పర్వతారోహణ సాహసం ... సరదా....

ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌. ఆ పర్వతపాదం దగ్గర నిలబడి తలెత్తి చూసినా పర్వతశిఖరం కంటికి కనిపించదు. అలాంటి అత్యున్నత శిఖరాగ్రాన నిలబడి ప్రపంచాన్ని చూడాలని...ఆ మంచుమేడమీద రెండు చేతులూ చాచి పెద్దగా అరవాలని...జయకేతనాన్ని ఎగురేయాలని ఎందరు ఎన్ని కలలు కన్నారో! కాకపోతే కలలు కన్నంత సులభంకాదు వాటిని సాకారం చేసుకోవడం. అది కొందరికే సాధ్యం. ఆ కొందరే సాహసాలు చేస్తూ దుర్లభం అనుకున్న క్లిష్ట కార్యాలను సులభం చేస్తూ చరిత్రలు సృష్టిస్తుంటారు. ఇటీవల ఎవరెస్ట్‌ శిఖరం చివరిదాకా వెళ్లిన అర్జున్‌ గురించి, పర్వతారోహణ గురించి తెల్సుకుందాం...

కాకులు దూరని కారడవులలోకి, చీమలు దూరని చిట్టడవుల్లోకి మనిషి చొచ్చుకుని వెళ్లి వనాల రహస్యాలను కనుక్కుంటున్నాడు. అంతరిక్షంలో విహరిస్తున్నాడు. అజేయంగా నిలబడ్డ పర్వతాలను కూడా లెక్కచేయకుండా వాటిని ఎక్కి శిఖరాలపై తన జండా పాతి వస్తున్నాడు. అలాంటి హిమాలయ పర్వతాలలో 8848 మీటర్ల ఎత్తులో వుంది ఎవరెస్టు శిఖరం. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఈ శిఖరాన్ని అధిరోహించాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. అయినా 1953వ సంవత్సరం వరకు మానవుడు ఈ విషయంలో విజయాన్ని సాధించలేకపోయాడు. కాని చారిత్రాత్మకమైన ఆ సంవత్సరంలో ఎవరెస్టు కూడా మానవ సాహసానికి తలవంచక తప్పలేదు.

నేపాల్‌కు చెందిన టెన్సింగ్‌నార్కే, న్యూజిలాండ్‌కు చెందిన సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ మొదటిసారిగా ఎవరెస్టును అధిరోహించి మనుషులు సాధించలేనిది లేదని రుజువు చేశారు. అప్పట్నుంచీ ఎవరెస్టు శిఖరాన్ని దేశదేశాలకు చెందిన అనేక బృందాలవారు అధిరోహిస్తూనే వున్నారు. అయితే ఒకసారి ఎక్కిన శిఖరాన్ని మళ్లీ ఎక్కడం గొప్పేమీ కాదు కాబట్టి ఈ బృందాలవారు మరికొన్ని కొత్త సాహసాలను ప్రదర్శిస్తున్నారు.

ఎంత అందమైనదో... అంత క్రూరమైనది...

నిజానికి హిమాలయాలు దుర్గమమైన పర్వతాలు. ఎవరెస్టు తర్వాత చెప్పుకోదగిన ఎత్తైన కె2 శిఖరం కారకోరం పర్వతాలలో వుంది. ప్రపంచంలోని పర్వతారోహకులందరూ ఈ రెండు శిఖరాలను అధిరోహించాలనే వుత్సాహపడుతూ వుంటారు. కొంతమంది మధ్యలోనే అలసిపోయి వెనుతిరిగిపోతూ వుంటారు. ప్రతికూల వాతావరణం వల్ల, వ్యాధులకు గురై లేక ఇతర ప్రమాదాలకు లోనై ఈ శిఖరారోహణకు ప్రయత్నించే పర్వతారోహకులలో ప్రతి ఇరవైమందిలోనూ ఒకరు ప్రాణాలను కోల్పోతూనే వున్నారు. కె2 శిఖరారోహణ ప్రయత్నంలో అసువులు కోల్పోయేవారు మరీ ఎక్కువ. ఆ కారణంగానే ఈ శిఖరాన్ని ''శావేజ్‌ మౌంటెన్‌'' లేదా ''క్రూర పర్వతం'' అని పిలుస్తూ వుండడం కూడా కద్దు.

కిక్కే కిక్కు

ఈ రోజుల్లో పర్వతారోహణ కూడా ఒక విధమైన సాహసక్రీడే. అది ఎక్కిన వారు పొందే కిక్కు అంతా ఇంతా కాదు. అందుకే ఎప్పటికప్పుడు పర్వతారోహకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. వీరికోసం ప్రత్యేకమైన క్లబ్బులు, శిక్షణాలయాలు వెలిశాయి. మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో పర్వతారోహణలోని కిటుకులను, మెళకువలను నేర్పిస్తారు. కొండలను సులువుగా ఎలా ఎక్కాలో, అనుకోని అవాంతరాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో, దిగేటప్పుడు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ వైనాలన్నీ నేర్పుతారు. అంతేకాదు కొండల్ని ఎక్కాలన్న ఉబలాటంతో పుల్లయ్య వేమవరం వెళ్లినట్టు వెళితే కుదరదు. అందుకు అవసరమయ్యే పరికరాలను తోడుతీసుకెళ్లాలి. అనువైన దుస్తులు, బూట్లు వుండాలి. వాతావరణ ప్రభావంవల్ల కలిగే అనారోగ్యాలను తట్టుకుని నిలబడటానికి అనువైన మందులను వెంట వుంచుకోవాలి. అన్నింటినీ మించి గుండె దిటవు అలవర్చుకోవాలి. ఇన్నీ వుంటేకానీ పర్వతారోహణ సాధ్యపడదు.పర్వతారోహణకు తలపడేవాళ్లకు ముఖ్యంగా వుండాల్సింది ఒంటికి అతుక్కుని బిగుతుగా వున్న దుస్తులు, బూట్లు, గట్టి తాడు, మంచుగడ్డలను ఛేదించడానికి ఉపయోగపడే గొడ్డలీ, కళ్లజోడు వగైరాలు. అంతేకాక ఇంకా ఎత్తులకు వెళ్లాలనుకునేవారు ఆక్సిజన్‌ సిలిండర్‌ను కూడా తమవెంట తీసుకెళ్లాల్సి వుంటుంది. తలకు హెల్మెట్‌లాంటి శిరస్త్రాణాన్ని ధరించడం కూడా తప్పదు.

ఎలాంటి బట్టలు వేసుకోవాలి?

పర్వతారోహకులకు పాంట్లు, షర్టులు, కోట్లు వంటివే అనువుగా వుంటాయి. మహిళలకైనాసరే. అంతేకానీ ఏ పంచెలు కట్టుకునో, చీరలు సింగారించుకునో కొండెక్కాలంటే కుదరదు. అనవసరమైన ఇబ్బందులు ఎదురౌతాయి. కాబట్టి పర్వతారోహకులు ఎప్పుడూ వొంటికి సరిగా అమరివుండి, శరీరాన్ని ఫ్రీగా కదిలించడానికి అడ్డురాని దుస్తులనే ధరించాలి. ఆ దుస్తులు వాటర్‌ ప్రూఫ్‌వి అయివుండడం కూడా అవసరం. ఆ తర్వాత ముఖ్యంగా వుండాల్సినవి అనువైన బూట్లు.కొండలుకానీ, పర్వతాలు కానీ ఎక్కేటప్పుడు దిట్టమైన మంచిరకం బూట్లు వుండడం ఎంతో అవసరం. ఈ బూట్లు నిటారుగా వున్న కొండలపై ఎక్కేటప్పుడు వంగకూడదు. ఒంటికి అతుక్కుని సౌకర్యంగా వుండే దుస్తులు, దిట్టమైన బూట్లు పర్వతారోహకునికి ఎంతో అవసరం. కొన్ని ప్రత్యేక తరహా పర్వతాలను అధిరోహించడానికి అనువైన అడుగుభాగంలో రబ్బరు సోల్సున్న బూట్లు కూడా వుంటాయి. కొండలమీద ఎక్కుతున్నప్పుడు ఈ రబ్బరుసోల్సు రాతికి అతుక్కుని పర్వతారోహణాన్ని కొంతవరకు సులభతరం చేస్తాయి. ఆ కారణంగానే వీటిని ''మ్యాజిక్‌ బూట్లు'' అని వ్యవహరిస్తుంటారు. అయితే మ్యాజిక్‌ బూట్లు అన్ని కొండలు ఎక్కడానికి వుపయోగపడవు. వాతావరణం తడిగా వున్నప్పుడుగానీ, మంచుకొండలను అధిరోహించడానికి గానీ మ్యాజిక్‌ బూట్లు పనికిరావు. మంచుకొండలను ఎక్కడానికి గట్టిగా వుండే బూట్లనే ఉపయోగించాలి. అంతేకాక వాటి అడుగుభాగంలో మేకులను కూడా గుచ్చివుంచాలి. అలా చేయడంవల్ల సదరు బూట్లధారి మంచుబండలలో జారిపడే ప్రమాదం వుండదు.

శిరస్త్రాణం తప్పనిసరి

'ఇక్కడ రోడ్ల మీదే అనుకుంటే అక్కడ హిమాలయాలమీద కూడా హెల్మెట్టా' అనుకోకండి. ఇది తప్పనిసరి. దుస్తులు, బూట్ల తర్వాత పర్వతారోహకునికి ముఖ్యంగా వుండవలసిన మరో వస్తువు హెల్మెట్‌. లోపల మెత్తగా పాడింగ్‌లు వున్న దిట్టమైన హెల్మెట్‌ను పర్వతారోహకులు విధిగా ధరించాలి. పర్వతారోహణ ప్రయత్నంలో ఒకవేళ కిందపడినా తలకు దెబ్బతగలకుండా హెల్మెట్‌ కాపాడుతుంది. అంతేకాకుండా కొండలను ఎక్కుతున్నప్పుడు ఏ రాయో రప్పో పైనుండి జారిపడినా తలకు దెబ్బ తగలకుండా ఈ హెల్మెట్‌ కాపాడుతుంది. ఆ కారణంగా పర్వతారోహకులు హెల్మెట్‌లను తప్పనిసరిగా ధరించాలి.దుస్తులు, బూట్లు, హెల్మెట్‌ తర్వాత పెట్టుకోవాల్సింది స్నోగాగుల్స్‌. కొండలెక్కేవారికోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు స్నోగాగుల్స్‌ అనే కళ్లజోళ్లను. ముఖ్యంగా మంచుకొండలలో ప్రతిఫలిస్తున్న సూర్యకాంతి మంచుబండల నుండి పరావర్తనం చెంది మిరుమిట్లు గొలుపుతూ కళ్లకు బైర్లు కమ్మిస్తుంది. ఈ ప్రమాదం జరగకుండా వుండాలంటే కొండలెక్కేవాళ్లు స్నోగాగుల్స్‌ను తప్పకుండా పెట్టుకోవాలి. ప్రత్యేకంగా రూపొందించిన ఈ కళ్లజోడు చలిగాలి జోరు నుండీ, మంచు తాకిడి నుండీ కళ్లను రక్షిస్తుంది కూడా.

ఇతర పరికరాలు

పర్వతారోహకులు తమవెంట తీసుకళ్లాల్సిన ఇతర పరికారలలో ముఖ్యమైనవి తాడు, గొడ్డలి, గాలం వంటి ఇనుప పరికరం తదితరాలు. ప్రతి పర్వతారోహకుడూ తనదంటూ ప్రత్యేకంగా ఓ తాడును తయారుచేయించుకుని దగ్గర వుంచుకోవాలి. ఈ తాళ్లు ఎక్కువగా నైలాన్‌తో తయారుచేస్తారు. ఆ కారణంగా సాగే గుణాన్ని కలిగివుంటాయి. అంతేకాక ప్రమాదవశాత్తు ఆరోహకుడు జారినా పెద్దగా దెబ్బతగలదు.

ప్రారంభకులు పదకొండు మిల్లీమీటర్ల మందంలోవున్న తాడు ఉపయోగిస్తే చాలు. ఈ తాడు కూడా నలభై నుండి యాభై మీటర్ల పొడుగున్నదయితే సరిపోతుంది. కానీ మరీ ఎత్తయిన కొండలను ఎక్కదలుచుకున్నప్పుడు మాత్రం అంతకంటే పొడుగయిన తాళ్లను ఉపయోగించాల్సి వుంటుంది. ఈతాడును ఇతర పరికరాలను శరీరానికి అమర్చి వుంచుకోడానికి వీలుగా పర్వతారోహకులు ప్రత్యేకతరహా బెల్టును నడుముకు కట్టుకుని వుండాలి. ఈ బెల్టుకు ''పైటన్స్‌'', ''కార్బనిర్‌'' వగైరా పేర్లుగల లోహపు పరికరాలు వేలాడుతూ వుంటాయి. కొండలు ఎక్కేటప్పుడు రాళ్లపగుళ్ల మధ్యా, లేక మంచుగడ్డలకు ఈ పైటన్స్‌ అనే పరికరాలను గుచ్చి దానికి తాడుగట్టి పైకి ఎగబాకుతూ వుంటారు. ఈ పరికరాలన్నింటినీ ఆరోహకులు తామే శ్రద్ధగా చూసి ఎన్నిక చేసుకోవాల్సి వుంటుంది.

ఇలా సరంజామా అంతా కుదుర్చుకున్న తర్వాత ఇక పర్వతారోహణకు సిద్ధపడొచ్చు. పర్వతాలను ఎక్కడంలో మూడు పద్ధతులున్నాయి. వీటిని బిలేయింగ్‌, అబ్సెలింగ్‌, ప్రుస్కయింగ్‌ అని అంటారు. మొదటిదయిన బిలేయింగ్‌ పద్ధతిలో పర్వతాలను సులువుగా ఎక్కవచ్చు. ఇందులోనే స్టాటిక్‌బిలే వగైరా ఇతర పద్ధతులు కూడా వున్నాయి. ఈ పద్ధతులలో రాతిబండల మధ్యగా వున్న నెరియలలో పైటన్స్‌ను గుచ్చి దానికి తాడును వేలాడదీసి పైకి పాక్కుంటూ పోతారు. కొండ మరీ కోసుగా వున్నప్పుడు స్టాటిక్‌ బిలే పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలోకానీ, ప్రుస్కయింగ్‌ పద్ధతిలోకానీ కొండల్ని ఎలా ఎక్కాలో మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లవారే శిక్షణ ఇస్తారు.కొండల్ని దిగటాన్ని రాపెలింగ్‌ అంటారు. తాడును పట్టుకుని జర్రున కిందికి లాఘవంగా జారటాన్ని రాపెలింగ్‌ అంటారు. ఒక కోణంలో జారడం ద్వారా జారే వేగాన్ని అదుపు చేసుకుంటూ జాగ్రత్తగా కిందికి దిగాల్సివుంటుంది. మధ్యమధ్యలో అనువయిన చోట్ల కాలు మోపి ఆగుతూ మళ్లీ దిగుతూ వుంటారు పర్వతారోహకులు. రాపెలింగ్‌లో కూడా శిక్షణాలయాలవారు శిక్షణనిస్తూ వుంటారు.

పర్వతం లోకువే

ఈ పద్ధతులన్నింటిలో శిక్షణ పూర్తిచేసుకున్న ఉత్సాహవంతునికి ఇక పర్వతం లోకువగానే కన్పిస్తుంది. పర్వతాలు ఎక్కి దిగడంలో ప్రపంచ వ్యాప్తంగా సాహసికులు పోటీపడుతూనే వున్నారు. సహజంగా ఒకరు వెళ్లినదారికంటే క్లిష్టమైన మార్గంలో ప్రయాణం చేసి తమ ఆధిక్యతను రుజువు చేసుకోవాలని పర్వతారోహకులు పోటీలు పడుతూ వుంటారు. అంతేకాక లంగరువంటి పిటాన్సు పరికరాలను ఉపయోగించకుండా కొండలెక్కి తమ ఆధిక్యతను రుజువు చేసుకోవాలని కూడా ప్రయత్నిస్తుంటారు.పర్వతారోహకులు ముఖ్యంగా మూడు విషయాలలో పోటీలు పడుతూ వుంటారు. అన్నింటికంటే ఎత్తైన శిఖరాన్ని అందరికంటే మనుముందు చేరుకోవాలనీ, మిగతావారికంటే క్లిష్టతరమైన మార్గంలో పయనించి గమ్యం చేరుకోవాలనీ, వీలయినంత వరకు తక్కువ పరికరాలను ఉపయోగించాలనీ. ఈ విషయంలోనే ఒకరితో మరొకరు పోటీపడుతూ తమ సాహసకృత్యాలకు మెరుగులు పెట్టుకుంటారు.

శ్రమ...ఖర్చు

పర్వతారోహణ శ్రమతోనే కాదు ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కూడా. అందుకే సామాన్యంగా కొన్ని సంస్థలు ఇందుకు పూనుకొని పర్వతారోహణకు సిద్ధపడే బృందాలను ప్రోత్సహిస్తూ వుంటాయి. హిమాలయా, ఆల్ఫ్స్‌ వంటి పర్వతాలను సామాన్యంగా ఒక్కరుగా ఎక్కడానికి ఎవరూ సాహసించరు. కొంతమంది ఉత్సాహవంతులు కలిసి బృందాలుగా ఏర్పడి ఇందుకు పూనుకుంటూ వుంటారు. ఏ ఎవరెస్టు శిఖరమో, కాంచనగంగో అధిరోహించదలచుకున్నప్పుడు పర్వతారోహక బృందాలవారు మధ్య మధ్యలో మజిలీలు చేస్తూ వుంటారు. ఇలా క్యాంపులు వేసుకోవడానికి అవసరమయ్యే గుడారపు సామాగ్రినీ, ఇతర వస్తువులనూ మోసుకెళ్లడానికీ, మార్గదర్శకంగా వుండడానికీ హిమాలయ పర్వతారోహకులు స్థానిక షెర్పాలను కూడా తోడుతీసుకెళ్తుంటారు.పర్వతారోహణలో శిక్షణనిచ్చే మౌంటెనీరింగ్‌ సంస్థలు అమెరికా, యూరోప్‌ ముఖ్యంగా స్విట్జర్లాండ్‌ వంటి దేశాలలో చాలా వున్నాయి. మన దేశంలో హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్ల పేరుతో కులూ లోయలోని మనాలిలోనూ, ఉత్తర కాశీలోనూ శిక్షణాలయాలున్నాయి. డార్జిలింగ్‌లో కూడా ఒక ఇన్‌స్టిట్యూట్‌ వుంది. అసలు డార్జిలింగ్‌లోని శిక్షణాలయమే మిగతా రెండింటికంటే పెద్దదని చెప్పొచ్చు. పర్వతారోహణ అంటే సరదా, ఉత్సాహం వున్నవారంతా ఈ శిక్షణాలయాలలో ట్రైనింగ్‌ అయి పర్వతాలపైకి సాగుతూ వుంటారు.

అనాదిగా ప్రకృతికీ మానవునికీ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నిటినో జయించానని మనిషి సంతృప్తి పడుతున్నా ఇంకా ఛేదించలేని ప్రకృతి రహస్యాలు అనేకం వున్నాయి. అలాగే మానవుడు ఎన్ని ఉన్నత పర్వత శిఖరాలను అధిరోహించినా తను ఇంకా అడుగుపెట్టని కొండకొమ్ములు కొన్ని మిగిలేవుండి వుండవచ్చు. వాటన్నింటినీ పరామర్శించే దాకా మనిషికి తృప్తి వుండదు. విశ్రాంతి వుండదు. అందాకా సాహసంతో కూడిన పర్వతారోహణ సరదాలకు అంతం వుండదు.

ఎవరెస్ట్‌ ఎక్కిన చిన్నోడు

కలలు అందరూ కంటారు. అయితే కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. ఆ కొందరిలో ఒకడు పదహారేళ్ల అర్జున్‌ వాజ్‌పేయి. గత నెల 22వ తేదీన తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నాడీ చిచ్చరపిడుగు. భారతదేశంలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన అతిపిన్న వయస్కుడు. నోయిడాలోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని మూడుమార్లు ముద్దాడిన జ్యోత్‌ సింగ్‌ ధిల్లాన్‌ అంటే అర్జున్‌కు చాలా అభిమానం. ఆయన చేసిన సాహసాలను విని ఎంతగానో స్ఫూర్తి పొందాడు. ఉత్తరకాశిలో పర్వతారోహణ శిక్షణ పొందాడు. గత నెల 18న ఎవరెస్ట్‌ అధిరోహణ ప్రారంభించాడు. లక్ష్యాన్ని చేరుకునేలోపు కొన్ని ఇబ్బందులూ ఎదురయ్యాయి. పర్వత శిఖరం పైపైకి వెళ్లే కొద్దీ... వీపుమీదున్న సిలిండర్‌లో ఆక్సిజన్‌ తరిగిపోయే కొద్దీ... శ్వాస తీసుకోవడం కష్టమైంది. వణికించే మంచు, చలిగాలుల్లో పడుకునేసరికి వెన్ను నొప్పి పుట్టేది. అయినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయక, వెరవక, బెదరక తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ... పైకి సాగిపోయాడు. 22 వతేదీ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. రికార్డు సృష్టించాడు. అక్కడి నుంచి ప్రపంచాన్ని చూస్తుంటే అర్జున్‌కు ఎంతో ఆనందం కలిగింది. ఎవరెస్ట్‌ పరిసరాల్లో వున్న చిన్న పర్వతాలన్నీ చిన్నచిన్నగా కనిపించాయి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ప్రదేశంలో వున్నంతసేపూ ఎంతో ఉద్విగతకు లోనయ్యాడు. ఎవరెస్ట్‌ను ఎక్కేటప్పుడూ, దిగేటప్పుడూ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయితేనేం అనుకున్నది సాధించాడు. ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, ధైక్వాండో, మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన అర్జున్‌ భవిష్యత్‌ లక్ష్యం ఎవరెస్ట్‌ తర్వాత ఎత్తైన పధ్నాలుగు శిఖరాలమీద కాలూనడమే.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్