పక్షవాత రోగులకు కృత్రిమ హస్తాల కదలిక

పక్షవాతం వచ్చిన వారికి కాళ్లూ చేతులు పడిపోవడం, ఇతరుల సహాయంతో తప్ప కదలలేక పోవడం తెలిసిన విషయమే. రకరకాల వైద్య విజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినా ఇలాంటి వారి అవస్థలు ఇప్పటికీ తగ్గలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డా|| వింజమూరి రమణ చేసిన పరిశోధన ఇలాంటి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం కలిగిస్తోంది. కంప్యూటర్‌ అనుసంధానం ద్వారా మెదడు సంకేతాలతోనే వారు కృత్రిమ హస్తాన్ని కదిలించే సామర్థ్యం ఈ పద్ధతి ద్వారా లభిస్తుంది. మామూలుగా మెదడు సంకేతాల ద్వారానే అవయవాలు పనిచేస్తాయి. వివిధ కండరాల కదలికలను స్వతంత్రంగా వెలువడే సంకేతాలతో సంధానం చేయడం ఇందులో అతి క్లిష్టమైన భాగం. ఇది ఒక క్రమ పద్ధతిలో జరిగితే కాళ్లూ చేతులు కదిలించడం సాధ్యమవుతుందని తన డాక్టరేట్‌ పరిశోధనానంతర పత్రంలో వింజమూరి రమణ నిరూపించారు.

ఇవి పక్షపాతానికి గురైన రోగి మెదడులో ప్రేరణలు కలిగించి కృత్రిమ అవయవానికి సంకేతాలు అందేలా చేస్తాయి. ఇందుకుగాను ఆయనకు అమెరికాలోని శారీరక వైకల్య పరిశోధన సహాయ సంస్థ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిసెబిలిటీ అండ్‌ రీహాబిలిటేషన్‌- ఎన్‌ఐడిఆర్‌ఆర్‌) 63,072 డాలర్లు బహుమానం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ ప్రచురించే యూనివర్సిటీ టైమ్స్‌ పత్రికలో ఈ పరిశోధన ఫలితాలు, రమణ అభిప్రాయాలు గతంలో ప్రకటించారు. అతని పరిశోధన విలువను, ప్రాధాన్యతను గుర్తించిన యూనివర్సిటీ వారు రమణను ప్రథమ ఇన్వెంటర్‌గా పేటెంట్‌ నమోదు చేశారు.

మెదడు కణజాలంలో అవయవాల కదలికలను నియంత్రించే సంకేత వ్యవస్థ సంజ్ఞలను గ్రహించడం ద్వారా సత్ఫలితాలు సాధించగలిగినట్టు రమణ వివరించారు. మామూలుగా చేతిని కదిలించిన రీతిలోనే పక్షవాతానికి గురైన చేతిని కూడా కదిలించేందుకు వీలుగా మెదడుకూ కంప్యూటర్‌కు మధ్య అనుసంధానం చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని (ఇంటర్‌ ఫేస్‌)ను కనుగొనడమే ఈ పరిశోధన లక్ష్యం.

పై పరిశోధన కొనసాగింపుగా ఇటీవల అమెరికాలో పక్షవాత రోగులకు ప్రయోగాత్మకంగా ఇంటర్‌ఫేస్‌ అమర్చినప్పుడు వారు చేతిని బాగా కదిలించగలిగారు. ఉదాహరణకు ఏడేళ్ల కిందట మోటారు సైకిల్‌ ప్రమాదంలో చేయి చచ్చుపడిపోయిన టిమ్‌ హెమ్స్‌ అనే అతను ఈ పద్ధతిలో మెదడు సంజ్ఞల ద్వారా కృతిమ హస్తాన్ని పనిచేయించగలిగాడు. వింజమూరి రమణ పరిశోధన దీనికి ప్రాతిపదిక కాగా యూనివర్సిటీ పునరావాస వైద్య విభాగం అధిపతి డా||మైకేల్‌ బోనింజర్‌ నాయకత్వం వహించారు. ''ఇది అద్భుత పరిశోధన'' అని డా||బోనింజర్‌ హర్షం వ్యక్తం చేశారు. ''ఈ విధంగా మానవ శరీరాలను పనిచేయించడం రాబోయే రోజుల్లో గొప్ప మార్పులకు నాంది అవుతుంది'' అని ఆయన చెప్పారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సైన్స్‌ పేజీలో 2011 అక్టోబరు 10 వ తేదీన ఈ ప్రయోగాత్మక చికిత్స గురించి ప్రముఖంగా రాసింది.

వింజమూరి రమణ 2008లో యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో డాక్టరేట్‌ పూర్తి చేసుకుని అక్కడే స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ రిసెర్చిలో అసోసియేట్‌గా తన బృహత్తర పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ (ఐఇఇఇ) అనే ప్రముఖ సంస్థ ఆయన సాధించిన ఫలితాలకు గుర్తింపుగా పిట్స్‌బర్గ్‌ శాఖ సిగల్‌ ప్రాసెసింగ్‌ సోసైటీకి చైర్మన్‌గా నియమించింది.

డా||వింజమూరి రమణ తండ్రి డా||విశ్వనాథమయ్య ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు రీడర్‌గా రిటైరయ్యారు. ఈ పరిశోధన విజయం పట్ల రమణ బంధుమిత్రులు విజ్ఞాన శాస్త్రాభిమానులు ఎంతో సంతోషం వెలిబుచ్చారు. ఇది భారతీయ విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి మరో నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు.