్సిన అవసరం లేకపోవడంతో ఎనభై లక్షల రూపాయల ఖర్చు తప్పిపోయింది. ఇదే విషయాన్ని భాంబ్రజా గ్రామంలోని రైతులతో ప్రస్తావిస్తే వారు నాపై ఒక్కసారిగా దూసుకువచ్చి కోపంతో మాట్లాడారు. తమ గ్రామంలో ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఆదాయం సంపాదించే ఒక్క రైతును చూపండి అని ప్రశ్నించారు.
విదర్భ ప్రాంతంలో హెక్టార్‌కు ఏడాదికి సగటున 1.2 క్వింటాళ్ల పత్రి పండుతుందని వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పార్లమెంటులో 2011 డిసెంబర్ 19న ప్రకటించారు. ఇది ఎంతో దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇంతకంటే రెట్టింపు ఉత్పత్తి అయినా అది తక్కువ పంటగానే పరిగణించాలి. రైతు ఈ పత్తిని ముడి పత్తిగానే అమ్ముతాడు. వంద కిలోల ముడి పత్తి నుండి 35 కిలోల లింట్, 65 కిలోల పత్తి విత్తనం లభిస్తుంది. పవార్ ప్రకటన ప్రకారం హెక్టారుకు 3.5 క్వింటాల్స్ ముడి పత్తి ఉత్పత్తి అవుతుంది. అంటే ఎకరాకు 1.4 క్వింటాల్స్ ఉత్పత్తి అవుతుంది. రైతుకు క్వింటాలుకు రు. 4,200 ధర లభిస్తోందని ఆయన చెప్పారు. ఇది సాగుకు అయ్యే వ్యయంతో పోలిస్తే దాదాపు సమానంగా ఉంటుంది. అంటే నందు ఆదాయం ఎకరాకు రు. 5,900 కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఇందులో అతడి ఉత్పత్తి వ్యయాన్ని మినహాయించాలి. ఇందులో విత్తనానికే 1.5 ప్యాకెట్లు కావాలి. వీటి ఖర్చు సుమారు రు. 1,400 ఉంటుంది. అంటే, రావత్‌కు మిగిలేదేమీ లేదు. మరి ఎకరాకు రు. 20,000 ఆదాయం ఎలా లభించింది?
ఈ మొత్తానికి తాము కట్టుబడి ఉంటామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు. పత్తి రైతుకు ఆదాయం పెరుగుతుందని తాము చెప్పామని, రు.20,000 ఆదాయం వస్తుందని తామెక్కడా చెప్పలేదని పేర్కొన్నాడు. పత్తి ఉత్పత్తిదారులకు అదనపు ఆదాయం అని మాత్రమే పేర్కొన్నామని బుకాయించాడు. ఫుల్‌పేజ్ వార్తా కథనంలో కూడా ఇరవై వేల రూపాయల ఆదాయం అని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే ఎకరాకు ఇంతమొత్తం పండుతుందని కూడా ప్రకటించలేదు. కంపెనీ తెలివిగా ఈ విషయాలను వార్తా కథనంలో ప్రచురించకుండా వాణిజ్య ప్రకటనలకు పరిమితం చేసింది. జర్నలిస్టులు రైతులతో విడిగా మాట్లాడి వారి అనుభవాలు సేకరించారని, ఈ సమాచారాన్ని తమ వార్తల్లో ప్రచురించాయని తెలిపారు.
విదర్భ వర్షాధార ప్రాంతంగా ఉంది. మరి అటువంటి ప్రాంతంలో బిటి పత్తిని పెంచడాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్‌సిపి- కాంగ్రెస్ కూటమి ఎందుకు ప్రోత్సహిస్తోందనే విషయంపై పవార్ మౌనం పాటించారు. ఈ ప్రాంతానికి పనికిరావని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఏడేళ్ల క్రితం ప్రకటించిన విత్తనాలనే రాష్ట్ర విత్తన కార్పొరేషన్ నేడు పంపిణీ చేస్తోంది. ఆంగ్ల దినపత్రిక ప్రకారం నందూ రావత్ సంపదతో తులతూగుతున్నాడు. మంత్రి ప్రకారం రావత్ జీవితం అంత ఆశాజనకంగా ఏమీ లేదు.
దినపత్రికల్లో వచ్చిన వాణిజ్య ప్రకటనలపై భారత వాణిజ్య ప్రకటనల ప్రమాణాల మండలికి ఫిర్యాదు అందింది.ఇదే వాణిజ్య ప్రకటన ఢిల్లీకి చెందిన మరో ఆంగ్ల పత్రికలో కూడా ప్రచురితమైంది. భారత రైతులకు బిటి పత్తివల్ల పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుందనే ప్రకటనపై ఈ ఫిర్యాదు చేశారు. మండలి చేసిన సూచనలకు కట్టుబడి ప్రకటనలో మార్పు చేశామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు.
మరోసారి నందూను కలవగా అతడు మాట మార్చాడు. తనను అడిగితే ఈ ప్రాంతంలో బిటి పత్తి వేయవద్దని చెబుతానని అన్నాడు ఎంపిల బృందంతో మాత్రం అతడేమీ మాట్లాడలేదు. తాను ఆలస్యంగా వచ్చాననే సాకుతో తప్పించుకున్నాడు.
తాము రుణదాతలను పారదోలామని, వారి అవసరం నేడు ఎవరికీ లేదని మరో రైతు మాంగూ ఛవాన్ పేర్కొన్నాడు. ఇది ఆంటర్గాన్ గ్రామంలో నెలకొన్న పరిస్థితి. బిటి ఆ గ్రామంలో సౌభాగ్యాన్ని వెల్లివిరిసేలా చేసిందని పేర్కొన్నాడు. అయితే ఆ భాంబ్రజా గ్రామంలోని 365 వ్యవసాయ క్షేత్రా లను, ఆంటర్గాన్‌లోని 150 వ్యవసాయ క్షేత్రాలను విదర్భ జన్ ఆందోళన్ సమితి (విజెఎఎస్) సర్వే చేసింది. బ్యాంక్ ఖాతాలు గల రైతులందరూ బ్యాంకులకు పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డారు. 60 శాతం మంది ప్రయివేటు రుణదాతల దగ్గర అప్పుల్లో కూరుకుపోయారని ఆ సర్వేలో వెల్లడైంది.
మోడల్ గ్రామాన్ని ఎంపీల బృందం సందర్శించకుండా చూసేందుకు మహారాష్ట్ర శతథా ప్రయత్నించింది. అయితే బృందం చైర్మన్ వాసుదేవ్ ఆచార్య, మిగిలిన సభ్యులు పట్టుబట్టి ఆ గ్రామాలను సందర్శించారు. ఎంపిలను చూసిన ఆ గ్రామాల ప్రజలు తమ మనసు విప్పి మాట్లాడారు. మహారాష్ట్ర లో 1995-2010 మధ్య రికార్డు స్థాయిలో 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ క్రైం రికార్డుల బ్యూరో తెలియజేసింది. అందులోనూ విదర్భ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది.
పెయిడ్ న్యూస్ కాదు : టైమ్స్ ఆఫ్ ఇండియా వివరణ
2008లో బిటీ పత్తి గురించి ఫుల్ పేజీ లో ఇచ్చిన వార్తా కథనం పై టైమ్స్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఈ వార్తలను అత్యంత నిజాయితీతో రాశామని, మోంశాంటో కంపెనీ నాగపూర్ నుండి జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ఫీల్డ్ విజిట్‌లో భాగంగా అక్కడకు వెళ్లి రాసిందని పేర్కొంది. మీడియాలో ఇటువంటి పెయిడ్ విజిట్స్ మామూలేనని వ్యాఖ్యానించింది. అయితే తాము రాసిన వార్తా కథనం మళ్లీ ఏ విధంగా ప్రచురింపబడిందో తమకు అర్థం కావడం లేదని ఆ పత్రిక ఎడిటోరియల్ విభాగం ప్రతినిధి పేర్కొన్నారు. వినియోగదారుల చొరవమేరకు దానిని ప్రచురించి ఉండవచ్చునని అభిప్రాయ పడ్డారు. 2011 ఆగస్ట్‌లో ఫుల్‌పేజ్ ప్రకటన గురించి తమకు అవగాహన లేదని పేర్కొన్నారు. తాము కొన్ని ఫొటోలు తీశామని, అవి వాణిజ్య ప్రకటనలో ఎలా వచ్చాయో తమకు తెలియదని అన్నారు. నాగపూర్ ఎడిషన్‌లో వచ్చిన వార్తలకు తమకు ఎటువంటి ప్రతిఫలం లభించలేదని వివరణ ఇచ్చారు. మోన్‌శాంటో ప్రతినిధి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఫీల్డ్ విజిట్ ఆధారంగా రాసిన వార్త అని, అది పెయిడ్ న్యూస్ కాదని వ్యాఖ్యానించారు. రైతులు చెప్పిన విషయాలను కూడా క్రోడీకరించి ఆ వార్త రాశారని తెలిపారు.