పోర్టబులిటి

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడని సామెత. వాడొస్తే అన్నీ చూసుకుంటాడని ఆశ. రావాలని కోరిక.

కాలం కలసి వచ్చేవారికే ఈ అవకాశం అనుకుందాం. అలా రానివాళ్ల సంగతేంటి అన్న అనుమానం రావాలి. ఏం లేదు చాలా సింపుల్‌. వాడిదగ్గరకే మనం నడవాలి. ఇది నేటి కొత్త సూత్రం. వాడు వేరేవాళ్ల వైపు నడుస్తుంటే మనం దారిమార్చాలి. మనవైపు తిప్పాలి. ఇది ఇంకా కొత్త సూత్రం. ప్రపంచీకరణలో వశీకరణ మంత్రం. అది ఎలాగ అన్నది చూద్దాం.

ఈ మధ్య మనకు ఎవరినోట విన్నా, ఏ ప్రకటన చూసినా 'పోర్టబులిటి' అన్నది కనిపిస్తోంది, వినిపిస్తోంది. దాని అర్థం కదల్చటానికి వీలైనది అని. అలాంటప్పుడే మనకు ఆంగ్లం ఎంతో సహాయపడుతుంది. 'పోర్టబులిటి' లాంటి పేర్లు ఇస్తుంది. ప్రపంచీకరణ భాషను సుసంపన్నం చేస్తుంది.

ఇంతకీ ఏది కదల్చాలి, ఎందుకు కదల్చాలి అన్న సందేహాలుంటే తీర్చుకుందాం. సెల్‌ఫోను సేవలు మన పాత సంఖ్య మారకుండానే ఒక నెట్‌వర్క్‌ నుండి ఇంకోదానికి మారవచ్చు. బీమా పాలసీ ఉన్నవాళ్లు ప్రస్తుతమున్న సేవలు నచ్చకపోతే ఇంకో బీమా కంపెనీకి మారవచ్చు. ఒకవేళ నచ్చినా కొత్త సంస్థ పెట్టే ఇబ్బందిని తాళలేక బలవంతంగా మారవచ్చు. బ్యాంకు ఖాతా కూడా మన పాత సంఖ్యతోనే ఇంకో బ్యాంకుకు మారవచ్చు. ఇలా మారటాన్ని, మార్చటాన్ని ముద్దుగా పోర్టబులిటి అంటారు.

మారటం, మరీ ముఖ్యంగా మార్చటం అన్నది గ్లోబల్‌ వ్యాపారానికి వన్నెతెచ్చే ప్రక్రియ. వ్యాపారం అన్నాక కొత్త సంస్థలు వస్తుంటారు, పోతుంటారు. కొన్ని వేరే వాటిని మింగుతూ ఉంటాయి. అలా మింగటాన్ని సులువు చేసేదే ఈ 'కదల్చటం' అన్న ప్రక్రియ. కొత్తగా ఖాతాదారుణ్ణి సంపాదించటం కష్టమైనప్పుడు ఈ పోర్టబులిటి ఉపయోగం అంతా ఇంతా కాదు.

ఆ నడిచి వచ్చే కొడుకులాంటివాడే ఈ 'కదలివచ్చే' ఖాతాదారుడు. అందుకే వారిని బాగా చూసుకోవాలి. దండ వేసి స్వాగతం పలకాలి. కొత్తగా ఏమి సేవలందిస్తామో చెవులకు చిల్లులు పడేలా చెప్పాలి.

అవతలివారూ ఏమి తీసిపోరు. పాత ఖాతాదారుడు తనవద్దే ఎందుకుండాలి అన్న కారణాలు చాంతాడంత వరుస క్రమాన్ని తయారుచేసి వినిపించాలి. కొత్త సంస్థ చెప్పేది ఏదీ వినబడనంతగా వారి చెవుల్ని, కనబడకుండా కళ్లనీ చెడగొట్టాలి.

ఈ పోర్టబులిటీలు మనకేం కొత్తకాదు. రామాయణ, మహాభారత కాలాల నుండీ ఉన్నాయి. ఇక నేటి రాజకీయాల్లో ఎలాగూ ఉండనే ఉంది. అయితే ఒక్కొక్కరు కాకుండా ఒక గుంపులాగ వెళ్లాలన్న శాసనం ఉంది. దానివల్ల కొందరికి లాభమయితే కొందరికి నష్టం. ప్రతిదీ వ్యాపారమైనప్పుడు లాభనష్టాలు మామూలే.

చిన్నప్పుడు బడిలో హై జంప్‌, లాంగ్‌ జంప్‌ చేసిన, చూసిన వాళ్లకు ఒకచోటి నుండి ఇంకోచోటికి ఎలా దూకాలి అన్నది బాగా తెలిసే ఉంటుంది. అదే 'కదలికను' నేటికి అన్వయించుకోవాలి.

పూర్వం మేకపిల్లను మోసుకెళ్తున్న ఒక వ్యక్తిని కుక్కపిల్లను మోస్తున్నావా అని ముగ్గురు మోసగాళ్లు వేరువేరుగా ప్రశ్నిస్తారు. నిజంగానే అది కుక్కపిల్లేమోనని అనుమానం వచ్చి దాన్ని వదిలేస్తాడు. ఎంచక్కా దాన్ని వారు కాజేస్తారు. ఈ సూత్రాన్నే పోర్టబులిటికీ అన్వయించాలి. ఖాతాదారుని మనస్సును వికలం చేయాలి. మార్పు... మార్పు అని చెవులు గింగురుమనిపించాలి. ఇంకా మీరు మారలేదా అన్న ప్రకటనలివ్వాలి. మారకుంటే నీవు జడపదార్థానివి అని భయపెట్టాలి. ఏదోవిధంగా ఆ 'కదలిక' తేవాలి.

ఇదంతా చూస్తుంటే ఓ సినిమాలోని హిందీ నేర్చుకునే సీను గుర్తుకొస్తుంది. 'ఇక్కడికి రా' అంటే ఏమంటావని హిందీ మాస్టరు అడుగుతాడు. 'ఇధర్‌ ఆయియే' అంటాడు విద్యార్థి. అక్కడికిపో అంటే ఏమంటావ్‌ అంటాడు. 'అక్కడికి వెళ్లి మళ్లీ ఇధర్‌ ఆయియే'' అంటానంటాడు విద్యార్థి.

అందుకే ఖాతాదారులారా 'ఇధర్‌ ఆయియే'!

-జంధ్యాల శ్రీకరుణ.