చట్టాలు ప్రజలకు ఉపయోగపడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో శనివారం బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రధమ అడ్వకేట్‌జనరల్ డి. నరసరాజు స్మారకోపన్యాసం ఏర్పాటు చేశారు. 'రాజ్యాంగం ఎదర్కొంటున్న సవాళ్ళు-న్యాయస్థానం పాత్ర' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక కట్టుబాట్లతోపాటు నైతిక విలువలకు లోబడి ఉండాలని కోరారు న్యాయస్థానంలో న్యాయమూర్తులు తీర్పు చెప్పడంలో మానవీయ విలువలను కాపాడాలని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇది అమలు కావడానికి కనీసం మరో 50సంవత్సరాలైనా పడుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాధికారాల్లో పౌరసంస్థలకు భాగస్వామ్యం కల్పించినప్పుడే ప్రజల వాణి వినిపిస్తుందని పేర్కొన్నారు. . ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చట్టాలు ఉండాలని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదని అణగారిన వర్గాలను అభివృద్థిలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ప్రధానంగా అధికారులు, రాజకీయనాయకులు ప్రత్యేక చొరవ చూపించినప్పుడే సాధ్యమని అన్నారు. రాజకీయాధికారం సామాన్య ప్రజల చేతికందినప్పుడే ఈ సమస్య పరిష్కారమౌతుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను ప్రజలకు అందిస్తున్నామా లేదా అనేది ప్రభుత్వం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్ దావే, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పిపి రావు, మాజీ బార్ కౌన్సిల్ చైర్మన్ డివి సుబ్బారావు పాల్గొన్నారు.