అటు సంపద ఇటు పేదరికం

యుఎన్‌డిపి ప్రతి ఏటా విడుదల చేసే మానవాభివృద్ధి నివేదికకు ఉపయోగించే సూచీలకన్నా విస్తృతమైన సూచీలను ఇప్పుడు వినియోగించడంతో పేదల పరిస్థితి వాస్తవానికి మరింత దగ్గరగా ప్రతిబింబించిందని ఆ సూచీల తయారీలో ప్రధాన పాత్ర వహించిన సబీనా ఆల్కైర్‌ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే దేశంలో పేదరికం తీవ్రంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో మొత్తం 26 సహారా దిగువ ప్రాంత దేశాలలో కన్నా ఎక్కువ మంది పేదలు ఉన్నారు. దీని ప్రకారం దేశం మొత్తం మీద 41 కోట్ల మంది నిరుపేదలున్నారు. అంటే సగానికన్నా ఎక్కువ జనాభా దారిద్య్రంలో మగ్గుతున్నారన్నమాట.

ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చాల గొప్పగా మాట్లాడుతున్నారు. ఇటీవల సిఐఐ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ఏడాది భారత ఆర్థికాభివృద్ధిరేటు గురించి పలు అంతర్జాతీయ సంస్థలు ఎంతో ఆశాజనకమైన అంకెలను చెబుతున్నాయని అయినప్పటికీ 8.5 శాతం ఉంటే తాను సంతృప్తి చెందుతానని పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (ఐఎంఎఫ్‌) 2010లో భారత ఆర్థికాభివృద్ధి రేటు 9.4 నుండి 9.5 శాతం ఉండవచ్చునని తాజాగా అంచనా వేసింది. ఇది గతంలో ఆ సంస్థ అంచనా 8.8 శాతం కన్నా చాల ఎక్కువ. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒడుదుడుకులను చెప్పలేము కాబట్టి తాను ఆ అంచనాను తగ్గించి చెబుతున్నానని ప్రణబ్‌ అన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఐరోపాలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం మనపై ఉండదని కూడ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అధిక వేగంతో ముందుకు సాగుతుందని చెప్పడమే కాకుండా ఆయన ద్రవ్యోల్బణం గురించి కూడ ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులో ఒక సమావేశంలో పాల్గొంటూ ఆయన నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసే నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, ఆహారసరుకుల ద్రవ్యోల్బణం 20 శాతం వరకు ఉంటూ ద్రవ్యోల్బణంలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నది ఆయన ఉద్దేశం. రుతుపవనాలు అనుకూలంగా పంటలు బాగా పండితే ధరలు తగ్గుతాయన్నది ఆయన భావం. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలు. నియంత్రణల ఎత్తివేత ప్రభావం కాని, ఆహార సరుకుల వ్యాపారంలో ప్రైవేటు గుత్త వ్యాపారుల పాత్ర, ప్రత్యేకించి ఫ్యూచర్‌ ట్రేడ్‌ ప్రభావం ధరలపై ఉంటుందనే విషయాన్ని కానీ ఆయన విస్మరిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి జరిగితే అందరూ ఆటోమేటిక్‌గా సుభిక్షంగా ఉంటారన్నది ఆయన వైఖరి.

కాని ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యుఎన్‌డిపి) భారత దేశంలో పేదరికం గురించి ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించింది. సహారా దిగువ ప్రాంత ఆఫ్రికా దేశాలలో కన్నా భారత దేశంలో దారిద్య్రం తీవ్రంగా ఉందన్నది ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన సమాచారం సారాంశం. యుఎన్‌డిపి ప్రతి ఏటా విడుదల చేసే మానవాభివృద్ధి నివేదికకు ఉపయోగించే సూచీలకన్నా విస్తృతమైన సూచీలను ఇప్పుడు వినియోగించడంతో పేదల పరిస్థితి వాస్తవానికి మరింత దగ్గరగా ప్రతిబింబించిందని ఆ సూచీల తయారీలో ప్రధాన పాత్ర వహించిన సబీనా ఆల్కైర్‌ పేర్కొన్నారు. మంచి వంట ఇంధనం, మంచి విద్యాసదుపాయం, విద్యుత్తు, పౌష్టికాహారం, పారిశుధ్యం లాంటి మొత్తం పది అంశాలను ఈ సూచీకి ప్రాతిపదికగా తీసుకున్నారు. దీనిని మల్టిపుల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపిఐ) అని పేరు పెట్టారు. దీని ప్రకారం దేశంలో పేదరికం తీవ్రంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో మొత్తం 26 సహారా దిగువ ప్రాంత దేశాలలో కన్నా ఎక్కువ మంది పేదలు ఉన్నారు. దీని ప్రకారం దేశం మొత్తం మీద 41 కోట్ల మంది నిరుపేదలున్నారు. అంటే సగానికన్నా ఎక్కువ జనాభా దారిద్య్రంలో మగ్గుతున్నారన్నమాట. ఉదాహరణకు 7 కోట్ల మంది జనాభా ఉన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని 6.2 కోట్ల జనాభా కలిగిన కాంగో ప్రజాతంత్ర రిపబ్లిక్‌తో ఈ అధ్యయనం పోల్చిచూపింది. భీకరమైన యుద్ధంలో మునిగిపోయిన ఈ దేశంలోను, మధ్యప్రదేశ్‌ లోను ఒకే సంఖ్యలో పేదలున్నారని తేల్చింది.

ప్రపంచబ్యాంకు మాదిరి కేవలం 1.25 డాలర్లు అంతకన్నా తక్కువ రోజువారీ ఆదాయం లభించే వారిని లెక్కిస్తే వారి ఆదాయ పరిస్థితి మాత్రమే తెలుస్తుందని, అలా కాకుండా ఆదాయం ఎంత వస్తుందన్నదానితో పాటు మీరు వంటకోసం ఏ ఇంధనం వాడుతున్నారు, మీ పిల్లవాడు స్కూలుకు వెళుతున్నాడా, మీకు సుస్తీ చేస్తే ఎలా వైద్యం చేయించుకుంటారు- లాంటి ప్రశ్నలు అసలు పరిస్థితి మరింత స్పష్టంగా వెల్లడిస్తాయి కాబట్టి దీన్ని ఎంచుకున్నామని అధ్యయన నిర్వాహకులు చెప్పారు. మొత్తం 104 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ అధ్యయనం సేకరించింది. 520 కోట్ల జనాభా కలిగిన ఈ దేశాలలో 170 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నారని తేల్చింది. అంటే మొత్తం జనాభాలో మూడో వంతు. భారత దేశంలో మాత్రం నిరుపేదలు 51 శాతం మంది ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ 104 దేశాలలో భారత దేశం స్థానం 63. చైనా, వియత్నాంలు మన కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి.

చైనా ఈ జాబితాలో 46 వస్థానంలో ఉంది. రాష్ట్రాలవారీగా చూసుకుంటే బీహారు గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా 80 శాతం మంది నిరుపేదలు కాగా, కేరళలో వీరు 16 శాతంగా ఉన్నారు. మొత్తంమీద దేశం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకునే దాదాపు 10 శాతం వార్షికాభివృద్ధి ఫలితాలు ప్రజలందరికీ సమంగా అందటం లేదు, కొద్దిమంది సంపన్నులు మాత్రమే అత్యధిక ప్రయోజనాన్ని పొందుతున్నారు, ఆదాయ వ్యత్యాసాలు ఈ కాలంలో మరింత తీవ్రమయ్యాయనే విమర్శలకు ఈ అధ్యయనం నిర్ధారణలు బలం చేకూర్చుతున్నాయి. దీన్ని ధృవీకరించడానికా అన్నట్లు ఇదే మయంలో బిజినెస్‌ వరల్డ్‌ పత్రిక ప్రతి ఏటా రూపొందించే భారత దేశంలో అతి సంపన్నుల జాబితా కూడ వెలువడింది. తమ వద్ద ఉన్న వాటాల విలువ రు.100 కోట్లు అంతకు మించిన వారిని బిజినెస్‌ వరల్డ్‌ పత్రిక ఈ జాబితాలో చేరుస్తుంది. దీని ప్రకారం 2010లో శత కోటీశ్వరుల సంఖ్య 521గా తేలింది. అయితే వీరి సంపదలోను తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో ఉన్న అశ్విని కుమార్‌ సంపద విలువ రు.100.49 కోట్లు కాగా, ప్రప్రథóమ స్థానంలో ఉన్న టాటా అండ్‌ సన్స్‌ సంపద విలువ 1,84,203 కోట్లు. ఆ తర్వాత స్థానాలలో వరుసగా ముఖేష్‌ అంబాని, అనిల్‌ అగర్వాల్‌, అజిమ్‌ ప్రేమ్‌జీ, అనిల్‌ అంబానీ, సునీల్‌ మిట్టల్‌, సావిత్రిదేవి మిట్టల్‌ మొదలైన వారంతా టాటాలతో దాదాపు సమ ఉజ్జీలే. 2009 మార్చి 31 నాటికి 9708గా ఉన్న సెన్సెక్స్‌, 2010 మార్చి అంతానికి 17,528 అంటే దాదాపు రెట్టింపు అయింది. దీని ప్రభావం ఆయా వ్యక్తులు, కుటుంబాలు కలిగి ఉన్న వాటాల విలువలపై పడింది. 500 అతి సంపన్నుల ఆధీనంలోని వాటాల విలువ ఈ కాలంలో 106.72 శాతం పెరిగి రు.16,56,490 కోట్లకు చేరుకుంది. కొందరి కంపెనీల ఆదాయాలు పెరుగుదలతో అంతగా సంబంధం లేకుండా కూడా వారి వాటాల విలువ పెరగడం కనిపించింది.

2009-10లో ముఖేష్‌ అంబానీ ఆధీనంలోని రిలయన్స్‌ సంస్థల రెవిన్యూ 39.82 శాతం, నికర లాభాలు 3.94 శాతం పెరిగితే, ఆయన వాటాల విలువ 5 శాతం మాత్రమే అధికం అయింది. సునీల్‌ మిట్టల్‌ ఆధీనంలోని ఎయిర్‌టెల్‌ రెవిన్యూ 1.16 శాతం పడిపోయినా, నికర లాభాలు 2.63 శాతం పెరిగాయి. వాటాల విలువ మాత్రం 1 శాతం మాత్రమే పెరిగింది. దీనికి భిన్నంగా సావిత్రి జిందాల్‌ సంస్థల రెవిన్యూ 14 శాతం, లాభాలు 112 శాతం పెరగగా, వాటాల మార్కెట్‌ విలువ 389 శాతం అధికం అయింది. ఇదంతా వారు ప్రమోటర్లుగా కలిగిన వాటాల విలువలు పెరగడం లేదా తరగడం మాత్రమే. మొత్తం వారు అదుపుచేసే ఆస్తుల విలువ అపారంగా ఉంటుంది. భారత దేశపు జిడిపి రాబోయే సంవత్సరాలలో మరింత వేగంగా పెరుగుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. 2008 నాటికి భారత దేశపు జిడిపి ఒక లక్ష కోట్ల డాలర్ల మార్కును చేరింది. అంటే ఆరు దశాబ్దాల కాలం పట్టింది. కాని భారత దేశపు జిడిపి 2 లక్షల కోట్ల మైలురాయిని మరో ఐదేళ్లలో చేరుకోగలదని ఒక అధ్యయనం చెబుతున్నది. అంటే సంపద సృష్టి మరింత వేగంగా జరుగుతుంది. అయితే దీన్ని హస్తగతం చేసుకునే వారు మరింత కేంద్రీకృత మవుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వారిలో అత్యధికులు ఒకటి, లేదా అనేక సంస్థలను స్థాపించి వాటిలో ప్రమోటర్లుగా వాటాలు కలిగి ఉండి, వాటిని అదుపు చేస్తున్న వారు. అంటే సంపద సృష్టిలో వారికి ఎంతో కొంత ప్రమేయం ఉంటుంది. కాని అసలు ఉత్పత్తి అంటే ఎలా ఉంటుందో తెలియ కుండానే కేవలం స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారానే శత కోటీతశ్వరులుగా మారుతున్న వారి సంఖ్య ఈ కాలంలో పెరుగుతూ ఉంది. ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రాబల్యం పెరుగుదలతో పాటు ఈ రకమైన సంపన్నులు పెరుగుతుంటారు.

సంపన్న దేశాలలో ఇది ప్రముఖంగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు మన దేశంలో కూడ ఈ పరిణామం అధికమయింది. అలాంటి వారు బిబినెస్‌ వరల్డ్‌ జాబితాలో 23 మంది ఉన్నారు. 500 మందిలో ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదు. అంతే కాదు, గతంలో తాము తక్కువ పెట్టుబడులు, లేదా నామ మాత్రపు పెట్టుబడులు పెట్టి స్థాపించిన వాటిలో ప్రమోటర్లుగా తమకు ఉన్న వాటాలలో కొంత భాగాన్ని అమ్ముకొని, (వాటి మారర్కెట్‌ విలువ ఎన్నో రెట్లు పెరిగిన ఫలితంగా) శతకోటీశ్వరులయినవారు కూడ గణనీయంగానే ఉన్నారు. మొత్తంగా దేశంలో ఇదీ పరిస్థితి. ఒక వైపున అభివృద్ధి వేగం పుంజుకుంటున్నదని ప్రణబ్‌ ముఖర్జీ లాంటి వారు ఎంతగానో సంబరపడిపోతున్నారు. అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవమే. కాని ఆ ఫలితాలు కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. మెజారిటీ ప్రజానీకం ఆ ఫలితాలకు దూరంగానే ఉంటున్నారు, లేదా నామ మాత్రంగా మాత్రమే పొందుతున్నారు. అందుచేతనే దేశంలో నిరుపేదల శాతం తగ్గక పోగా మరింత పెరుగుతున్నది. ఇవన్నీ వూహించి చెబుతున్నవి కావని, కటిక నిజాలని పై వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

గుడిపూడి విజయారావు

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్