నిరాశానిస్పృహల్లో కార్మికులు : ఐఎన్‌టియుసి

    కేంద్రంలో రెండోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిందని, మంచి రోజులు వస్తాయని కార్మికులందరూ ఆశించారని, కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుండటంతో వారంతా నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు జి సంజీవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళానని అన్నారు. ఆర్థికమాంద్యం దెబ్బతో దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళన చెందుతున్నారని, 59 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని శనివారం గాంధీభవన్‌లో జరిగిన ఐఎన్‌టియుసి రాష్ట్ర సమావేశంలో ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ మాంద్యంతో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని ఇటీవల అన్ని ట్రేడ్‌యూనియన్లతో కలిసి ప్రధానిని కలిశామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా కాంగ్రెస్‌పార్టీకి మద్దతిస్తున్నామని, సమస్యలపై పోరాటంలో రాజీపడటం లేదని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయడం ప్రభుత్వాల బాధ్యతని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు కార్మికులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని, వారికోసం చౌక డిపోలను ఏర్పాటుచేసి తక్కువ ధరలతో వస్తువులను అందించాలని, కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయకున్నా వారితో సమానంగా వేతనాలు అందించాలని, బోనస్‌ చట్టాన్ని మార్చాలని, నెలకు కనీస వేతనాన్ని ఏడు వేల రూపాయలు చేయాలని, అసంఘటిత కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని, విద్యుత్‌ శాఖలో ఏర్పాటు చేసినట్లు మిగతా చోట్ల కూడా వేతన బోర్డును నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి రంగంలోనూ కాంట్రాక్టు కార్మికులు పెరుగుతున్నందున, వారితో కలిసి యూనియన్లను ఏర్పాటుచేయాలని, లేకుంటే సంఘం కనుమరుగౌతుందని తెలిపారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్