విత్తన చట్టం రైతులకా? కంపెనీలకా?

విత్తన బిల్లు-2010 ప్రకారం ఏదైనా కంపెనీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా, నాసిరకం విత్తనాలు సరఫరా చేసినప్పుడు నామమాత్రంగా 6 మాసాల జైలు లేదా అపరాధ రుసుముతో సరిపెడుతున్నారు. బహుళజాతి కంపెనీలకు ఈ అపరాధ రుసుము ఒక లెఖ్ఖా! ఇలాంటి నామమాత్రపు శిక్షల వల్ల నాసిరకం విత్తనాలు తగ్గకపోగా మరింత జోరందుకునే ప్రమాదముంది. ప్రతిపాదిత విత్తన చట్టంలో ఇలాంటివే అనేక లొసుగులున్నాయి.

వ్యవసాయరంగానికి విత్తనం ప్రాణప్రదం. మేలైన విత్తనాలు అధిక ఆహారోత్పత్తికి చాలా అవసరం. స్వాతంత్య్రానంతర భారతంలో 1960 దశకం తరువాత వ్యవసాయ పరిశోధనలు, టెక్నాలజీ సహాయంతో నూతన వంగడాలకు శ్రీకారం చుట్టింది. తద్వారా హరిత విప్లవానికి బాటలు వేసింది. యం.ఎస్‌ స్వామినాథన్‌ లాంటి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాము. 1991లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ విధానం ఈ స్వావలంబన, ఆహారభద్రతకు ముప్పుగా పరిణమించింది. కీలకమైన విత్తన రంగం ఇప్పటికే చాలావరకు మోన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీల ఆధీనంలోకి వెళ్లిపోయింది. నేడు దేశంలో 60శాతం విత్తనాలను ఈ కంపెనీయే నియంత్రిస్తున్నది.

హరిత విప్లవం అనంతరం ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతులు ఈ కంపెనీ విత్తనాలకు అలవాటు పడేలా చేసింది. సరళీకరణ విధానాలు అమల్లోకివచ్చాక ప్రభుత్వ సంస్థల నుండి విత్తనాలను సేకరించే బదులు బహుళజాతి సంస్థల నుంచి సేకరించే పద్ధతి మొదలైంది. ఫలితంగా రాష్ట్రంలో విత్తనం 90శాతం మోన్‌శాంటో, ప్రోఆగ్రో, కార్గిల్‌ లాంటి బహుళజాతి కంపెనీల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. నాణ్యత లేని విత్తనాలను కంపెనీలు విడుదల చేయడం వల్ల రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. 2000 సంవత్సరం నుండి విత్తన చట్టం లేకపోవడం వల్ల కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా నానాఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 1966 విత్తనచట్టం, అవగాహనా ఒప్పందం (ఎం.ఓ.యు) వల్ల రైతులకు జిల్లాస్థాయి కంపెనీల నుంచి నష్టపరిహారం ఇచ్చే అధికారం గతంలో వుండేది. ఎప్పుడైతే కేంద్రం విత్తన చట్టం ప్రతిపాదనలు తీసుకొచ్చిందో అప్పటి నుంచి మన చట్టాలను నిర్వీర్యం చేయనారంభించారు. దీని వల్ల విత్తన ధరలను నియంత్రించే అధికారం రాష్ట్రాలకు లేకుండా పోయింది.

2004లో కేంద్రం ప్రతిపాదించిన విత్తన బిల్లు రైతులకు సహాయకారిగా కాకుండా బహుళజాతి కంపెనీలకు ప్రయోజనకారిగా వుంది. 6 సంవత్సరాలు తాత్సారం చేశాక మొన్నటి బడ్జెట్‌ సమావేశాల్లో దీనిని రాజ్యసభ ముందుంచింది. రైతులు తమ సొంత విత్తనం వాడుకోవడం, మేలైనవి సేకరించి ఇతరులతో మార్పిడి చేసుకోవడానికి ఇకపై వీలు లేకుండా చేస్తున్నది. కంపెనీల విత్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రశ్నించే హక్కును కూడా ఇది హరించివేస్తున్నది. రైతులను ఉద్ధరించడమంటే ఇలాగేనా?

విత్తన చట్టం-2010 క్లాజ్‌ 20లో నాణ్యత లేని విత్తనాన్ని కంపెనీలు విడుదల చేసినపుడు నష్టపరిహారం విషయాన్ని కేంద్ర పరిధిలో కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నిబంధన కంపెనీలకు ఉపయోగపడుతుందే తప్ప రైతులకు తోడ్పడదు. సామాన్య రైతు కేంద్రానికి అప్పీిలుకు పోయే స్థాయి, పరిజ్ఞానం, అవకాశాలు లేనేలేవు. క్లాజ్‌ 21(6) ప్రకారం విత్తనోత్పత్తిదారులు విత్తన ధ్రువీకరణ సంస్థకు వివరాలు ఇవ్వాలి. వీటిని పర్యవేక్షించడానికి అవసరమైన సిబ్బంది లేకపోవడం వల్ల కంపెనీలను నియంత్రించే శక్తి ఆ సంస్థకు వుండదు. క్లాజ్‌ 36(1) ప్రకారం విత్తన పరీక్షలను కంపెనీయే తన ఏజెన్సీల ద్వారా నిర్వహించి ధ్రువీకరిస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా కంపెనీలకు అనుకూలంగా చేపట్టిన చర్య. దేశంలో అన్ని ప్రాంతాల్లో వాతావరణం, నేల స్వభావం ఒకే రీతిన వుండదు. వివిధ ప్రాంతీయ ప్రభుత్వ పరిశోధనా స్థానాల్లో నిగ్గుతేలిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం వీటిని అనుమతించాలి. క్లాజ్‌ 38 (2,3) ప్రకారం ఏదైనా కంపెనీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా, నాసిరకం విత్తనాలు సరఫరా చేసినప్పుడు నామమాత్రంగా 6 మాసాల జైలు లేదా అపరాధ రుసుముతో సరిపెడుతున్నారు. బహుళజాతి కంపెనీలకు ఈ అపరాధ రుసుము ఒక లెఖ్ఖా! ఇలాంటి నామమాత్రపు శిక్షల వల్ల నాసిరకం విత్తనాలు తగ్గకపోగా మరింత జోరందుకునే ప్రమాదముంది. ప్రతిపాదిత విత్తన చట్టంలో ఇలాంటివే అనేక లొసుగులున్నాయి.

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. విత్తనం, ఎరువులు, విస్తరణ, పరిశోధనలు లాంటి కీలకమైన వ్యవసాయాభివృద్ధికి తోడ్పడే విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించే అధికారం లేకుండా కేంద్ర నియంత్రణలోకి తీసుకురావడమంటే కంపెనీల గుత్తాధిపత్యానికి అవకాశం కల్పించడమే కాగలదు. రైతులకు నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడతాయి.

ఈ బిల్లులో విత్తన ధరలను నియంత్రించడానికి ఎలాంటి నియమ నిబంధనలను పొందుపరచలేదు. ట్రిప్సు అగ్రిమెంట్‌ సెక్షన్‌ 8, ఆర్టికల్‌ 40 ప్రకారం సభ్యదేశాలను నియంత్రించడానికి సొంత నియమాలు ఏర్పరచుకునే వీలుంది. ఈ నిబంధనను ఉపయోగించుకుని బిల్లులో మనకు అనుకూలమైన మార్పులు చేసుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఆ పనిచేయలేదు. మన రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకే అది ఎక్కువ విలువనిస్తున్నది. విత్తన రిటైల్‌ ధరలను నియంత్రించడానికి అవసరమైన నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుండాలి. కానీ ఈ బిల్లులో ఎక్కడా ఆ ఊసే లేదు. కేంద్రం విత్తన ధరలు నిర్ణయించినా అప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు గనుక విత్తన ధరలు నిర్ణయించి వుంటే అవే అమలు జరగాలి. రాష్ట్రం విత్తన ధరలు నిర్ణయించని పక్షంలో మాత్రమే కేంద్రం ప్రకటించిన ధరలు అమలులోకివస్తాయి. ఈ మార్పును పరిగణనలోకి తీసుకోవాలి. కంపెనీలకు ట్రేట్‌ వాల్యు/రాయల్టీ చెల్లించాల్సి వస్తే అసలు విత్తనోత్పత్తిధరల్లో అవి 20శాతానికి మించరాదు. ఇది మొదటి మూడు సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆతరువాత మూడు సంవత్సరాలు 5శాతం రాయల్టీకి మించరాదు. అటుపిమ్మట రాయల్టీని పూర్తిగా మినహాయించాలి. ఈ అంశాలపౖౖె రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరింది. రైతుసంఘాలతో కూడిన అఖిలపక్ష బృందం ఢిల్లీ వెళ్లి దేశ ప్రధానమంత్రిని, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రిని, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి విత్తన చట్టంలో రైతులకు అనుకూలంగా సవరణలు చేయాలని కోరుతూ కొన్ని ప్రతిపాదనలు వారి ముందుంచింది. అఖిల భారత కిసాన్‌ సభ, వ్యవసాయ రంగానికి చెందిన మేధావులు రైతులకు అనుకూలంగా బిల్లులో చేపట్టాల్సిన మార్పులను నిర్దిష్టంగా సూచించారు. ఫలితంగా విత్తన బిల్లును రాజ్యసభలో ఆమోదానికి పెట్టకుండా తాత్కాలికంగా ఆపివుంచారు. దీన్ని ఆసరాగా తీసుకొని ఏళ్ల తరబడి విత్తనబిల్లును నాన్చితే రైతులకు ఏ విధమైన రక్షణ లేకుండాపోతుంది. ఇది కూడా బహుళజాతి కంపెనీలకే ప్రయోజనకరం. కాబట్టి వ్యవసాయరంగాన్ని, ఆహారోత్పత్తిలో స్వావలంబనను కాపాడుకొనేందుకు రైతులకు అనుకూలంగా విత్తన బిల్లులో సానుకూలమైన మార్పులను సత్వరమే తీసుకురావాల్సిన అవసరమెంతైనా వుంది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఈ కింది సవరణలతో బిల్లు తీసుకురావాలి.

1.రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి జిల్లాస్థాయిలో నియంత్రణ కమిటీలు వేయాలి. వాటి ద్వారానే కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే జరగాలి. నష్టపరిహారం చెల్లించని కంపెనీలపై రెవిన్యూయాక్టును ప్రయోగించాలి.

2.స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు విత్తనాల నాణ్యతను ధ్రువీకరించిన తరువాతనే వ్యవసాయశాఖ ద్వారా వాటిని విడుదల చేయాలి.

3.కాంట్రాక్టు పద్ధతిలో విత్తనాలు సేకరిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఉత్పత్తి, ఉత్పాదకాలు ఇతర విధానాలను నియంత్రించే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి.

4.ప్రభుత్వ నిధులతో పరిశోధనా సంస్థలు రూపొందించిన కొత్త రకాలను నేరుగా రైతులకు అందించే వీలుండాలి. గ్రామీణ విత్తన పథకం, మినీ కిట్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా రైతులకు అందించే ఏర్పాటు చేయాలి.

5.వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వివిధ పంటలు, రకాలు స్థానిక స్వభావం కలిగి వుంటాయి. కాబట్టి వాటిని పరీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకే వుండాలి.

6.రైతులు సొంత విత్తనాలు వాడుకోవడానికి, సేకరించిన మేలైన విత్తనాలు ఇతర రైతులకు మార్పిడి చేసుకోవడానికి వీలుండాలి.కేంద్ర ప్రభుత్వం నిజంగా రైతుల బాగు కోరుకునేదే అయితే ఈ సూచనలను విత్తనబిల్లులో తప్పక పొందుపరచాలి. లేనిపక్షంలో రైతుల పక్షాన వ్యవసాయరంగ నిపుణులు, రాజకీయ పార్టీలను, ఇతర స్వచ్చంద సంస్థలను కలుపుకొని రైతాంగం పెద్దయెత్తున ఉద్యమించాల్సి వస్తుంది.

సామినేని రామారావు(రచయిత ఎ.పి రైతుసంఘం ప్రధాన కార్యదర్శి)

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్